YCP-Rajinikanth- Pawankalyan : ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ చర్చనీయాంశంగా మారారు. రాజకీయ దుమారానికి కారణమవుతున్నారు. కొద్దిరోజుల కిందట విజయవాడలో జరిగిన ఎన్టీఆర్ శత జయంతి వేడుకలకు రజనీకాంత్ హాజరయ్యారు. ఎన్టీఆర్ తో అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. అటు స్నేహితుడు చంద్రబాబును ఆకాశానికి ఎత్తేశారు. అది మొదలు రజనీకాంత్ ను వైసీపీ నేతలు టార్గెట్ చేసుకున్నారు. వ్యక్తిగతంగా దూషణలకు దిగారు. ముఖ్యంగా మంత్రి రోజా, మాజీ మంత్రి కొడాలి నానిలు ఓ రేంజ్ లో విరుచుకుపడ్డారు.వాస్తవానికి రజనీ సీఎం జగన్ ను పల్లెత్తు మాట అనలేదు. వైసీపీని సైతం విమర్శించలేదు. రెండు ప్రభుత్వాల మధ్య పోలిక పెట్టలేదు. కేవలం తన స్నేహితుడి పాలనను మెచ్చుకున్నారు. తన వ్యక్తిగత అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. అయితే రజనీకాంత్ పై వ్యూహాత్మక దాడి వెనుక పెద్ద రాజకీయమే ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది.
కొడాలి నాని వీరవిహారం..
అయితే కొడాలి నాని అయితే చంద్రబాబు, లోకేష్ ల మాదిరిగానే రజనీకాంత్ ను తిట్టేశారు. ఎన్టీఆర్ పై చెప్పులు విసురుతుండగా, వైస్రాయ్ హోటల్లో చంద్రబాబుకు మద్దతుగా ఉన్న రజినీకాంత్, సిగ్గు శరం లేకుండా ఇప్పుడు చంద్రబాబును పొగుడుతూ, ఎన్టీఆర్ శతజయంతి వేడుకల్లో పాల్గొన్నారని ఆయన మండిపడ్డారు. అంతటితో ఆగకుండా ఏపీలో జీరో అయిన రజినీకాంత్, మాటలను తెలుగు ప్రజలేవ్వరు విశ్వసించరని కూడా అనేశారు. మూడు రోజులు షూటింగ్ చేస్తే నాలుగు రోజులు హాస్పటల్లో పడుకునే, రజనీకాంత్ ఏం చెప్పడానికి ఆంధ్రప్రదేశ్ వచ్చారని ఆయన ప్రశ్నించారు. అంతేకాదు చీకేసిన తాటి పండు అంటూ తీవ్ర విమర్శలు చేశారు.
రోజా ఫైర్..
రజనీపై మంత్రి రోజా కూడా ఘాటైన వ్యాఖ్యలు చేశారు. తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రజనీకాంత్‌కు తెలుగు రాష్ట్రాల రాజకీయాలపై అవగాహన లేదన్నారు. ఆయన వ్యాఖ్యలతో ఎన్టీఆర్ ఆత్మ కూడా బాధపడుతుందని పేర్కొన్నారు.. ఎన్టీఆర్‌పై దారుణంగా కార్టూన్లు వేసి అవమానించిన వ్యక్తి చంద్రబాబు.. ఇప్పుడు రజనీకాంత్‌తో అబద్ధాలు చెప్పించారని మండిపడ్డారు. చంద్రబాబు గురించి ఎన్టీఆర్ ఏమన్నారో.. రజనీకాంత్‌కు వీడియోలు ఇస్తానని రోజా ప్రకటించారు. చంద్రబాబు విషయంలో రజనీకాంత్ మాటలు సహేతుకంగా లేవన్నారు. ఇ్ మంత్రి జోగి రమేష్ సైతం ఏకవచనంతో విరుచుకుపడ్డారు.
జన సైనికులను రెచ్చగొట్టేందుకే..
అయితే ఇలా నేతలంతా ఒకేసారి రజనీకాంత్ పై వ్యక్తిగత దాడికి దిగడం వెనుక రకరకాల వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అక్కడకు ముందే పవన్ విషయంలో కొడాలి నాని విభిన్నమైన ప్రకటన ఒకటి చేశారు. పవన్ చేజారిపోతుండడంతోనే రజనీకాంత్ ను తెరపైకి తెచ్చారని ఆరోపించారు. సీట్లతో పాటు పవర్ షేరింగ్ అడుగుతున్నందున చంద్రబాబు పవన్ ను సైడ్ చేశారని.. రజనీని తెరపైకి తెచ్చారని ఆరోపించారు. అయితేు ఈ వ్యాఖ్యలు వెనుక గందరగోళం సృష్టించాలన్న అభిప్రాయం వ్యక్తమైంది. చంద్రబాబు, పవన్ ల మధ్య సానుకూల వాతావరణం ఉండడం, పొత్తులు తుది దశకు చేరుకోవడంతో రజనీని మధ్యనపెట్టి జనసైనికులు, అభిమానులను టీడీపీపై ఎగదోసే ప్రయత్నంగా విశ్లేషకులు భావిస్తున్నారు.