
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ఇన్ సైడ్ ట్రేడింగ్ జరిగిందని గగ్గోలు పెట్టిన వైసీపీ ప్రభుత్వం.. కేసులు పెట్టింది. కోర్టు మెట్లు ఎక్కింది. ఇటీవల ఈ పిటిషన్ ను విచారణ సందర్భంగా ఆధారాలు సమర్పించలేకపోయింది సర్కారు. అంతేకాదు.. సుప్రీంలో వేసిన పిటిషన్ కూడా ఉపసంహరించుకుంది. తద్వారా.. తమ వాదనలో నిజం లేదని పరోక్షంగా ప్రకటించుకుంది. అయితే.. ఇదంతా కోర్టు ముందే అని, కోర్టు బయట మరో విధంగా వ్యవహరిస్తామని చాటుకుంటోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు.
తాజాగా మీడియాతో మాట్లాడిన ఆయన.. అమరావతి పెద్ద స్కాం అని అన్నారు. ఈ విషయం మీడియాకు సైతం తెలుసునని చెప్పుకొచ్చారు.అంతేకాదు.. సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పునూ విశ్లేషించారు. సాంకేతిక అంశాల ఆధారంగా సుప్రీం తీర్పు ఇచ్చి ఉండొచ్చని అన్న సజ్జల.. అమరావతిలో ఏం జరిగిందో మాత్రం అందరికీ తెలుసునని అన్నారు. అది ఖచ్చితంగా పెద్ద మోసం అని అన్నారు.
వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచీ అమరావతిపై తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఇన్ సైడ్ ట్రేడింగ్ ద్వారా టీడీపీ నేతలు భారీగా భూములు సమకూర్చుకున్నారని ఆరోపించారు. వేలాది ఎకరాలను నయానో, భయానో రైతుల నుంచి లాక్కున్నారని చెప్పుకొచ్చారు. ఈ అంశంపై సీఐడీ కేసు కూడా వేశారు. అయితే.. న్యాయస్థానం ఎదుట మాత్రం నిరూపించలేకపోయారు. కానీ.. బయట మాత్రం మళ్లీ అదే పాట పాడుతుండడం గమనార్హం.
ఇన్ సైడ్ ట్రేడింగ్ ఆరోపణల తర్వాత.. మూడు రాజధానుల అంశాన్ని తీసుకొన్న ఏపీ సర్కారు.. ఇప్పటి వరకు రాజధాని తరలించింది లేదు. కానీ.. అమరావతిలో పనులన్నీ ఆగిపోవడంతో అభివృద్ధితోపాటు ప్రజల ఉపాధి అంశాలపైనా ప్రభావం చూపింది. పోనీ.. కోర్టులో ఈ అక్రమాన్ని నిరూపించారా అంటే.. అదీ లేదు. అయినప్పటికీ.. కోర్టు బయటకు వచ్చి రాజకీయ లబ్ధికోసం అదే పాట పడుతున్నారు. ఇదంతా రాజకీయ లబ్ధి కోసం చేస్తున్న ప్రయత్నమేననే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.