ఇళ్ల స్థలాల పంపిణీ వాయిదాకు కారణం ఇదేనా..!

రాష్ట్రంలో ఇళ్ల స్థలాల పంపిణీకి ముహూర్తం కుదరడం లేదు. ఇప్పటికే ఒకసారి వాయిదా పడిన ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమాన్ని ఈ నెల 8వ తేదీన వైఎస్సార్ జయంతి సందర్భంగా నిర్వహించాలని సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. అయితే తాజాగా మరోసారి ఈ కార్యక్రమాన్ని వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం ఇళ్ల స్థలాల లబ్ధిదారులను తీవ్ర నిరాశకు గురి చేసింది. తొలుత మార్చి నెల 25న ఉగాది పండుగ రోజు ఇళ్ల స్థలాల పంపిణీ […]

Written By: Neelambaram, Updated On : July 6, 2020 8:57 pm
Follow us on


రాష్ట్రంలో ఇళ్ల స్థలాల పంపిణీకి ముహూర్తం కుదరడం లేదు. ఇప్పటికే ఒకసారి వాయిదా పడిన ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమాన్ని ఈ నెల 8వ తేదీన వైఎస్సార్ జయంతి సందర్భంగా నిర్వహించాలని సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. అయితే తాజాగా మరోసారి ఈ కార్యక్రమాన్ని వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం ఇళ్ల స్థలాల లబ్ధిదారులను తీవ్ర నిరాశకు గురి చేసింది. తొలుత మార్చి నెల 25న ఉగాది పండుగ రోజు ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించాలని భావించారు. అప్పట్లో కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ అమలులో ఉండటంతో వాయిదా వేశారు.అప్పటి నుంచి లబ్ధిదారులు సుమారు 29 లక్షల మంది స్థలాల కోసం నిరీక్షిస్తున్నారు

ఇళ్ల స్థలాల పంపిణీని తాజాగా ఆగస్టు 15వ తేదీకి వాయిదా వేశారు. ఇళ్ల స్థలాల పంపిణీ కోసం రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో స్థలాల సేకరణ దాదాపుగా పూర్తయ్యింది. అయితే ఈ సారి ప్రభుత్వం రైతుల వద్ద నుంచి భూమి కొనుగోలు చేసి భారీ స్థాయిలో లే అవుట్ లు వేశారు. భూముల కొనుగోలు విషయంలో భారీ స్థాయిలో అక్రమాలు చోటు చేసుకున్నాయని విపక్షాలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వైసీపీలో నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు వంటి వారు ఇళ్ల స్థలాల సేకరణ విషయంలో అక్రమాలు జరిగాయని ప్రకటించారు. స్థానిక వైసీపీ నాయకులు అధికారులతో కలిసి మార్కెట్ రేటుకంటే అధిక ధర చెల్లించి భూములు కొనుగోలు చేసినట్లు చెబుతున్నారు.

మరోవైపు ఇళ్ల స్థలాల పంపిణీ కోసం వ్యవసాయ భూముల సేకరణ చేపట్టి లే అవుట్ లుగా అభివృద్ధి చేశారు. తూర్పు గోదావరి జిల్లాలో అవ భూములను ఇళ్ల స్థలాలుగా పంపిణీ చేయడంపై పెద్ద దుమారం రేగింది. స్థానికులు, టీడీపీ న్యాయస్థాన్ని ఆశ్రయించారు. దీని వల్ల ప్రకృతి సమతుల్యత దెబ్బతింటుందని, మత్స్యకారులు ఉపాధి కోల్పోతారని టీడీపీ వాదిస్తోంది. జిల్లా కలెక్టర్ ఈ వాదనను ఖండించారు. కృష్ణా జిల్లాల్లో మండవల్లి మండలంలోని గన్నవరం గ్రామంలో చెరువును పూడ్చి ఇళ్ల స్థలాలుగా మార్చారు. సుప్రీం కోర్టు గతంలో ఇచ్చిన తీర్పుల ఆధారంగా జలవనరులు ఉన్న ప్రదేశాలను ఇళ్ల స్థలాలకు కేటాయించడం చేయకూడదు. అదేవిధంగా మరి కొన్ని చోట్ల న్యాయపరమైన ఇబ్బందులు ఉండటంతో పంపిణీ కార్యక్రమాన్ని వాయిదా వేసినట్లు తెలిసింది. సుప్రీం కోర్టులో ఈ అంశంపై కేసుల ఉన్నట్లు తెలుస్తుంది. దీంతో స్థలాల పంపిణీని ప్రభుత్వం తాత్కాలికంగా వాయిదా వేసినట్లు సమాచారం. అయితే వాయిదాకు సంబంధించిన కారణాలు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించలేదు.