Pawan Kalyan: వారాహి యాత్రలో అల్లర్లకు వైసీపీ కుట్ర.. పవన్ సంచలన వ్యాఖ్యలు

తెలుగుదేశం పార్టీతో పొత్తు ప్రకటన తర్వాత పవన్ వారాహి మూడో విడత యాత్రకు శ్రీకారం చుట్టారు. యాత్రకు తెలుగుదేశం పార్టీ మద్దతు ప్రకటించింది. యాత్రలో పెద్ద ఎత్తున టిడిపి శ్రేణులు సైతం పాల్గొంటున్నాయి.

Written By: Dharma, Updated On : October 3, 2023 6:20 pm

Pawan Kalyan

Follow us on

Pawan Kalyan: వారాహి యాత్రలో విధ్వంసాలు సృష్టించేందుకు జగన్ సర్కార్ గట్టి ప్రయత్నం చేస్తుందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన ఆరోపణలు చేశారు. అక్టోబర్ 1 నుంచి ఉమ్మడి కృష్ణాజిల్లాలో పవన్ వారాహి యాత్రను ప్రారంభించిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా మంగళవారం మచిలీపట్నంలో జనవాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. పెద్ద ఎత్తున ప్రజలు వచ్చి తమ సమస్యలను పవన్ కు వివరించారు. వారి సమస్యలను పవన్ ఓపికగా విన్నారు. వెన్నునొప్పి బాధ పెడుతున్నా.. తనకోసం వచ్చిన వారిని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక… ప్రతి ఒక్కరి సమస్యను విన్నారు. వాటికి పరిష్కారం చూపిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం పవన్ మీడియాతో మాట్లాడారు. జగన్ సర్కార్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.

తెలుగుదేశం పార్టీతో పొత్తు ప్రకటన తర్వాత పవన్ వారాహి మూడో విడత యాత్రకు శ్రీకారం చుట్టారు. యాత్రకు తెలుగుదేశం పార్టీ మద్దతు ప్రకటించింది. యాత్రలో పెద్ద ఎత్తున టిడిపి శ్రేణులు సైతం పాల్గొంటున్నాయి. మరోవైపు రెండు పార్టీల మధ్య పొత్తును విచ్ఛిన్నం చేయడానికి అధికార వైసీపీ ప్రయత్నిస్తోందన్న ఆరోపణలు వస్తున్నాయి. సోషల్ మీడియాలో రెండు పార్టీల మధ్య కలహాలు వచ్చే విధంగా పోస్టులు పెడుతున్నారని.. సామాజిక వర్గాల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం జరుగుతోందని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో జనసేన నాయకత్వం అప్రమత్తమయింది. పార్టీ శ్రేణులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. పొత్తుల విషయంలో అధినేత నిర్ణయం ఫైనల్ అని.. రెండు పార్టీల మధ్య సంబంధాలు దెబ్బతినేలా ఎవరు వ్యవహరించవద్దని ప్రత్యేక ప్రకటన విడుదల చేసింది.

ఇటువంటి తరుణంలో పవన్ తాజాగా చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. వారాహి యాత్రను జగన్ సర్కార్ అడ్డుకునే ప్రయత్నం చేస్తుందని పవన్ ఆరోపించారు. బుధవారం జరగబోయే పెడన నియోజకవర్గ వారాహి విజియాత్ర సభలో రౌడీ మూకలు, గూండాలను దించి సభ పై రాళ్లు దాడి చేయించేలా జగన్ ప్రభుత్వం పకడ్బందీగా ప్లాన్ చేసినట్టు సమాచారం వచ్చినట్లు పవన్ ఆరోపించారు. సభలో ఎలాంటి అలజడులు సృష్టించిన దానికి ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుందని పవన్ హెచ్చరించారు. వైసిపి నాయకులతో పాటు డీజీపీకి, హోంమంత్రికి, పోలీస్ అధికారులకు స్పష్టంగా చెబుతున్నా… ఏమైనా అవాంఛనీయ ఘటనలు జరిగితే దానికి మీరే బాధ్యత తీసుకోవాల్సి ఉంటుందని నేరుగా హెచ్చరించారు.

వచ్చే ఎన్నికల్లో టిడిపి, జనసేన కలవకుండా చెడగొట్టేందుకు వైసిపి దుష్టపన్నగాలు పొందుతోందని పవన్ ఆరోపించారు. ఇరు పార్టీల మధ్య చిచ్చు పెట్టి ఓట్లు, సీట్లు బదలాయింపు జరగకుండా చూడాలని ప్రయత్నిస్తుందని.. దీనిని జనసైనికులు, టిడిపి శ్రేణులు గట్టిగా ఎదుర్కోవాలని పవన్ పిలుపునిచ్చారు. రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగితే రాష్ట్ర డిజిపి నే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. రాష్ట్రంలో పులివెందుల రౌడీయిజం చేయిస్తే సహించేది లేదని వార్నింగ్ ఇచ్చారు. క్రిమినల్ మైండ్ తో ఏపీలో గొడవలు సృష్టించాలని సీఎం చూస్తున్నారని ఆరోపించారు. వారాహి యాత్రలో ఎవరైనా ఆగంతకులు రాళ్లు దాడికి దిగిన జనసైనికులు, తెలుగు తమ్ముళ్లు ఎదురుదాడికి దిగవద్దని కోరారు. వారిని పోలీసులకు అప్పగించాలని సూచించారు.