Pawan Kalyan- YCP: జనసేనాని మాటల తూటాలకు వైసీపీ ఉక్కిరిబిక్కిరి అయిందా ? రణస్థలం వేదికగా ఎన్నికల రణరంగానికి నగారా మోగించారా ? పవన్ కళ్యాణ్ వ్యూహంతో వైసీపీలో భయం మొదలైందా ? అంటే.. జరుగుతున్న పరిణామాలు చూస్తే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో జనసేన యువశక్తి కార్యక్రమం నిర్వహించింది. యువశక్తి వేదికగా అధికార పార్టీ పై సమర శంఖం పూరించింది. అధికార పార్టీ నేతల్లో వణుకు పుట్టేలా జనసైన్యం గర్జించింది.

“మూడు ముక్కల ముఖ్యమంత్రి.. ప్రజల మధ్య, ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతున్నారు. భయపెడితే భయపడం.. ఎదురొస్తాం.. ఎదుర్కొంటాం. 2024లో మీ ఆటలు సాగనివ్వం. నీచ్ కమీన్ కుత్తే మంత్రులు, సంబరాల రాంబాబూ, గుడివాడ అమర్నాథ్. నోటికొచ్చినట్టు వాగుతున్నారు. మరోసారి ప్యాకేజీ కోసం వెళ్లానని అంటే జనసైనికుల చెప్పుతో కొడతాం. వీర మహిళ చెప్పుతో కొడతాం. జనసైనికులు కొదమ సింహాలు. గ్రామ సింహాలు మనల్ని పాలిస్తున్నాయి. గ్రామసింహాలు నోటికొచ్చినట్టు మొరుగుతుంటే చూస్తూ ఊరుకుంటారా ?. కొదమసింహాల్లా గర్జిస్తారా ?“ అంటూ పవన్ ఉద్వేగపూరితమైన ప్రసంగాన్ని రణస్థలం యువశక్తి కార్యక్రమంలో ప్రసంగించారు.
జనసేనాని మాటలు తూటాల్లా వైసీపీ నేతల గుండెల్లో గుచ్చుకున్నాయి. అవినీతిపరులు, జైల్లో ఉండి వచ్చిన వారు తనను విమర్శిస్తూ ఉంటే నవ్వొస్తోందని ఎద్దేవా చేశారు. మంత్రులను టార్గెట్ చేసి మాటల దాడి చేశారు. ప్రభుత్వ విధానాలను బట్టలిప్పి ఎండగట్టారు. ఉద్దానాన్ని ఎందుకు ఉద్దరించలేదని, ఉత్తరాంధ్ర వెనుకబాటుకు కారణమెవ్వరని ప్రశ్నించారు. ఆద్యంతం పవన్ ప్రసంగం ఉద్వేగంతో, ఆలోచన రేకెత్తించే విధంగా సాగింది. పవన్ ప్రసంగానికి జనసైనికులు ఈలలు, కేరింతలు కొట్టారు.

2024లో మార్పు కోసం తన వెంట నడవాలని, కేసులకు.. జైళ్లకు భయపడొద్దని అభయమిచ్చారు. జనసేనాని మాటలు అధికార పార్టీలో గుబులు పుట్టించింది. 2024 ఎన్నికల చిత్రం కళ్లకు కనపడేలా పవన్ ప్రసంగం సాగింది. వైసీపీలో అంతర్మథనం మొదైలంది. రణస్థలం వేదికగా జనసేనాని క్లియర్ కట్ మెసేజ్ ఇచ్చారు. దీంతో వైసీపీలో భయం పుట్టుకుంది.