CPS Scheme: ఎన్నికల ముందు ఇచ్చిన అన్ని హామీలను అమలుచేశామని ఏపీ సర్కారు చెబుతోంది. నాడు ఇవ్వని కొన్ని హామీలను సైతం అమలు చేసి చూపించామని పేర్కొంది. అన్నివర్గాలకు ప్రాధాన్యతనిచ్చినట్టు చెప్పుకొస్తోంది. అయితే తమకు మాత్రం జగన్ సర్కారు తీరని అన్యాయం చేసిందని కొన్ని వర్గాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. గత ఎన్నికల్లో ఆదరించి.. అధికారంలోకి తెచ్చిన మమ్మల్ని దారుణంగా వంచించారని ఆ వర్గాలు చెబుతున్నాయి. ఇలాగే ఎన్నికలకు వెళితే మాత్రం తమ ప్రతాపం చూపిస్తామని హెచ్చరిస్తున్నాయి. దీంతో జగన్ సర్కారు పునరాలోచనలో పడింది. నాడు అవగాహన లేకుండా హామీలు ఇచ్చామని.. ఇప్పుడున్న క్లిష్ట పరిస్థితుల్లో అమలుచేయడం అసాధ్యమని..అలాగని వారిని వదులుకుంటే వచ్చే ఎన్నికల్లో ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయని భావిస్తోంది. అందుకే ఎన్నికల వరకూ నాన్చి.. సరిగ్గా నోటిఫికేషన్ కు రెండు నెలల ముందు హామీలకు పరిష్కార మార్గం చూపి.. అనుకూల ప్రకటన చేయాలని భావిస్తోంది. ఇందుకు కార్యాచరణ రెడీ చేసింది.

ఆ రెండు వర్గాల్లో అసంతృప్తి..
ప్రధానంగా ఉద్యోగ, ఉపాధ్యాయులు జగన్ సర్కారుపై గుర్రుగా ఉన్నారు. అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో సీపీఎస్ రద్దు చేస్తామన్న హామీకి అతీగతీ లేదు. మూడేళ్లు దాటుతున్నా చలనం లేదు. బహుశా సీఎం జగన్ పాలన వారం రోజులు దాటకపోయి ఉంటుందని ఉద్యోగ, ఉపాధ్యాయులు విమర్శిస్తున్నారు. గత ఎన్నికల్లో జగన్ కు ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలు అండగా నిలిచాయి. అందుకే అంతగా మెజార్టీ సాధ్యమైందని రాజకీయ విశ్లేషకులు సైతం భావిస్తుంటారు. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఉద్యోగ, ఉపాధ్యాయులపై కఠినంగా వ్యవహరించిన సందర్భాలున్నాయి. డీఏలు ఇచ్చి.. అదే పీఆర్సీ అని లెక్క కట్టిన సందర్భాలున్నాయి. అడ్డగోలుగా వాదించి జీతాలు పెరగకుండా చూసింది. దీంతో తాము దారుణంగా నష్టపోయామన్న భావన, బాధ, కసి ఆ రెండు వర్గాల్లో ఉండిపోయింది. అనేక సౌకర్యాలకు సైతం మంగళం పలికింది. సీపీఎస్ విషయంలో సైతం మడమ తిప్పేసింది. ఒక వేళ అమలుచేస్తే మాత్రం పెద్ద మొత్తంలో బడ్జెట్ అవసరమని భావించి మౌనాన్నే ఆశ్రయిస్తోంది.
Also Read: MP Gorantla Madhav-TDP: బాబు ఆడియో మాటేమిటి? టీడీపీ ఆరోపణలపై ఎంపీ మాధవ్ కౌంటర్
పోరుబాట..
అయితే వైసీపీ సర్కారు తమను అన్నివిధాలా దగా చేసిందని ఆరోపిస్తూ ఉద్యోగ, ఉపాధ్యాయులు రోడ్డెక్కారు. నిరసన బాట పట్టారు. అటు పాఠశాల విద్యావిధానంపై సైతం అన్ని ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాలు ఉద్యమిస్తున్నాయి. ఆ రెండు వర్గాల్లో ఆగ్రహం పెల్లుబికిన సమయంలో ఎన్నికలకు వెళితే ప్రతికూలత ఎదురయ్యే అవకాశముందని భయపడుతున్న వైసీపీ సర్కారు కొత్త ఎత్తుగడకు తెరతీసినట్టు తెలుస్తోంది.ఇంకా ఎన్నికలకు 20 నెలల వ్యవధి ఉన్న దృష్ట్యా చివరి వరకూ కమిటీల పేరిట నాన్చి.. చివరి 2 నెలల్లో సీపీఎస్ కు అనుకూలంగా ప్రకటన చేయాలని చూస్తోంది. ఇప్పటికే సీపీఎస్ ను రద్దుచేసిన రాష్ట్రాల్లో అధ్యయనం పేరిట కాలయాపన చేయాలని భావిస్తోంది. సీపీఎస్ రద్దు చేసిన ఘనతతో ఎన్నికల్లో లబ్ధి పొందాలన్నది వైసీపీ సర్కారు భావనగా తెలుస్తోంది.

నమ్ముతారా?
వైసీపీ సర్కారు వచ్చిన తరువాత తమకు చాలా నష్టం జరిగిందని ఉద్యోగులు, ఉపాధ్యాయులు భావిస్తున్నారు. దీనికి తోడు జాతీయ విద్యావిధానంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలలు మూతపడ్డాయి. ఉపాధ్యాయులను పక్క పాఠశాలల్లో సర్దుబాటు చేశారు. కొత్తగా ఉపాధ్యాయుల నియామకాలు లేవు. ఖాళీ ఉద్యోగాలను సైతం భర్తీ చేయడం లేదు. ఒక ప్రణాళిక ప్రకారం ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేస్తున్నారన్న అనుమానం ఉపాధ్యాయవర్గంలో ఉంది. అందుకే ప్రభుత్వం ఎన్ని ఎత్తుగడలను వేసినా వినే పరిస్థితిలో లేదు. ఎన్నికల ముందు సీపీఎస్ ను రద్దుచేసినా వినే పరిస్థితి ఉండదని ఉద్యోగ, ఉపాధ్యాయవర్గాలు చెబుతున్నాయి.
Also Read:Pawan Kalyan: రాష్ట్రంలో శ్రీలంక పరిస్థితులు రావొచ్చు?
[…] […]