ప్రస్తుతం రాజకీయ నాయకుల్లో సోషల్ మీడియాలో అత్యధికంగా ఫాలోయింగ్ ఉన్న నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది నరేంద్ర మోదీనే. సోషల్ మీడియాను ఆయన చక్కగా వినియోగించుకుంటూ ఎప్పటికప్పుడు దేశంలో జరుగుతున్న పరిస్థితులపై ఆరా తీస్తుంటారు. వాటిపై వెంటనే రియాక్ట్ అవుతూ ప్రజల మనస్సును చూరగొనే ప్రయత్నం చేస్తుంటారు. లాక్ డౌన్లోనూ మోదీ సోషల్ మీడియాను వాడినంతగా మరే నేత కూడా ఉపయోగించలేదంటే అతిశయోక్తి కాదేమో.. తాజాగా మోదీకి సోషల్ మీడియాలో నిరసన సెగ తాకడం దేశంలో చర్చనీయాంశంగా మారింది.
సెప్టెంబర్ 17న ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా ప్రముఖంతా ఆయనకు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలిపారు. మోదీ 70వ పుట్టిన రోజు సందర్భంగా సోషల్ మీడియాలో #Happy Birthday PM Modi హ్యష్ ట్యాగ్ ట్రెండ్ అయింది. బీజేపీ నాయకులు, కార్యకర్తలు, మోదీ అభిమానులు ఆయనను పెద్దసంఖ్యలో పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. అయితే మోదీ పుట్టిన రోజు సందర్భంగా సోషల్ మీడియా వేదికగా పెద్దఎత్తున ఆయనకు నిరసన తగలింది.
మోదీ పుట్టిన రోజుకు సమాంతరంగా కొన్ని రాజకీయ పార్టీలు.. కొంతమంది వ్యక్తులు సోషల్ మీడియాలో నిరసనకు పిలుపునిచ్చారు. ‘నేషనల్ అన్ ఎంప్లాయ్‌మెంట్ డే (జాతీయ నిరుద్యోగ దినోత్సవం)’ హ్యాష్ ట్యాగ్ ను ట్రెండింగులోకి తీసుకొచ్చారు. గురువారం ఒక్కరోజే దీనికి 16లక్షలకు పైగా ట్వీట్లు వచ్చాయి. ‘హ్యాపీ బర్త్‌డే పీఏం మోదీ’ అనే హ్యాష్ ట్యాగ్ కంటే మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చిన ట్వీట్లే ఎక్కువగా ఉన్నాయట.
ప్రధానంగా నిరుద్యోగం.. ఆర్థిక సంక్షోభంపై ప్రధానిని యువత నిలదీసినట్లు తెలుస్తోంది. సోషల్ మీడియాలో యాక్టివ్ ఉండే ప్రధాని మోదీకి దేశ ప్రజలు అక్కడే షాకివ్వడం కొసమెరుపు. కేంద్రంపై ప్రజల్లో నివురుగప్పిన నిప్పులా ఉన్న వ్యతిరేకత ఈ హ్యష్ ట్యాగుల రూపంలో బయటికొచ్చిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ప్రజల్లో కేంద్రంపై ఉన్న వ్యతిరేకతను పొగొట్టేలా ప్రధాని మోదీ రానున్న రోజుల్లో ఎలాంటి కార్యక్రమాలు చేస్తారో వేచి చూడాల్సిందే..!