
2019 ఎన్నికల ఫలితాల తరువాత ఏపీలో చంద్రబాబు పరిస్థితి ఏం బాగాలేదు. టీడీపీ ఘోర పరాజయానికి చంద్రబాబు తనయుడు నారా లోకేశ్ కూడా ఒక రకంగా కారణమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. గుంటూరు జిల్లా మంగళగిరి నుంచి పోటీ చేసిన లోకేశ్ శాయశక్తులా ప్రయత్నించినా ఎన్నికల్లో విజయం మాత్రం దక్కలేదు. లోకేశ్ పరాజయం కూడా టీడీపీకి ఒక విధంగా మైనస్ అయింది.
2019 ఎన్నికల ఫలితాల తరువాతైనా టీడీపీ బలపడుతుందని, నారా లోకేశ్ రాజకీయంగా మెరుగవుతాడని టీడీపీ నాయకులు, కార్యకర్తలు భావించినా ప్రస్తుత పరిస్థితుల్లో అది సాధ్యం అయ్యేలా కనిపించడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో వైసీపీ నాయకులు చంద్రబాబుకు ఊహించని షాక్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. చంద్రబాబును మానసికంగా దెబ్బ తీసే విధంగా వైసీపీ నాయకులు ప్రణాళికలు రచిస్తున్నారు.
పేర్ని నాని, కొడాలి నాని టీడీపీ ఎమ్మెల్యే అయినా వైసీపీకి మద్దతు ఇస్తున్న వల్లభనేని వంశీ విమర్శలు చేసే సమయంలో పదేపదే లోకేశ్ ప్రస్తావన తెస్తున్నారు. వైసీపీ నేతలు లోకేశ్ వల్ల టీడీపీకి పెద్దగా ప్రయోజనం లేదని… భవిష్యత్తు రాజకీయాలను శాసించే స్థాయికి లోకేశ్ ఎదగలేడని విమర్శలు చేస్తూ చంద్రబాబును మానసికంగా దెబ్బ తీసే ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్రంలో ఎవరూ టీడీపీ నాయకత్వం కోరుకోవడం లేదని వైసీపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.
వైసీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు టీడీపీ నేతల్లో, కార్యకర్తల్లో పరోక్షంగా ఒత్తిడిని పెంచుతున్నాయి. లోకేశ్ కు పార్టీలో కీలక బాధ్యతలు అప్పగిస్తే పార్టీ మరింత బలహీనపడుతుందని టీడీపీ నేతలు భావిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు లోకేశ్ పై వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలను ఎలా తిప్పికొడతారో చూడాల్సి ఉంది. వైసీపీ నాయకులు మొత్తానికి చంద్రబాబును చావుదెబ్బ కొట్టేలా ప్లాన్ చేశారనే చెప్పాలి.