జబర్దస్త్ జడ్జి, నగరి ఎమ్మెల్యే రోజాకు ప్రతికూల పవనాలే వీస్తున్నాయి. సొంత పార్టీలోని వారే వైరి వర్గంగా మారుతూ తలనొప్పులు తెస్తున్నారు. పార్టీ గెలుపు కోసం కృషి చేయాల్సిన వారే అడుగడుగునా అడ్డు తగులుతూ పార్టీ ప్రతిష్టను మంటగలుపుతున్నారు. రోజా ఆధిపత్యాన్ని ప్రదర్శించకుండా మోకాలడ్డుతున్నారు. దీంతో పార్టీలో తన హవా ఉండకూడదనే ఉద్దేశంతోనే ఇదంతా చేస్తున్నట్లు తెలుస్తోంది. మరో వైపు ఆమెకు మంత్రి పదవి దక్కకుండా కూడా ఇదే వర్గం తన వంతు పోషిస్తుందనేది నిర్వివాదాంశం. ఈ నేపథ్యంలో రోజా తన దైన శైలిలో పార్టీ అభ్యర్థులను గెలిపించుకుని ఎంపీపీలుగా చేసేందుకే ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు.

పరిషత్ ఎన్నికల్లో చక్రపాణి రెడ్డి వర్గం రెబెల్ అభ్యర్థులను బరిలో దింపి సొంత పార్టీ వారినే ఓడించాలని కంకణం కట్టుకున్నారు. అయినా భయపడని రోజా తమ పార్టీ వారిని గెలిపించుకునేందుకే ప్రాధాన్యం ఇచ్చారు. తద్వారా వారిని గెలిపించుకున్నారు. దీంతో పార్టీలో అంతర్గత కుమ్ములాటలు తారాస్థాయికి చేరాయని అక్కడి పరిస్థితులను బట్టి తెలుస్తోంది. ఈ క్రమంలో నగరి నియోజకవర్గ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి.
నిండ్ర మండలంలో పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి అనుచరుడైన చక్రపాణి రెడ్డి చాలా కాలంగా రోజాకు వ్యతిరేకంగా రాజకీయం చేస్తున్నాడు. ప్రస్తుతం నిండ్ర ఎంపీపీ ఎన్నికపై ఆసక్తి నెలకొంది. విజయపురం ఎంపీపీ ఎన్నికలో మొదలైన వర్గపోరు నిండ్ర తో తారాస్థాయికి చేరుకుంది. విజయపురం ఎంపీపీగా లక్ష్మీపతి రాజును అభ్యర్థిగా ఎంచుకున్నా దీనికి రోజా అడ్డుకట్ట వేశారు. దీంతో దళిత మహిళ జమునను ఎంపీపీగా గెలిపించుకుని తన సత్తా చాటారు.
నిండ్రలో కూడా ఎంపీపీ అభ్యర్థిగా దీప అనే మహిళను రోజా ఎంపిక చేశారు. కానీ చక్రపాణి రెడ్డి తమ్ముడు భాస్కర్ రెడ్డిని ఎంపీపీగా చేయాలని భావించారు. దీంతో ఐదుగురు ఎంపీటీసీలు ప్రత్యేక శిబిరానికి వెళ్లారు. ఈనెల 24న జరగాల్సిన ఎన్నికకు ఐదుగురు ఎంపీటీసీలు హాజరు కాలేదు. దీంతో ఇక్కడ ఎన్నిక వాయిదా పడింది. ఈ నేపథ్యంలో నగరిలో వర్గపోరు బహిర్గతమైంది. ఇరు వర్గాల్లో నువ్వా నేనా అన్నట్లు మారింది పరిస్థితి. ఇంకా ఎన్ని పరిణామాలు చోటుచేసుకుంటాయో వేచి చూడాల్సిందే.