ఆ మధ్య టీడీపీపై అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలు లీకై పార్టీని తీవ్రంగా ఇరకాటంలో పడేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అలాంటి వీడియోనే ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అయితే.. ఈ సారి వైసీపీ వంతు వచ్చింది! కరోనా విషయంలో జగన్ చేతులు ఎత్తేశారని, ఆయన చేసింది ఏమీ లేదని మాట్లాడారంటూ లీకైన ఓ వీడియో.. ఇప్పుడు రాష్ట్రంలో హల్ చల్ చేస్తోంది.
రెండు రోజుల క్రితం రాజమండ్రిలో అంతిమ యాత్ర వాహనాన్ని ప్రారంభించారు ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్. ఈ కార్యక్రమంలో రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ తోపాటు రాజమండ్రి ఇన్ ఛార్జ్ ఆకుల సత్యనారాయణ, తదితరులు హాజరయ్యారు. ఆ కార్యక్రమం తర్వాత ఓ చోట కూర్చున్న వీరంత ఆఫ్ లైన్లో జగన్ పాలన గురించి మాట్లాడుకున్నారట.
కరోనా మృతదేహాన్ని తరలించడానికి రూ.30 వేలు, అంత్యక్రియలకు 12 వేలు వసూలు చేస్తున్నారని, ప్రభుత్వం ఎలాంటి సహాయమూ చేయడం లేదని వారు చర్చించుకున్నట్టుగా వాయిస్ ఉంది. ఈ వీడియో బయటకు లీక్ కావడంతో.. విపక్షాలు ఎదురుదాడి మొదలు పెట్టాయి.
జగన్ పాలనపై సొంత పార్టీ నేతలే సర్టిఫికెట్ ఇస్తున్నారని, బొక్కలో పాలన అని మాట్లాడుతున్నారని టీడీపీ నేత లోకేష్ వ్యాఖ్యానించారు. కరోనా నేపథ్యంలో ప్రభుత్వం చేసుకుంటున్న ప్రచారానికి, క్షేత్రస్థాయిలో పరిస్థితికి ఎంత తేడా ఉందో వైసీపీ నేతల మాటలతోనే అర్థం చేసుకోవచ్చని అన్నారు. మొత్తానికి జగన్ మీదనే వైసీపీ నేతలు నెగెటివ్ కామెంట్లు చేసినట్టు వీడియో బయటకు రావడంతో.. సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.