PM Modi Visakha Tour: ఏపీలో ఇప్పుడు నవంబరు 11,12 తేదీలపైనే అందరి దృష్టి ఉంది. ప్రధాని విశాఖలో పర్యటిస్తుండడమే అందుకు కారణం. ఏపీకి ఎటువంటి వరాలు ప్రకటిస్తారో.. రాజకీయంగా ఎటువంటి నిర్ణయాలు వెల్లడిస్తారా? అన్నది చర్చనీయాంశంగా ఉంది. అయితే సాధారణంగా ప్రధాని వస్తున్నారంటే ఆయన సొంత పార్టీ బీజేపీలో హడావుడి ఉండాలి. కానీ ఆ పార్టీ ఏపీ శాఖకు ఎటువంటి సమాచారం లేదు. ప్రధాని కార్యక్రమాల షెడ్యూల్ కూడా తెలియదట. వినడానికి వింతగా ఉన్న ఇది నిజం. కానీ వైసీపీ మాత్రం తెగ హడావుడి చేస్తోంది. విశాఖకు చెందిన మంత్రి గుడివాడ అమర్నాథ్ అయితే రివ్యూ రివ్యూలు నిర్వహిస్తున్నారు. ప్రధాని పర్యటనలో భాగంగా ఏయూ ఇంజనీరింగ్ కాలేజీలో భారీ బహిరంగ సభ ఉంటుందని…లక్ష మంది హాజరయ్యేలా జన సమీకరణ చేయాలని ఆదేశాలిచ్చారుట. అయితే ఎప్పుడు ఏపీకి ప్రధాని వచ్చినా జన సమీకరణ బాధ్యతలు రాష్ట్ర బీజేపీకి అప్పగించేవారు. కానీ ఈసారి అందుకు విరుద్ధంగా జరగడంతో కమలనాథులు అనుమానంగా చూస్తున్నారు.

అయితే ఏపీలో ఎటువంటి రాజకీయాలు మారినా జగన్ సాక్షి పత్రికను చూసి ఇట్టే పసిగట్టవచ్చు. సాక్షినే అటు వైసీపీ అనుకూల మీడియా కూడా అనుసరిస్తుంది. ఈ క్రమంలో ఏపీకి ప్రత్యేక రైల్వేజోన్ మంజూరైందని.. విశాఖ కేంద్రంగా సౌత్ రైల్వేజోన్ కు ప్రధాని మోదీ శంకుస్థాపన చేస్తారని.. సీఎం జగన్ చొరవతోనే ఇది సాధ్యమవుతోందని ఇటీవల వరుసగా కథనాలు వస్తున్నాయి. వాస్తవానికి విభజన హామీల్లో భాగంగా ఏపీకి ప్రత్యేక రైల్వేజోన్ రావాల్సి ఉంది. గతంలో బీజేపీ, టీడీపీ కలిసి ప్రయాణం చేసినప్పుడు సైతం అదిగో..ఇదిగో రైల్వేజోన్ అంటూ తెలుగుదేశం పార్టీ హడావుడి చేసింది. కానీ క్రెడిట్ టీడీపీ ఖాతాలో పడకూడదని భావించిన బీజేపీ జోన్ ప్రకటించలేదన్న వార్తలు వచ్చాయి. అటువంటిది ఇప్పుడు వైసీపీ ఖాతాలో వేసుకుంటామంటే బీజేపీ ఒప్పకునే పరిస్థితిలో అయితే లేదు.
గత ఎన్నికల్లో ప్రత్యేక హోదా, పోలవరం, రైల్వే ప్రత్యేక జోన్ వంటివే వైసీపీ ప్రధాన హామీలు. కానీ ఇందులో ఒకటి కూడా సవ్యంగా జరగలేదు. ఇటీవల అత్యున్నత స్థాయి సమావేశంలో సౌత్ రైల్వే ప్రత్యేక జోన్ సాధ్యమయ్యే పనికాదని సాక్షాత్ రైల్వేబోర్డు చైర్మన్ తేల్చిచెప్పారు. ఇది పెద్ద దుమారానికి దారితీయడంతో డీపీఆర్ తయారుచేసే పనిలో ఉన్నామని ప్రకటన ఇచ్చుకోవాల్సి వచ్చింది. కానీ జగన్ సర్కారు ఒత్తిడితో కేంద్రం ప్రత్యేక రైల్వేజోన్ ప్రకటించనుందని.. నేరుగా ప్రధానినే తీసుకొచ్చి శంకుస్థాపన చేయిస్తున్నట్టు వైసీపీ నేతలు బిల్డప్ ఇస్తున్నారు.

ఈ పర్యవసానాల నేపథ్యంలో కమలనాథులు జాగ్రత్తపడ్డారు. అత్యవసరంగా కోర్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. తమకు ప్రధాని పర్యటన సమాచారం ఇవ్వకుండా .. వైసీపీ చేస్తున్న హడావుడిపై చర్చించారు. కేంద్రం ప్రత్యేక రైల్వేజోన్ ప్రకటిస్తే ఆహ్వానిస్తామని.. కానీ అది వైసీపీ క్రెడిట్ లో పడే చాన్స్ ఇవ్వబోమని తేల్చిచెబుతున్నారు. నేరుగా ఢిల్లీ పెద్దలకే ఫిర్యాదుచేశారు. దీంతో ప్రధాని షెడ్యూల్ మారే అవకాశమున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి ప్రజా వ్యతిరేకతను ప్రధాని మోదీ పర్యటనతో తగ్గించుకోవాలనిచూస్తున్న జగన్ ఆశలను రాష్ట్ర బీజేపీ నేతలు గండికొట్టారన్న మాట.