Vizag: విశాఖలో దారుణం.. అందరూ చూస్తుండగానే యువకుడిని చంపేసిన ఎలుగుబంటి

సోమవారం ఉదయం జూను తెరిచారు. వందలాదిమంది పర్యటకులు జూలోకి ప్రవేశించారు. ఈ క్రమంలో ఎలుగుబంటి ఎన్ క్లోజర్ వద్ద నగేష్ అనే అవుట్సోర్సింగ్ ఉద్యోగి శుభ్రం చేస్తున్నాడు.

Written By: Dharma, Updated On : November 27, 2023 5:39 pm
Follow us on

Vizag: అది విశాఖ జూ పార్క్. నగరంతో పాటు ఉత్తరాంధ్ర ప్రాంతాల నుంచి పర్యాటకులు విపరీతంగా వచ్చారు. ప్రదర్శనశాలలో జంతువులను చూస్తున్నారు. ఇంతలో ఓ ఎలుగుబంటి యువకుడి పై దాడి చేసింది. దారుణంగా కొరికి తీవ్రంగా గాయపరిచింది. ఈ హఠాత్ పరిణామంతో పర్యాటకులు పరుగులు తీశారు. జూ అధికారులు స్పందించి చర్యలు చేపట్టినా.. ఆ యువకుడి ప్రాణాలను మాత్రం కాపాడలేకపోయారు. ఇందుకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.

సోమవారం ఉదయం జూను తెరిచారు. వందలాదిమంది పర్యటకులు జూలోకి ప్రవేశించారు. ఈ క్రమంలో ఎలుగుబంటి ఎన్ క్లోజర్ వద్ద నగేష్ అనే అవుట్సోర్సింగ్ ఉద్యోగి శుభ్రం చేస్తున్నాడు. గేటు మూసివేసి ఉందని ధీమాతో తన పని తాను చేసుకుంటున్నాడు. కానీ గేటుకు తాళాలు వేయకపోవడంతో ఎలుగుబంటి బయటకు వచ్చింది. పనిచేస్తున్న నగేష్ పై దాడికి పాల్పడింది. అక్కడికి కూత వేటు దూరంలో సందర్శకులు ఉన్నారు. కేకలు వేయడంతో జూ అధికారులు అప్రమత్తమయ్యారు. ఎలుగుబంటిని బంధించి.. తీవ్ర గాయాలు పాలైన నగేష్ ను ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే నగేష్ మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

కార్తీక మాసం కావడంతో ప్రతిరోజు జూకు వందలాదిమంది సందర్శకులు వస్తున్నారు. అందులో పిల్లలే అధికం. ఈ నేపథ్యంలో ఈ ఘటన జరగడం ఆందోళన రేకిత్తిస్తోంది. జూలో భద్రతపై అనేక రకాల అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రస్తుతం ఈ జంతు ప్రదర్శనశాలలో చాలా రకాల జంతువులు ఉన్నాయి. కానీ సరైన రక్షణ చర్యలు లేవని చాలా రోజులుగా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో సిబ్బంది ఒకరు ఎలుగుబంటి దాడిలో మృతి చెందడం మరింత ఆందోళనను రేకెత్తిస్తోంది. అయితే ఈ ఘటనకు సంబంధించి ఎన్ క్లోజర్కు తాళాలు ఎవరు తీశారు. ఒకవేళ తాళాలు పనిచేయలేదా? ఉద్దేశపూర్వకంగా ఎవరైనా తీశారా? అన్నది తెలియాల్సి ఉంది. దీనిపై ఆరిలోవ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.