JanaSena Vs YCP: జనసేన పై కోవర్ట్ ఆపరేషన్ జరుగుతోందా? దీనికి సజ్జల రామకృష్ణారెడ్డి సారథ్యం వహిస్తున్నారా? జనసేనలో అలజడికి ప్రయత్నిస్తున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు కూడా అలానే ఉన్నాయి. జనసేన కేంద్ర కార్యాలయ ఇన్చార్జిని వైసీపీలో చేర్చుకోవడం వెనుక పెద్ద కుట్ర జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. ఆ ఇంచార్జ్ వైసీపీకి సమాచారం అందిస్తున్నాడు అన్న విషయం తెలుసుకొని జనసేన అప్రమత్తమయ్యింది. ఆయన తప్పించేసరికి.. అసలు విషయం బయటపడిందని ఏకంగా వైసిపి కండువా కప్పుకున్నారు.
ప్రస్తుతం జనసేన ను నిర్వీర్యం చేయడమే సజ్జల రామకృష్ణారెడ్డి లక్ష్యం. అందుకే ఆయన ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. జనసేనలోకి తన మనసులను పంపించే ప్రయత్నం చేస్తున్నారు. ఉత్తరాంధ్రతో పాటు ఉభయగోదావరి జిల్లాల నుంచి కొంతమంది సన్నిహితులను సజ్జల రామకృష్ణారెడ్డి జనసేనలోకి పంపించేందుకు ప్రత్యేక వ్యూహం పన్నినట్లు తెలుస్తోంది. టిడిపి తో పొత్తు, టికెట్ల సర్దుబాటు విషయంలో రచ్చ చేయాలన్నది ఈ ప్లాన్. తెలుగుదేశం పార్టీతో సీట్లు, ఓట్లు సర్దుబాటు సవ్యంగా జరగకూడదు అన్నదే ఈ కొత్త ప్రణాళిక. దీని ప్రకారం పొత్తును విచ్ఛిన్నం చేసి రాజకీయ లబ్ది పొందాలని వైసీపీ చూస్తోంది. జనసేన ను టార్గెట్ చేసుకొని అనేక వ్యూహాలను రూపొందిస్తున్నారు. ఎన్నికల ముందు అమలు చేయాలని చూస్తున్నారు.
ఇటీవల జనసేన నుంచి సందీప్ రాయల్ అనే నాయకుడు వైసీపీలో చేరిన సంగతి తెలిసిందే. సజ్జల రామకృష్ణారెడ్డి సమక్షంలో ఆయన వైసిపి గూటికి చేరారు. కానీ అధికారికంగా చేరారే కానీ.. అంతకు ముందు నుంచే ఆయన వైసీపీ కోసం పని చేస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. జనసేన కేంద్ర కార్యాలయం ఇన్చార్జిగా సందీప్ రాయల్ ఉండేవారు. జనసేన యాక్టివిటీస్ ఎప్పటికప్పుడు వైసీపీకి చేరవేసేవారని తెలుస్తోంది. ఈ విషయాన్ని గుర్తించిన జనసేన నాయకత్వం సందీప్ రాయల్ ను పక్కన పెట్టింది. దీంతో అసలు విషయం తెలిసిపోయింది కదా అని సందీప్ రాయల్ అధికారికంగా వైసీపీలో చేరిపోయారు. అయితే ఇలాంటి నాయకులు చాలామంది ఇంకా జనసేన లో ఉన్నారని.. ఎన్నికల ముంగిట మరికొందరు ప్రవేశిస్తారని కామెంట్స్ వినిపిస్తున్నాయి.
జనసేన ఆవిర్భావం నుంచి ఆ పార్టీపై ఇటువంటి కుట్రలు కొనసాగుతూనే ఉన్నాయి. గతంలో ప్రజారాజ్యంపై వైయస్ రాజశేఖర్ రెడ్డి ఇటువంటి కోవర్ట్ ఆపరేషన్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు కూడా అదే మాదిరిగా జనసేనపై చేయాలని చూస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో టిడిపి, జనసేన కూటమి గెలవకూడదని శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. దీనికి సజ్జల రామకృష్ణారెడ్డి సారధ్యం వహిస్తున్నారు. అయితే తనపై జరుగుతున్న కుట్రను జనసేనాని ఎలా అధిగమిస్తారో చూడాలి.