
YS Viveka Case- Media: సమాజంలో ఏదైనా తప్పు జరిగితే అది తప్పు అని చెప్పేందుకు పోలీసులు ఉన్నారు. దాన్ని నిర్ధారించేందుకు న్యాయమూర్తులున్నారు. శిక్ష విధించేందుకు కోర్టులు ఉన్నాయి. ఈ విషయాన్ని జనాలకు అర్థమయ్యేలా చెప్పేందుకు మీడియా ఉంది. ఇందులో ఎవరి పాత్ర వారు పోషించాలి. పొరపాటున ఎవరు నిబంధనలు అతిక్రమించినా మొత్తం వ్యవస్థకే చెడ్డ పేరు వస్తుంది. నమ్మకం అనేది సడలిపోతుంది. అటవీక ఆలోచనలు మనుషుల్లో పాదుగొల్పుతాయి. ఇదంతా ఎందుకు చెబుతున్నామంటే…దానికి ఓ బలమైన నేపథ్యం ఉంది.
ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్యకు సంబంధించి ప్రస్తుతం విచారణ జరుగుతోంది. మొదట్లో ఈయన హత్యకు సంబంధించి రకరకాల పరిణామాలు వెలుగు చూశాయి. అయితే ఈ ఘటనలో ఎప్పుడైతే ఆయన కూతురు సునీత రెడ్డి సిబిఐ ని ఆశ్రయించిందో అప్పుడే కేసు కీలక మలుపులు తిరిగడం ప్రారంభించింది. అంతేకాదు ఈ కేసును విచారిస్తున్న సిబిఐ దర్యాప్తు బృందానికి బెదిరింపులు రావడంతో అందులో కొంతమంది అధికారులు తమకు బాధ్యత కల్పించాలని పోలీసులను ఆశ్రయించారు. ఇదే సమయంలో సునీతా రెడ్డి కూడా పోలీసులను ఆశ్రయించాల్సి వచ్చింది.. తర్వాత కోర్టు జోక్యం చేసుకొని సుప్రీంకోర్టు దర్యాప్తు బృందాన్ని మార్చడంతో కేసు మరో మలుపు తీసుకుంది. అయితే ఇక్కడ తెరపైకి వస్తున్న విషయాలు,ఇన్నాళ్ళూ తెరమరుగైన విషయాలు మీడియాలో ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వాస్తవానికి ఒక కేసు విచారణలో ఉన్నప్పుడు మీడియా అనేది సమయమనం పాటించాలి. ఒకవేళ దర్యాప్తు సంస్థలు లీక్ లు ఇస్తే సంచలనానికి కాకుండా ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాలి. కేసు దర్యాప్తును పక్కదారి పట్టించకుండా ఉండేందుకు మీడియా తన వంతు పాత్ర పోషించాలి.

ప్రస్తుతం వివేకానంద రెడ్డి హత్య కేసు కు సంబంధించి దర్యాప్తు విషయంలో ఓ సెక్షన్ మీడియా అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నది.. అసలు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ టీం చేస్తున్న దర్యాప్తు లోపభూయిష్టమని కుండబద్దలు కొడుతోంది.. అసలు నేరస్తులు బయటే తిరుగుతున్నారని, కోర్టు కూడా కళ్ళు మూసుకొని ఉంటుందని తేల్చి చెబుతోంది.. వాస్తవానికి మన రాజ్యాంగం ప్రతిదానికి లక్ష్మణ రేఖ గీసింది.. కానీ గత కొంతకాలంగా మనదేశంలో మీడియా ఆ లక్ష్మణ రేఖను దాటి వ్యవహరిస్తోంది.. పొరపాటున ఇది ఏంటని ప్రశ్నిస్తే వాక్ స్వాతంత్రానికి గొడ్డలి పెట్టు అంటూ మీడియా శోకాలు పెడుతుంది. వాస్తవానికి మీడియా అనేది వాచ్ డాగ్ పాత్ర పోషించాలి. కానీ ఒక రాజకీయ పార్టీకి అనుకూలంగా రాతలు రాస్తూ వివేకానంద రెడ్డి కేసు దర్యాప్తును పక్కదారి పట్టించే ప్రయత్నాలు చేస్తోంది.. దస్తగిరి స్టేట్ మెంట్ ను సిబిఐ కంటే ముందే ఒక సెక్షన్ మీడియా ముందే సేకరించడం, పైగా దానిని ప్రసారం చేయడం ఏ విలువలకు నిదర్శనమో చెప్పాలి. ఇదే మీడియా వివేకానంద రెడ్డి హత్యకు గురైనప్పుడు ఎలాంటి వార్తలు రాసిందో అందరికీ తెలుసు. కానీ ఇవాళ ప్రభుత్వం మారేసరికి తన స్వరాన్ని మార్చేసింది. ఉన్నది లేనట్టు అభూత కల్పనలకు దిగుతోంది.
ఒకవేళ తప్పు జరిగింది అన్నప్పుడు దాన్ని నిర్ధారించేందుకు రాజ్యాంగబద్ధ సంస్థలు ఉన్నాయి. ప్రభుత్వం వల్లకాలేదు అనుకున్నప్పుడు కోర్టులు కూడా ఉన్నాయి. వీటన్నింటినీ అతిక్రమించి మీడియా మార్కు న్యాయం చెప్పడం ఏమిటో అంతుపట్టకుండా ఉంది. ఒకవేళ విచారణ జరుగుతున్న తీరు తప్పు అయితే దర్యాప్తు సంస్థలపై కొరడా విదిల్చేందుకు ఎన్నో సంస్థలు ఉన్నాయి.. కానీ వాటిని విస్మరించి మీడియా టిఆర్పి రేటింగ్స్ కోసం వెంపర్లాడుతుండడం నిజంగా బాధాకరం. సంచలనం పేరుతో వాస్తవాలను మరుగున పెట్టి వార్తలు ప్రసారం చేస్తే రేపటి నాడు సమాజంలో అశాంతి చెలరేగితే దానికి బాధ్యత ఎవరు తీసుకుంటారు? అప్పుడు కూడా మీడియా ఆ వార్తలను ప్రసారం చేయాల్సి ఉంటుంది. కాకపోతే అప్పటికి జరిగిన నష్టం పూడ్చచలేని స్థాయికి చేరుకుంటుంది. అందుకే మీడియాకు సమయం అవసరం.