JanaSena: ఏపీలో రాజకీయాల శరవేగంగా మారుతున్నాయి. అన్ని పార్టీలు అభ్యర్థుల ఎంపికపై దృష్టి పెట్టాయి. టిక్కెట్లు దక్కని వారు భవిష్యత్ కార్యాచరణ పై దృష్టి పెట్టారు. తమకు అవకాశం ఇచ్చే పార్టీల వైపు అడుగులు వేస్తున్నారు. ముఖ్యంగా అధికార వైసీపీ పెద్ద ఎత్తున అభ్యర్థులను మార్చుతుండడంతో.. వారంతా ఇతర పార్టీలో చేరి అవకాశాలు దక్కించుకోవాలని చూస్తున్నారు. ఈ తరుణంలో ఓ వార్త హల్చల్ చేస్తోంది. వైసిపి సిట్టింగ్ ఎమ్మెల్యే ఒకరు జనసేనలో చేరనున్నారని టాక్ నడుస్తోంది. పొలిటికల్ సర్కిల్ లో ప్రచారం జరుగుతోంది.
సీఎం జగన్ కొత్త లెక్కలు వేసుకుంటున్నారు. టిడిపి, జనసేన పొత్తుతో గట్టి ఫైట్ ఉంటుందని భావిస్తున్నారు. ముఖ్యంగా గోదావరి జిల్లాల్లో ఈ పొత్తు ప్రభావం అధికంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. అందుకు అనుగుణంగా అభ్యర్థుల ఎంపికపై దృష్టి పెట్టారు. దాదాపు అన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థుల మార్పు విషయమై ఒక నిర్ణయానికి వచ్చారు. పిఠాపురం సిట్టింగ్ ఎమ్మెల్యేని మార్చి.. ఆ స్థానంలో కాకినాడ ఎంపీగా ఉన్న వంగా గీతను పోటీ చేయించాలని భావిస్తున్నారు. దీంతో అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే దొరబాబు పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. ఆయనకు కనీసం పక్క నియోజకవర్గమైన కేటాయించే ఛాన్స్ కనిపించడం లేదు. దీంతో దొరబాబు పార్టీని వీడేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది.
ఇటీవల వరుసగా అనుచరులతో దొరబాబు సమావేశం అయ్యారు. వారు వద్దనుకున్నప్పుడు మనం ఎందుకు వెంపర్లాడాలని శ్రేణులు వద్ద ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. పోటీకి సిద్ధంగా ఉన్నానని.. కార్యకర్తలు అండగా నిలవాలని ఆయన కోరారు. దీంతో ఆయన ఏదో ఒక పార్టీలో చేరతారని అనుమానాలు ఉన్నాయి. ఇప్పటికే జనసేన కీలక నాయకులకు దొరబాబు టచ్ లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. 2004లో బిజెపి తరఫున దొరబాబు గెలుపొందారు. 2009లో మాత్రం ప్రజారాజ్యం తరఫున వంగా గీత విజయం సాధించారు. అందుకే జగన్ ఆమెను వ్యూహాత్మకంగా తెరపైకి తెచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు కాపు ఉద్యమమాజీ నేత ముద్రగడ సైతం పోటీ చేస్తారని టాక్ నడుస్తోంది. వైసీపీలో చేరిన తర్వాత ముద్రగడ కానీ.. ఆయన కుమారుడు కానీ ఏదో ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేయించాలి. అందుకే పిఠాపురం సిట్టింగ్ ఎమ్మెల్యే దొరబాబును పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. దీంతో దొరబాబు సైతం గట్టి రివెంజ్ తీర్చుకోవాలని చూస్తున్నారు. అందుకు జనసేన అయితే సరిపోతుందని భావిస్తున్నారు. కానీ జనసేన హై కమాండ్ మదిలో ఏముందో చూడాలి.