YCP Weakness: ఏపీలో ఎన్నికలకు మరో 10 నెలల వ్యవధి మాత్రమే ఉంది. అన్ని పార్టీలు ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి. ఎవరికి వారే గెలుపు పై ధీమా వ్యక్తం చేస్తున్నారు.అయితే ఈ విషయంలో అధికార వైసిపి అంతులేని ధీమా కనబరుస్తోంది. వై నాట్ 175 అంటూ విర్రవీగినంత పని చేస్తోంది . రెండోసారి తమదే విజయం అని శపధం చేస్తోంది. అయితే క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం అందుకు విరుద్ధంగా ఉంది.
రాజకీయాలకతీతంగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే తమను గెలిపిస్తాయని వైసిపి నేతలు భావిస్తున్నారు. వాలంటీర్ వ్యవస్థ, ఆపై గృహసారథులు విజయంలో కీలక భూమిక పోషిస్తారని నమ్ముతున్నారు. నాడు నేడుతో విద్యా వ్యవస్థలో సమూల మార్పులు, మెడికల్ కాలేజీల ఏర్పాటు, పోర్టులు, హార్బర్ల నిర్మాణం ప్రారంభం వంటివి కలిసి వస్తాయని అధికార పక్షంలో ధీమా వ్యక్తం అవుతోంది.
కానీ విపరీతమైన ప్రతికూల అంశాలు వైసీపీని వెంటాడుతున్నాయి. ప్రధానంగా కేడర్ పై నాయకత్వం పట్టుతప్పుతోంది. పార్టీలో వర్గ విభేదాలు పెరిగాయి. కట్టడి చర్యలు తీసుకోలేని స్థాయికి చేరుకున్నాయి. లా అండ్ ఆర్డర్ లో వైసిపి చోటా నాయకుల జోక్యం మితిమీరి పోయింది. గతంలో టిడిపిలో జరిగిన తప్పిదమే ఇప్పుడు కనిపిస్తోంది. ప్రశ్నించే వారిపై దాడులు, కేసులు పెరిగాయి. ఇవన్నీ వచ్చే ఎన్నికల్లో విపరీతంగా ప్రభావం చూపనున్నాయి.
గతంలో విపక్ష నేతగా ఉండేటప్పుడు జగన్ బాదుడే బాదుడు అంటూ కామెంట్స్ చేశారు. ఇప్పుడు వాటన్నింటినీ నిజం చేస్తున్నారు. చార్జీలు, పన్నులు పెంచేశారు. దేశంలోనే పెట్రోల్ డీజిల్ ధర అధికంగా ఉన్న రాష్ట్రంగా ఏపీని నిలబెట్టారు. విద్యుత్ చార్జీలను అమాంతం పెంచేశారు. చివరకు చెత్త పై కూడా పన్ను విధించారు. ఇవన్నీ ప్రతికూల అంశాలే. అయితే వీటన్నింటినీ సంక్షేమ పథకాలతో అధిగమిస్తామని వైసీపీ నేతల ప్రగాఢ నమ్మకం. అయితే ప్రజల ఆలోచన ఎలా ఉందో చూడాలి మరి