Homeఆంధ్రప్రదేశ్‌తెలుగు రాష్ట్రాలు సిగ్గుతో తలదించుకోవాలి

తెలుగు రాష్ట్రాలు సిగ్గుతో తలదించుకోవాలి

సహజంగా ఒక భావం అందరిలో వుంది. దేశంలో దక్షిణాది మిగాతా ప్రాంతాల కన్నా సామాజిక రంగం లో చాలా ముందున్నాయని. కానీ అది తప్పని తేలింది. జాతీయ గణాంక కార్యాలయం 2017 జూలై నుంచి 2018 జూన్ వరకు నిర్వహించిన సర్వే లో దిమ్మతిరిగే నిజాలు బయటపడ్డాయి. ఇందులో అక్షరాస్యత లో చూసుకుంటే మొదటి అయిదు స్థానాల్లో దక్షిణాది నుంచి కేవలం ఒక్క కేరళ నే వుంది. మిగతా రాష్ట్రాలేవీ దరిదాపుల్లో కూడా లేవు. అభివృద్ధి కి ఆమడ దూరంగా ఉంటాయని ప్రత్యేక ప్రతిపత్తి తో అధిక నిధులు తీసుకునే కొండప్రాంతాలు ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ లు మొదటి అయిదు స్థానాల్లో చోటు సంపాదించుకున్నాయి.ఈశాన్య భారతానికి సంబంధించిన అస్సాం మొదటి అయిదు స్థానాల్లో నిలిచింది.

Also Read : బాలకృష్ణను కెలికిన పోసాని… ఏం జరిగిందంటే….?

తెలుగు రాష్ట్రా లెక్కడ?

వినటానికే మనస్కరించని స్థాయిలో మన ఫలితాలు వున్నాయి. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు , సంస్కరణలు చేసామని గొప్పలు చెప్పుకొనే మన రాజకీయ నేతలు వాళ్ళ గొప్ప లేమిటో తేటతెల్లం చేసే వాస్తవాలు మన కళ్ళ ముందున్నాయి. మొత్తం దేశం లో కిందనుంచి అక్షరాస్యతలో అధమ స్థానం సంపాదించిన ఘనత ఆంధ్ర ప్రదేశ్ కి దక్కినందుకు మనమందరం సిగ్గుతో తలదించుకోవాలి. తెలంగాణా కూడా తక్కువేమీ తినలేదు. నీతో పోటీ నేనున్నాని కిందనుంచి నాలుగో స్థానం లో వుంది. ఈ రెండు రాష్ట్రాలకన్నా ఉత్తర ప్రదేశ్ ఐదో స్థానం లో వుండి మెరుగనిపించింది. ఆంధ్ర ప్రదేశ్ 66.4 శాతంతో అట్టడుగున వుంటే  హైదరాబాద్ నగరాన్ని కలిగివున్న తెలంగాణా 72.8 శాతం తో చివరి అయిదు స్థానాల్లో చోటు దక్కించుకొని ‘ఘనత ‘ సాధించాయి. జాతీయ సగటు 77.7 శాతం కంటే ఈ రెండు తెలుగు రాష్ట్రాలు దిగువన వుండి మనందరికి తలదించుకొనే పరిస్తితి  కల్పించాయి.

దీనికి బాధ్యులెవరు?

ఒకరిమీద ఒకరు పోటీపడి అభివృద్ధి లో ముందున్నామని చెప్పుకొనే ఇరుపార్టీలు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఇటీవలికాలంలో ప్రభుత్వాలు నడిపిన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గా వున్న తెలుగు దేశం, వై ఎస్   రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా వున్న కాంగ్రెస్, కెసిఆర్ ముఖ్యమంత్రిగా వున్న తెరాస లు దీనికి ఏమి సమాధానం చెబుతాయి. ( ఈ సర్వే జరిగేనాటికి వై ఎస్ ఆర్ సి పి అధికారం లో లేదు కాబట్టి మినహాయిద్దాం ). అభివృద్ధి అంటే ఏమిటి? ఖద్దరు బట్టలు, పచ్చ బట్టలు, గులాబి బట్టలు కాదు. సామాజిక రంగం లో మనిషి ఎంత నాగరికత చెందాడనేది. దానికి ముందుగా కొలిచే కొలబద్ద కనీస అక్షరాస్యత . ఇందులో దేశం లోనే అధమ స్థానం లో నిలిపిన ఘనత సాధించిన ఈ రాజకీయ నాయకులకు అభివృద్దిని గురించి గొప్పలు చెప్పుకొనే నైతిక హక్కు లేదు. ఇప్పటికైనా నోరు మూసుకొని తమ చేతగాని తనానికి ఓ మూల కూర్చోవటం మంచిది. వీళ్ళు మన చెవిలో పూలు పెట్టి కులాలు, మతాలూ, ప్రాంతాలు,వర్గాలు పేరిట ప్రజల జీవితాలతో చెలగాట మాడుతున్నారని తెలుసుకోండి.

Also Read : జగన్ ను ఢీకొంటున్న ఒకే ఒక్కడు ఇతడు!

ఆసక్తి కలిగించే మరిన్ని గణాంకాలు 

సరే కనీస అక్షరాస్యత లో వెనకబడ్డామనుకున్నా , చదువుకున్న వాళ్ళలో నైనా హైస్కూల్ విద్యలో మనం ముందున్నామా అంటే అదీ లేదు. దేశంలోని మొదటి అయిదు స్థానాల్లో రెండు తెలుగు రాష్ట్రాలు ఎక్కడా పత్తా లేవు. జాతీయ సగటు కన్నా వెనకబడి వున్నాయి. ఇందులో తెలంగాణా కొంత మెరుగు. జాతీయ సగటు కి దగ్గరలో వుంది. ఆంధ్రలో పరిస్తితి అదీ లేదు. ఇక గ్రాడ్యుయేట్ ల శాతం చూసుకున్నా ఒక్క తెలంగాణా నే మూడో స్థానం లో వుంది , అదీ హైదరాబాద్ వుంది కాబట్టి. ఆంధ్ర ఇందులోనూ జాతీయ సగటు కి దిగువనే వుంది. ఒక్క సాంకేతిక/వృత్తి విద్యా కోర్సుల్లో మాత్రం ఆంధ్ర మూడో స్థానం లో వుంది. తెలంగాణా ఏడో స్థానం తో సరిపెట్టుకుంది. ఒక విషయం లో మాత్రం రెండు రాష్ట్రాలు ముందంజ లో వున్నాయి. అది ప్రైవేటు స్కూళ్ళలో విద్యాభ్యాసం చేయటంలో. ప్రాధమిక విద్య నుంచి హైస్కూల్ విద్య వరకు చూస్తే ప్రభుత్వ పాటశాలలు కాకుండా ప్రైవేటు స్కూళ్లలోనే విద్యనభ్యసించే విద్యార్ధులు మన రాష్ట్రాల్లో ముందంజ లో వున్నారు. తెలంగాణా మొదటి స్థానం లో, ఆంధ్ర ప్రదేశ్ రెండో స్థానం లో నిలిచాయి. వీటితో పోటీగా మూడో స్థానం లో హర్యానా నిలిచింది. అంటే విద్య కోసం అధిక డబ్బులు ఖర్చు పెట్టి పిల్లల్ని ప్రైవేటు స్కూళ్ళలో చదివించటం మన రెండు రాష్ట్రాల్లో ఎక్కువయ్యింది. ప్రభుత్వ స్కూళ్ళ పై పిల్లల తల్లిదండ్రులకు నమ్మకం లేకపోవటమే దీనికి కారణం. దీనికి ఎవరు బాధ్యత వహించాలి? ప్రభుత్వ స్కూళ్ళ ఈ పరిస్థితి కి ఇన్నాళ్ళు మనల్ని పరిపాలించిన పాలకులు కాదా?

భాషా మాధ్యమం పై ఆసక్తి గలిగించే గణాంకాలు 

తెలుగు లో విద్యాభ్యాసం జరగాలా లేక ఇంగ్లీష్ లో విద్య బోధన జరగాలా అని మన రాష్ట్రాల్లో చర్చ జరగటం , అది ఆంధ్ర ప్రదేశ్ లో వివాదాంశం గా మారటం మనందరికీ తెలిసిందే. దీనిపై జాతీయ గణాంక కార్యాలయం విడుదల చేసిన అంశాలు ఆసక్తికరంగా వున్నాయి. మొత్తం దేశం లో మాతృ భాషలో కాకుండా ఆంగ్లం లో స్కూలు విద్య ని అభ్యసిస్తున్న రాష్ట్రాల్లో కేరళ అగ్రభాగాన వుంది. అక్కడ మలయాళం లో కాకుండా ఆంగ్లం లో హై స్కూలు విద్యనభ్యసించే విద్యార్ధులు 78.8 శాతం మంది వున్నారు. ఆ తర్వాత స్థానం లో తెలుగు విద్యార్ధులు వున్నారు. మన తెలుగు రాష్ట్రాల్లో 74.8 శాతం మంది విద్యార్ధులు ఆంగ్లం లో విద్య నభ్యసిస్తున్నారు. ఆశ్చర్యకరంగా దక్షిణాది లో మిగతా రాష్ట్రాలు కర్ణాటక లో 40.4 శాతం మంది, తమిళనాడు లో 37.4 శాతం మంది మాత్రమే ఆంగ్లం లో విద్య నభ్యసిస్తున్నారు. అదే మిగతా భాషా విద్యార్ధుల్లో అతి తక్కువమంది మాతృ భాష కాకుండా ఆంగ్లం లో స్కూలు విద్య నభ్యసిస్తున్న వాళ్ళలో పశ్చిమ బెంగాల్ ప్రధమ స్థానం లో వుంది. అక్కడ కేవలం 4.9 శాతం మంది మాత్రమే ఆంగ్ల మాధ్యమం లో చదువుతున్నారు. దిగువ నుంచి ఆ తర్వాత స్థానాల్లో గుజరాతీలు ( 12.1 శాతం), అస్సామీస్ ( 18.4 శాతం), హిందీ మాతృ భాషా పరులు  ( 19.5 శాతం) , మరాఠీలు (28.2 శాతం) మంది వున్నారు.

దీన్నిబట్టి మొత్తం దేశం లో మాతృ భాష కాని పరాయి భాషలో చదువుతున్న విద్యార్ధులు అత్యధికంగా   మలయాళీలు, తెలుగు వాళ్ళు  మాత్రమే. ఇక్కడ మాతృ భాషపై లెక్చర్లు దంచే వామపక్ష మేధావులు కేరళ లో మాత్రం ఆంగ్ల భాష ని ప్రోత్సహిస్తున్నారు. ఇప్పటివరకు అధ్యయనం చేసిన అంశాల్లో తెలుగు రాష్ట్రాలు అక్షరాస్యత లో దేశం లోనే వెనకబడి వుండటం, చదివే వాళ్ళలో కూడా ప్రభుత్వ పాటశాలల్లో చదివే వాళ్ళ సంఖ్య దేశం లోనే తక్కువగా వుండటం, మాతృ భాష లో విద్యాభ్యాసం చేయని విద్యార్ధుల్లో దేశం లోనే రెండో స్థానం లో వుండటం ఆసక్తికరం. ఈ గణాంకాలు వెల్లడించిన అంశాలు అధ్యయనం చేసి రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా యుద్ధ ప్రాతిపదికన దిద్దుబాటు చర్యలు తీసుకుంటారని ఆశించవచ్చా?  మరిన్ని ఆసక్తికర అంశాలతో మళ్ళీ మీ ముందుకు వస్తాం, సెలవు.

Also Read : ఈరోజు అసెంబ్లీలో కేసీఆర్ మరో కీలక నిర్ణయం!

Ram
Ramhttps://oktelugu.com/
An Independent Editor, Trend Stetting Analyst.
RELATED ARTICLES

Most Popular