
గత ఏడాది నుంచి కరోనా మహమ్మారి తన విషపు కోరలతో మొత్తం ప్రపంచాన్ని చిగురుటాకులా వణికిస్తూ.. రోజురోజుకు ప్రజలను భయాందోళనలకు గురి చేస్తూనే ఉంది. ఇప్పటికే లక్షలాది మంది కరోనా బారిన పడి నానా కష్టాలు పడుతున్నారు. జాలి లేని ఈ మహమ్మారి వేలాది మంది ప్రాణాలను బలికొంది, ఇంకా బలి తీసుకుంటూనే ఉంది. ప్రస్తుతం కరోనా తన సెకండ్ వేవ్ తో మన దేశంలో విలయ తాండవం చేస్తూ ఉంది.
మరోపక్క రోజులు గడిచే కొద్దీ కరోనా దెబ్బకు జనజీవనం అస్తవ్యస్థంగా తయారవుతుంది. ప్రస్తుత కఠిన పరిస్థితుల్లో కరోనా పై ప్రజలను మరింతగా అప్రమత్తం చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పై ఉంది. అందరూ మాస్క్ లు, శానిటైజర్లు వాడాలని భౌతిక దూరం పాటించాలని, కరోనాను మనదేశం నుంచి పారద్రోలాలని ఆర్ఆర్ఆర్ టీమ్ ఒక వీడియోని రిలీజ్ చేసింది.
ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఎన్టీఆర్, చరణ్ లతో పాటు అజయ్ దేవగన్, అలియా భట్, మరియు రాజమౌళి కూడా వివిధ భాషల్లో కరోనాకి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ.. ఎన్టీఆర్ కన్నడలో, రాజమౌళి మలయాళంలో, అజయ్ దేవ్‌గణ్ హిందీలో అలాగే ఆలియా భట్ తెలుగులో, రామ్ చరణ్ తమిళంలో ప్రజలకు తమ సందేశం తెలియజేశారు.
వారి మాటల్లో ‘అందరికీ నమస్కారం. ఈ సెకండ్ వేవ్ కారణంగా మన దేశంలో కరోనా కేసులు భారీగా నమోదు అవుతున్నాయి. గతేడాది కరోనా పై ఎలా పోరాటం చేశామో, మళ్లీ అలాగే పోరాడదాం. ముఖ్యంగా మాస్క్ ధరించడం, చేతులను శానిటైజర్ తో శుభ్రం చేసుకోవడం, అలాగే సామాజిక దూరం పాటించడమే మన దగ్గర ఉన్న ఆయుధాలు. వ్యాక్సిన్ పై వస్తున్న అపోహలను నమ్మకండి. ప్రతి ఒక్కరం టీకా వేయించుకుంటానని ప్రతిజ్ఞ చేద్దాం. మాస్క్ ధరిద్దాం.. వ్యాక్సిన్ వేయించుకుందాం’ అంటూ ఆ వీడియోలో ఆర్ఆర్ఆర్ టీమ్ చెప్పుకొచ్చారు.