
ఏపీలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నన్ని రోజులూ రాజధాని మీదనే ఫోకస్ పెట్టారు. ప్రజా సంక్షేమాన్ని పెద్దగా పట్టించుకోలేదు. అందుకే.. 2019 ఎన్నికల్లో ప్రజలు అలాంటి తీర్పు ఇచ్చారు. ఇక అధికారంలోకి వచ్చిన జగన్ ఎంతసేపూ సంక్షేమ పథకాలపైనే ఫోకస్ పెట్టారు. అమరావతి రాజధాని ప్రాధాన్యాన్ని వీలైనంతగా తగ్గించేలా చూస్తున్నారు. ఇందులో భాగంగానే ఇటీవల ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి నేతృత్వంలో పురపాలక మంత్రి బొత్స సత్యనారాయణ, ఉన్నతాధికారులు పాల్గొన్న ఏఎంఆర్డీయే (అమరావతి మెట్రోపాలిటన్ రీజియన్ డెవల్‌పమెంట్ అథారిటీ) సమావేశం కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.
ప్రధానంగా… ట్రంక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ల్యాండ్ పూలింగ్ స్కీం(ఎల్పీఎస్) జోన్లలో చేపట్టదలచిన పనుల అంచనాలను సుమారు మూడొంతులకు కుదించడమే కాకుండా వాటినీ అరకొరగానే చేపట్టాలనుకోవడం అత్యంత ముఖ్యమైనది. అలాగే, అమరావతి స్మార్ట్ సిటీ ప్రాజెక్టుల సంఖ్యను 20 నుంచి 10కి తగ్గించడం, వీటి నిధులనూ సగానికిపైగా తగ్గించేయాలని నిర్ణయించారు. అమరావతిలో ట్రంక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఎల్పీఎస్ జోన్లలో మౌలిక వసతుల అభివృద్ధికి రూ.29,282 కోట్ల వ్యయమవుతుందని, అయితే ప్రాధాన్యతాక్రమాన్ని అనుసరించి ముఖ్యమైన వాటిని చేపట్టేందుకు రూ.11,093 కోట్లు ఇస్తే చాలంటూ ఆర్థిక శాఖకు ఏఎంఆర్డీయే తెలిపింది.
ఇందులో రూ.10,000 కోట్లను 3 వాయిదాల్లో రుణంగా ఇచ్చేందుకు బ్యాంకుల కన్సార్షియం ముందుకొచ్చిందని, అందుకు ప్రభుత్వ పూచీకత్తును కోరిందని పేర్కొంది. ప్రభుత్వం గ్యారంటీ ఇస్తే తొలి విడతలో రూ.3,000 కోట్లను బ్యాంకులిస్తాయని, వాటితో ఎల్పీఎస్, ట్రంక్ ఇన్‌ఫ్రా పనులు చేపడతామని తెలిపింది.
రాజధానిలో ఇన్‌ఫ్రా పనులను ప్రాధాన్యతాక్రమం పేరిట కుదించడాన్ని ‘అభినందించిన’ ఆర్థిక శాఖ వాటికి అవసరమయ్యే నిధుల్లో తొలిగా రూ.3,000 కోట్లను రుణంగా తీసుకునేందుకూ సమ్మతి తెలిపింది. కానీ.. ఏఎంఆర్డీయే అభ్యర్థించిన విధంగా దానికి రాష్ట్ర ప్రభుత్వ పూచీకత్తును ఇవ్వకుండా ఆ మొత్తాన్ని లోన్‌గా పొందేందుకు గల అవకాశాలను పరిశీలించాల్సిందిగా ఏపీయూఐఏఎంఎల్, ఏఎంఆర్డీయేలను ఆదేశించింది. మొత్తంగా చూస్తే అమరావతిలో డెవలప్‌మెంట్ వర్క్స్ తగినంత మేర తగ్గించాలనే వైసీపీ ప్రభుత్వం లక్ష్యంగా కనిపిస్తోంది. దీనికితోడు ఫండ్స్ కొరత కూడా ఉండడంతో ఇప్పుడప్పుడే రాజధాని గొడవలకు వెళ్లడానికి సాహసించడం లేదని తెలుస్తోంది.