YCP- Bendapudi Students: ఆ ఐదుగురు విద్యార్థులు ఇంగ్లీష్ లో అదరగొట్టారు. అచ్చం అమెరికన్ ఇంగ్లీష్ తరహా ఉచ్చారణతో సీఎం జగన్ నే ఆకట్టుకున్నారు. అలాగని వారేదో కార్పొరేట్ స్కూల్ విద్యార్థులనకుంటే పొరబడినట్టే. కాకినాడ జిల్లా తొండంగి మండలం బెండపూడి ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు వారు. గురువారం ఈ పాఠశాలకు చెందిన ఐదుగురు విద్యార్థులు నేరుగా ముఖ్యమంత్రి జగన్ ని కలిశారు. ఇంగ్లిషులో దడదడా మాట్లాడేసి… శభాష్ అనిపించుకున్నారు. ఇక్కటిదాకా అంతా బాగుంది! కానీ… ప్రభుత్వ పాఠశాలల్లో జగన్ ఆంగ్ల మాధ్యమం ప్రవేశ పెట్టిన తర్వాతే బెండపూడి బడి పిల్లలు ఇలా ఇంగ్లిషులో మాట్లాడటం మొదలుపెట్టారని వైసీపీ వర్గాలు ప్రచారం చేసుకోవడంపై స్థానికులు ఆశ్చర్యపోతున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన మూడేళ్లలో పాఠశాలలు గణనీయమైన అభివ్రుద్ధి సాధించినట్టు, సమూల మార్పులు తీసుకొచ్చినట్టు వైసీపీ శ్రేణులు సోషల్ మీడియాలో ఈ వీడియోలను తెగ వైరల్ చేస్తున్నాయి.
అసలు కథ ఇది..
వాస్తవానికి 2015లో టీడీపీ ప్రభుత్వం ‘సక్సెస్ స్కూల్స్’ విధానం తీసుకొచ్చింది. బెండపూడి హైస్కూలును అప్పుడే సక్సెస్ స్కూలుగా గుర్తించింది. తెలుగు మీడియంతోపాటు సమాంతరంగా ఇక్కడ ఇంగ్లిషు మీడియం ప్రవేశపెట్టింది. కాలక్రమేణా ఇక్కడ ఇంగ్లిషు బోధనలో బెండపూడి స్కూలు ‘బెస్ట్’ అనిపించుకుంది. ఇక… ఈ బడి పిల్లలు అమెరికన్ యాక్సెంట్‌లో శభాష్ అనిపించుకోవడానికి మరో ప్రత్యేక కారణముంది. తొండంగి మండలానికి చెందిన ఒక వ్యక్తి కొన్నేళ్ల కిందట అమెరికాలో స్థిరపడ్డారు.
Also Read: YSRCP Gadapa Gadapaku: వైసీపీపై ఏపీలో ఈ స్థాయిలో వ్యతిరేకత ఉందా? అసలు కారణాలేంటి?
ఒక ట్రస్టు ఏర్పాటు చేశారు. సొంత ప్రాంతంపై మక్కువతో… మండలంలోని అనేక ప్రభుత్వ పాఠశాలలకు తన ట్రస్ట్ పేరుతో పుస్తకాలు పంపిణీ చేస్తున్నారు. బెండపూడి ఉన్నత పాఠశాలకు ట్రస్టు నిర్వాహకులు పలుసార్లు వచ్చారు. ఈ హైస్కూల్లోని కొందరు చురుకైన విద్యార్థులతో అమెరికాలో ఉన్న ట్రస్టు నిర్వాహకులు ఎంపిక చేసిన వారితో అమెరికన్ ఇంగ్లిషులో ఆన్‌లైన్‌లో తరచూ మాట్లాడించేవారు. దీంతో అమెరికన్ ఇంగ్లీష్ అలవాటైంది. ఇటీవల ఈ విద్యార్థుల ఆంగ్ల భాషా ప్రావీణ్యం టీవీ చానళ్లు, సోషల్ మీడియా ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ తెలిసింది. ఇంకేముంది… ‘ఇదంతా జగనన్న ఇంగ్లిష్ మీడియం చదువుల పుణ్యమే’ అంటూ వైసీపీ వర్గాలు ప్రచారం మొదలుపెట్టాయి.
ప్రైవేటు స్కూళ్ల నుంచి వచ్చిన వారే..
ఇంగ్లిషు చదువులతో బాగా పేరు తెచ్చుకున్న బెండపూడి బడిలోకి ప్రైవేటు స్కూలు పిల్లలు చేరడం ఐదేళ్ల కిందటే మొదలైంది. గురువారం తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో జగన్‌ను కలిసిన ఐదుగురు విద్యార్థులూ అంతకుముందు ప్రైవేటు కాన్వెంట్లలో చదువుకున్న వారే. ఇద్దరు అమ్మాయిలు ఐదో తరగతి వరకు కాన్వెంట్‌లో చదువుకుని… ఐదేళ్ల కిందట బెండపూడి బడిలో చేరారు. ప్రస్తుతం పదో తరగతి చదువుతున్నారు. తొమ్మిదో తరగతి చదువుతున్న ఇంకో విద్యార్థి నాలుగేళ్ల కిందట ప్రైవేటు స్కూలు నుంచి బెండపూడి హైస్కూల్‌లో చేరాడు. మరొకరు గత ఏడాదే ఈ స్కూలులో చేరారు. ఒక విద్యార్థిని ఈ సంవత్సరం బెండపూడి బడిలో ఎనిమిదో తరగతిలో చేరింది.