Srikakulam: శ్రీకాకుళం పార్లమెంట్ స్థానంపై వైసీపీ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. ఈసారి ఎలాగైనా అక్కడ వైసీపీ జెండా ఎగురవేయాలని భావిస్తోంది. యువ నేత, సిట్టింగ్ ఎంపి కింజరాపు రామ్మోహన్ నాయుడును ఎలాగైనా ఓడించాలని కృత నిశ్చయంతో ఉంది. సరైన అభ్యర్థిని బరిలోదించాలని భావిస్తోంది. దీంతో చాలామంది పేర్లను పరిశీలిస్తోంది. ధర్మాన ప్రసాదరావు, ఆయన సోదరుడు కృష్ణదాస్, స్పీకర్ తమ్మినేని సీతారాం వంటి వారిని సంప్రదించినట్లు సమాచారం. అయితే ఎంపీగా పోటీ చేయడానికి ఆ ముగ్గురు నేతలు సుముఖత వ్యక్తం చేయలేదని తెలుస్తోంది. అటు కేంద్రమంత్రిగా పనిచేసిన కిల్లి కృపారాణిని రంగంలోకి దించాలని చూసినా.. సోషల్ ఇంజనీరింగ్ లో కొత్త వ్యక్తి అయితేనే వర్కౌట్ అవుతుందని భావిస్తున్నట్లు సమాచారం.
వైసిపి ఆవిర్భావం నుంచి శ్రీకాకుళం పార్లమెంట్ స్థానం ఆ పార్టీకి చిక్కడం లేదు. 2014 ఎన్నికల్లో తొలిసారిగా ఎంపీ రామ్మోహన్ నాయుడు పోటీ చేశారు. తండ్రి ఎర్రన్నాయుడు అకాల మరణంతో రాజకీయాల్లో ప్రవేశించారు. 2014 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా కాపు సామాజిక వర్గానికి చెందిన రెడ్డి శాంతి పోటీ చేశారు. కానీ ఓటమి ఎదురైంది. భారీ మెజారిటీతో రామ్మోహన్ నాయుడు విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో రెండోసారి రామ్మోహన్ నాయుడు పోటీ చేశారు. వైసీపీ అభ్యర్థిగా బలమైన కాళింగ సామాజిక వర్గానికి చెందిన దువ్వాడ శ్రీనివాస్ బరిలో దిగారు. పార్లమెంట్ స్థానం పరిధిలో ఐదు అసెంబ్లీ స్థానాలు వైసీపీ పరమైనా.. రామ్మోహన్ నాయుడు మాత్రం 8000 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. జగన్ ప్రభంజనాన్ని సైతం తట్టుకొని నిలబడ్డారు. అందుకే ఈసారి కొత్త ముఖాన్ని దించాలని భావిస్తున్నారు.
జిల్లా పరిషత్ చైర్మన్ గా ఉన్న పిరియా విజయ సరైన అభ్యర్థి అవుతారని వైసిపి హై కమాండ్ భావిస్తున్నట్లు సమాచారం. ఆమె సూర్య బలిజ సామాజిక వర్గానికి చెందినవారు. ఆమె భర్త, మాజీ ఎమ్మెల్యే ప్రియా సాయిరాజ్ కాళింగ సామాజిక వర్గానికి చెందినవారు. దీంతో సామాజిక సమీకరణల్లో భాగంగా ఎంపిక చేస్తే.. కాపులు, కాళింగుల ఓట్లు తమ వైపు తిప్పుకోవచ్చని వైసిపి భావిస్తోంది. తొలిసారిగా రాజకీయాల్లో ప్రవేశించిన విజయ జడ్పిటిసి గా పోటీ చేశారు. జిల్లా పరిషత్ చైర్మన్ గా కూడా ఎంపికయ్యారు. ప్రస్తుతం ఆమె భర్త సాయిరాజ్ ఇచ్చాపురం నియోజకవర్గం ఇన్చార్జిగా ఉన్నారు. మరోసారి ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు సిద్ధపడుతున్నారు. హై కమాండ్ మాత్రం పిరియా విజియను శ్రీకాకుళం ఎంపీ గా పోటీ చేయించాలని ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఇచ్చాపురం అసెంబ్లీ స్థానానికి కొత్త అభ్యర్థిని దించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే అది ఎంతవరకు వర్క్ అవుట్ అవుతుందో చూడాలి.