CM Jagan: వైసీపీ నేతలకు ఫుల్ క్లారిటీ వస్తోంది. అధినేత తమను ముంచేస్తున్నారన్న భయం వెంటాడుతోంది. 30 సంవత్సరాల పాటు అధికారంలో ఉంటాను అన్న జగన్ మాటలను నమ్మి వైసీపీ శ్రేణులు కిందా మీదా చూడలేదు. జగన్ విధ్వంసరకర పాలనను సైతం పొగడ్తలతో ముంచేత్తేవారు. ప్రత్యర్థులను తూలనాడేవారు. తొలి మూడేళ్లలో దక్కిన ఏకపక్ష విజయాలను చూసి మురిసిపోయారు. ప్రజల మైండ్ సెట్ స్థిరంగా ఉండిపోతుందని భావించారు. కానీ కాలం కరిగినట్టే.. ప్రజల్లో ప్రభుత్వంపై ఉన్న సంతృప్తి శాతం కరిగిపోయింది. క్రమేపి వ్యతిరేకత వైపు దారితీసింది. దీంతో వైసిపి శ్రేణులకు అసలు తత్వం బోధపడుతోంది.
చంద్రబాబు అరెస్ట్ తర్వాత సీన్ మారింది. చంద్రబాబు లాంటి కాకలు తీరిన యోధుడ్ని జైలులో పెట్టించానన్న సంతృప్తి, గర్వం జగన్ కు లభించవచ్చు కానీ.. క్షేత్రస్థాయిలో మాత్రం తీరని నష్టం జరుగుతుందని విశ్లేషణలు వెలవడుతున్నాయి. చంద్రబాబు అరెస్ట్ టిడిపి శ్రేణులను బాధించవచ్చు.. వైసీపీ శ్రేణులను ఆనందింప చేయవచ్చు. కానీ తటస్తులు, విద్యాధికులు మాత్రం తప్పుపడుతున్నారు. జగన్ ఉద్దేశం పూర్వకంగా చేస్తున్న చర్యగా అభివర్ణిస్తున్నారు. ఈ క్రమంలో సొంత పార్టీ శ్రేణులు సైతం జగన్ నిర్ణయాన్ని తప్పుపడుతున్నాయి. జగన్ చర్యల పుణ్యమా అని భవిష్యత్తులో తాము ఇబ్బందులు పడాల్సి ఉంటుందని ఆందోళన చెందుతున్నాయి.
తప్పుడు కేసులు పై వైసీపీ శ్రేణులు అంతర్మధనం చెందుతున్నాయి. ” నిజంగా నాకు సందేహం.. చంద్రబాబు వద్ద మంచి ప్యాకేజీ తీసుకొని.. ఆయనను తిరుగులేని మెజారిటీతో సీఎం చేయాలని ప్యాకేజీ తీసుకుంది జగనన్నేనా? “.. సోషల్ మీడియాలో ఓ వైసీపీ అభిమాని వ్యక్తం చేసిన అభిప్రాయం ఇది. సగటు వైసిపి అభిమాని మదిలో తోచే అభిప్రాయం ఇది. ఎన్నికలకు వెళ్లే ముందు గత ఐదేళ్లలో ఏం చేసామో చెప్పుకోవాలి కానీ.. తప్పుడు కేసులు పెట్టి.. ఆధారాలు లేని కేసులతో ఇబ్బందులు తెచ్చుకోవడం తగునా? అని వైసీపీ శ్రేణులు ప్రశ్నిస్తున్నాయి. జగన్ పై పిచ్చి ప్రేమతో 10 శాతం వైసీపీ అభిమానులు హర్షించ వచ్చు కానీ… 90 శాతం మంది మాత్రం.. ప్రభుత్వం మారితే పరిస్థితి ఏంటని ఆందోళన చెందుతున్నారు.
వాస్తవానికి టిడిపి,జనసేన మధ్య పొత్తు కుదురుతుందని వైసీపీ శ్రేణులు భావించలేదు. వారు కలవరని కూడా ఆశించారు. దీనికి కూడా జగన్ చర్యలే కారణం. టిడిపి, జనసేన పొత్తులకు కూడా సరైన వేదికను ఆయనే ఏర్పాటు చేశారు. రాజకీయ ప్రత్యర్థులను వేధించడంతో.. ఇక ఐక్య పోరాటాలే శరణ్యమని భావించే స్థితికి జగన్ తీసుకొచ్చారు. శత్రువులు ఒక్కరయ్యారంటే తన బలం పెరిగిందని జగన్ సమర్ధించుకొని ఉండవచ్చు కానీ.. ఎటువంటి భేష జాలం, రాజకీయ ప్రయోజనాలు ఆశించకుండా పొత్తు ప్రకటన చేయడం జగన్ కు ఇబ్బందికరమే. బిజెపి వచ్చినా.. రాకున్నా.. తాము మాత్రం కలిసే పోరాడుతామని స్ట్రాంగ్ డెసిషన్ కు రావడానికి కూడా జగనే కారణం. ఐదేళ్లపాటు సంక్షేమ రాజ్యం కొనసాగించి ఉంటే.. మళ్లీ మరోసారి అధికారం చేపట్టే ఛాన్స్ వచ్చి ఉండేదని వైసీపీ శ్రేణులు భావిస్తున్నాయి. దానిని చేజేతులా జగన్ దూరం చేసుకున్నారని.. వాటి పర్యవసానాలు తాము అనుభవించాల్సి వస్తుందని వైసీపీ శ్రేణులు తెగ ఆందోళన చెందుతున్నాయి.