
Vijayasai Reddy- Chandrababu: ఇటీవల వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యవహార శైలిలో స్పష్టమైన మార్పు వచ్చింది. అస్సలు బొత్తిగా కనిపించడం మానేశారు. తాడేపల్లి ప్యాలెస్ లో కనిపించడం లేదు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై మాట్లాడలేదు. వివేకా హత్యకేసు విచారణపై స్పందించ లేదు. ఎక్కడో లెక్క తప్పింది. లింకు తెగినట్టుంది. అందుకే ఆయన ఢిల్లీకే పరిమితమయ్యారు. ఆన్ ది రికార్డు.. ఆఫ్ ది రికార్డు విజయసాయి ఊసే లేకుండాపోతోంది. అటు ప్రత్యర్థులపై విమర్శల జడివాన తగ్గించారు. కాదు పూర్తిగా తగ్గించేశారు. నోరు తెరిస్తే చంద్రబాబు, లోకేష్ లపై విరుచుకుపడే ఆయన వారి పట్ట సాఫ్ట్ కార్నర్ గా మారిపోయారు. తారకరత్న మరణం తరువాత వారిపై వ్యతిరేక భావన ఎక్కడా బయటపెట్టిన దాఖలాలు లేవు.
ఆసక్తికరంగా ట్విట్..
చంద్రబాబు తన పుట్టిన రోజు వేడుకలు గురువారం ఏపీ వ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నారు. సినీ, రాజకీయ ప్రముఖులు ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతున్నారు. అనూహ్యంగా విజయసాయిరెడ్డి కూడా శుభాకాంక్షలు తెలిపారు. తన ట్విట్టర్ లో పోస్టు పెట్టారు. ‘టీడీపీ అధ్యక్షులు, ప్రతిపక్ష నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. సంపూర్ణ ఆరోగ్యం, దీర్ఘాయుష్షుతో మరెన్నో ఆనందకరమైన పుట్టినరోజులు జరుపుకోవాలని ఆకాంక్షిస్తున్నా’ అని ట్వీట్ చేశారు. గతంలో ఎప్పుడూ విజయసాయిరెడ్డి శుభాకాంక్షలు తెలిపిన పరిస్థితి లేదు. ఇటువంటి సందర్భాల్లో ట్విట్ చేసినా.. అందులో వ్యంగ్యాస్త్రాలు ఉండేవి. కానీ ఈసారి మనస్పూర్తిగా చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలపడం విశేషం.
నెటిజన్ల అభినందనలు..
టెంపర్ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ ని ఉద్దేశించి పోసాని పలికిన డైలాగ్స్ ను గుర్తుచేస్తూ నెటిజన్లు ఎంపీ విజయసాయిరెడ్డిని అభినందిస్తున్నారు. ‘మీరు మారిపోయారు’ సర్ అంటూ పెద్ద ఎత్తున ట్వీట్స్ చేస్తున్నారు. మీ నుంచి ఇది ఊహించలేదంటూ కొందరు.. మీరు ఇలాగే ఉండండి సార్ అంటూ కొందరు.. ఇది మేము ఊహించలేదు సార్ అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. అటు టీడీపీ శ్రేణులు సైతం విజయసాయిరెడ్డి అంటే ఒకరకమైన సాఫ్ట్ కార్నర్ తో వ్యవహరిస్తున్నారు. ఆయన మారడంతో ఆయనపై అభిప్రాయం మార్చుకున్నామని తెలుగు తమ్ముళ్ళు చెబుతున్నారు.

నాయకత్వంతో అంటీముట్టనట్టుగా..
ఇటీవల కాలంలో విజయసాయిరెడ్డికి, వైసీపీ నాయకత్వం మధ్య అగాధం పెరుగుతూ వస్తోంది పార్టీ యాక్టివిటీస్ ను పూర్తిగా తగ్గించేశారు. అటు పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ విజయసాయిరెడ్డి ప్రాధాన్య తగ్గింది. ఆయన స్థానంలోనే చెవిరెడ్డి భాస్కరరెడ్డిని తీసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. వ్యూహాత్మకంగా విజయసాయిరెడ్డిని తప్పించేశారన్న ప్రచారం ఉంది. అందుకు తగ్గట్టుగానే ఇటీవలి కాలంలో ఎందుకోగానీ విజయసాయిరెడ్డి పెద్దగా వార్తల్లోకి అయితే రావడం లేదు. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్న దాఖలాలు కూడా పెద్దగా కనిపించడం లేదు. ఈ క్రమంలోనే సీఎం జగన్‌కి.. విజయసాయికి మధ్య దూరం పెరిగిందనే టాక్ నడుస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో సైతం ఆయన మార్క్ ఏమీ కనిపించలేదు. వెళ్లిపోయి ఢిల్లీలో కూర్చున్నారు. ఇక చంద్రబాబు విషయంలోనూ విజయసాయి వైఖరి మారింది. ఇటీవలి కాలంలో విమర్శలనేవి లేవు. పైగా తారకరత్న మరణ సమయంలో ఆయన చంద్రబాబుతో మాట్లాడిన తీరు కూడా ఆసక్తికరమే.