కర్ణాటక రాజకీయాలు విచిత్ర మలుపులు తిరుగుతున్నాయి. ముఖ్యమంత్రులను మార్చే సంస్కృతికి బీజేపీ సైతం వంత పాడుతోంది. ఇన్నాళ్లు ముఖ్యమంత్రులను మార్చే విధానం కాంగ్రెస్ కే ఉందని విమర్శలు చేసినా ప్రస్తుతం బీజేపీ కూడా సీఎం లను మార్చే పద్దతి పాటించడం గమనార్హం. రాబోయే ఎన్నికల్లో కర్ణాటకలో బీజేపీకి గడ్డు రోజులే అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. యడ్యూరప్పకు ఉన్న ఇమేజ్ బసవరాజ్ కు లేదనే విషయం అందరికి తెలుసు.. కానీ బీజేపీ మాత్రం ఎందుకు పక్కన పెట్టిందనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి.
బసవరాజ్ బొమ్మై మాజీ ముఖ్యమంత్రి ఎస్ఆర్ బొమ్మై కొడుకు. జనతాదళ్ నుంచి బీజేపీలో చేరిన బొమ్మై రెండు సార్లు ఎమ్మెల్సీ, మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఈసారి బ్రాహ్మణ సామాజిక వర్గానికి సీఎం పదవి ఇవ్వాలని అధిష్టానం చూసిన యడ్యూరప్ప సూచించిన బొమ్మైకి సీఎం పదవి కట్టబెట్టింది. అయితే బొమ్మైకి మాత్రం ప్రజలతో సంబంధాలు సరిగా లేవనే విషయం కూడా అందరికి తెలిసిందే. ఆయనకు ఉన్న ఒకే ఒక్క ప్లస్ పాయింట్ లింగాయత్ సామాజికవర్గం కావడమే.
లింగాయత్ సామాజికవర్గం మొదటి నుంచి బీజేపీకే మద్దతు ఇస్తుంది. అయితే యడ్యూరప్పకు ఉన్న విలువ బొమ్మైకి లేకపోవడంతో ఈసారి ఎన్నికల్లో బీజేపీకి కష్టాలే అని నిపుణులు చెబుతున్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ కు బీజేపీ దారి వెతికి పెడుతోందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పుంజుకోవడానికి బీజేపీనే పరోక్షంగా కారణమవుతుందని సమాచారం.
యడ్యూరప్పను సీఎం పదవి నుంచి తప్పించడంతో జనతాదళ్ కూడా బీజేపీ వైపు చూసే అవకాశం లేదు. దీంతో కాంగ్రెస్ కనుక పుంజుకుంటే బీజేపీ మనుగడకు ప్రశ్నార్థకం ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ సమన్వయంతో పనిచేస్తే బీజేపీ వైఫల్యం ఖాయమే అని సర్వేలు సైతం వెల్లడిస్తున్నాయి. దీంతో కాంగ్రెస్ పార్టీకి మరో అవకాశం చిక్కినట్లు అవుతోంది.