కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో కొలువులకు నోటిఫికేషన్లు రాకపోవడంతో యువతలో నైరాశ్యం నెలకొంది. ఇన్నాళ్లు నోటిఫికేషన్ల కోసం ఎదురుచూసి విసిగిపోయిన యువత మళ్లీ ఉసురు తీసుకుంటున్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ప్రాణాలు అర్పించిన యువతనే.. ఇప్పుడు మళ్లీ ఉద్యోగాల కోసం ప్రాణత్యాగాలు చేయాల్సి వస్తోంది. మొన్నటికిమొన్న కేయూ విద్యార్థి సునీల్ నాయక్ ఆత్మహత్యను మరిచిపోకముందే.. సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలో మరో దారుణం చోటుచేసుకుంది. కోనరావుపేట మండలం వట్టిమల్ల గ్రామానికి చెందిన ముచ్చర్ల మహేందర్ యాదవ్ ఉద్యోగం రావడం లేదని సూసైడ్ చేసుకున్నాడు.
ఎన్నో పోరాటాలు.. మరెన్నో త్యాగాలు.. ఇంకెందరి ప్రాణాలో తృణప్రాయంగా వదిలేస్తేనే తెలంగాణ ప్రజల ప్రత్యేక ఆకాంక్ష నెరవేరింది. ప్రత్యేక రాష్ట్రం వస్తే ఇంటికో ఉద్యోగం వస్తుందని యువత ఆ టైమ్‌లో సంబరపడింది. తమ జీవితాలు బాగుపడుతాయని ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డ మురిసిపోయింది. కానీ.. ఏం లాభం తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో ఏ ఒక్క కుటుంబం బాగుపడిన దాఖలాలు లేవు.
ఎన్నికల వేళ సైతం పాలకులు ఎన్నో హామీలు ఇచ్చారు. ఉద్యోగులకు నోటిఫికేషన్లు అన్నారు.. లేదంటే నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. కులాల వారీగా ఆదుకుంటామన్నారు. ఆ హామీలు నెరవేరుతాయేమోనని గత ఆరేడేండ్లుగా ఎదురుచూస్తూనే ఉన్నారు. ఇక యువతలో కూడా ఓపిక నశించినట్లైంది. తెలంగాణ ప్రభుత్వంపై తాడోపేడో తేల్చుకోలేక మరోసారి బలిపీఠం ఎక్కుతున్నారు. ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. సీఎం కేసీఆర్‌పై ఒత్తిడి పెంచాలని నిరుద్యోగ యువత ప్రయత్నాలు ప్రారంభించింది.
మరోవైపు.. రాష్ట్రంలో ఉద్యోగాల కోసం నిరుద్యోగ యువత బలిదానాలు చేస్తుండడంతో ప్రతిపక్ష పార్టీ బీజేపీ ఫైర్ అవుతోంది. ఈ ఆత్మహత్యలు చూసేందుకేనా తెలంగాణ తెచ్చుకున్నది అని నిలదీస్తోంది. ఈ అంశాన్ని బీజేపీ తనకు పాజిటివ్ మలచుకోవాలని ప్రయత్నిస్తోంది. ఇప్పటికే సునీల్ నాయక్ మరణంపై ప్రభుత్వాన్ని బీజేపీ ఎడాపెడా ఆడేసుకుంది. మరి ఇప్పుడు మహేందర్ యాదవ్ ఆత్మహత్య నేపథ్యంలో ఎలా స్పందిస్తుందో చూడాలి.