
‘సినిమా కష్టాలు’ అనే మాటను ఎగతాళికి పర్యాయపదంగా వాడుతుంటారు గానీ.. నిజానికి సినిమాను తెరకెక్కించడానికి దర్శకుడు పడే కష్టం బయటి వాళ్లకు తెలియదు. తెలియడం అసాధ్యం కూడా. అది అనుభవించిన వారికి మాత్రమే అర్థమయ్యే విషయం. మానసికంగా ఎన్నో సవాళ్లను అధిగమించాల్సి ఉంటుంది. ఇంతా చేసి సినిమా విడుదల చేస్తే.. రెండున్నర గంటల్లో దాని జాతకం తేలిపోతుంది. హిట్టైతే సరే.. లేకపోతే అంతే! స్టార్ డైరెక్టర్ అయితే.. స్థానం జారిపోతుంది. న్యూ, మీడియం రేంజ్ దర్శకుడైతే నెక్స్ట్ ఛాన్స్ సంపాదించుకోవడమే గగనం. ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొని, ఒక దశలో డిప్రెషన్లోకి వెళ్లిపోయి, చనిపోవాలని కూడా అనుకున్నాడట ఈ దర్శకుడు!
ఆయనే.. బాలీవుడ్ డైరెక్టర్ ఓం ప్రకాష్ మెహ్రా. 2009లో ఆయన తెరకెక్కించిన ‘ఢిల్లీ-6’ అనే సినిమా విడుదలైంది. అభిషేక్ బచ్చన్, సోనమ్ కపూర్ జంటగా నటించిన ఈ మూవీ భారీ ఫ్లాప్ గా నిలిచింది. మెహ్రాపై ఓ రేంజ్ లో విమర్శలు వచ్చాయి. దీంతో.. ఆయన డిప్రెషన్లోకి వెళ్లిపోయాడట. మానసికంగా మరింతగా కుంగిపోవడంతో ఇంటికే పరిమితమైపోయి మద్యానికి సైతం బానిసగా మారిపోయారట.
నిత్యం అదే వేదనలో ఉంటూ.. భవిష్యత్ గురించి తలుచుకుని ఆందోళన చెందేవారట. ఈ వేదన తట్టుకోలేక చనిపోవాలని కూడా నిర్ణయించుకున్నారట. బాగా తాగి తాగి చచ్చిపోవాలని కూడా అనుకున్నారట. ఇలాంటి బిహేవియర్ తో కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టాడట మెహ్రా. ఆ తర్వాత తన భార్య సహకారంతోనే తిరిగి సాధారణ మనిషిగా మారిపోయారట.
ఈ విషయాలన్నీ తన ఆటో బయోగ్రఫీ.. ‘ది స్ట్రేంజర్ ఇన్ ది మిర్రర్’ అనే పుస్తకంలో ప్రస్తావించాడు. అనంతరం మళ్లీ యాక్టివ్ అయిన మెహ్రా.. ‘రంగ్ దే బసంతి’, భాగ్ మిల్కా భాగ్’ వంటి సూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించి, తనను తాను నిరూపించుకున్నారు. తాజాగా.. ‘తుఫాన్’ అనే సినిమాను కూడా తెరకెక్కించారు. ప్రస్తుతం ఈ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.