Pawan vs YCP : జగన్ ను అధికారం నుంచి దూరం చేస్తానని పవన్ ప్రతినబూనారు. వైసీపీ విముక్త ఏపీ యే తన లక్ష్యమని పలు సందర్భాల్లో ప్రకటించారు. ఇంపటంలో కూల్చివేసిన ఇళ్ల మట్టిని చూపి మరీ శపథం చేశారు. అందుకు తగ్గట్టుగానే వ్యవహరిస్తున్నారు. అటు కేంద్రంలోని బీజేపీ పెద్దలతో సఖ్యతగా ఉంటూనే రాష్ట్రంలో మిగతా రాజకీయ పక్షాలతో ఐక్యంగా ముందుకు సాగుతున్నారు. అయితే పవన్ దూకుడుకు కళ్లెం వేసేందుకు వైసీపీ తెగ ప్రయత్నాలు చేస్తోంది. పవన్ పై వ్యక్తిగత దాడినే నమ్ముకుంది. అటు జన సైనికులపై అక్రమ కేసులు పెడుతోంది. అయినా వారు వెనక్కి తగ్గడం లేదు. ఎన్నికలకు చివరి ఏడాది కావడంతో మరింత దూకుడుగా వ్యవహరించే అవకాశముందని వైసీపీ భయపడుతోంది. అందుకే జనసేనపై ఓ విష ప్రయోగాన్ని తలపెట్టాలని నిర్ణయించింది. ఇప్పటికే ప్రయోగం చేయడం ప్రారంభించింది.
వైసీపీ అధికారంలోకి వచ్చి నాలుగేళ్లవుతోంది. ఇక మిగిలింది ఏడాది మాత్రమే. వచ్చే ఎన్నికల్లో గెలుపొందాలని జగన్ భావిస్తున్నారు. 175 నియోజకవర్గాలకు 175 సాధిస్తామని శ్రేణులకు ధైర్యం నూరుపోస్టున్నారు. అయితే దానికి పవన్ చెక్ చెప్పే ప్రయత్నంలో ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో జగన్ అధికారంలోకి రాకూడదని భావిస్తున్నారు. అవసరమైతే విపక్షాలను ఏకతాటిపైకి తెస్తానని కూడా ప్రకటించారు. దీంతో పొత్తుల అంశాన్ని తెరపైకి తెచ్చారు. దీనిపై స్పష్టత ఇవ్వకున్నా.. వైసీపీ వ్యతిరేక పార్టీల మధ్య సానుకూల వాతావరణం వచ్చేలా చూడడంలో పవన్ సక్సెస్ అయ్యారు. అటు చంద్రబాబు సైతం పొత్తు కోసం పవన్ చుట్టూ తిరుగుతున్నారు. దీంతో క్షేత్రస్థాయిలో వైసీపీ పై ఒత్తిడి పెరుగుతోంది. మునుపటిలా ధీమా ఆ పార్టీలో లేదు. ఏపీ రాజకీయం పవన్ కేంద్రంగా మారడం వైసీపీకి, జగన్ అండ్ కోకు నచ్చడం లేదు. ప్రధాని మోదీ విశాఖ పర్యటన అనంతరం పవన్ గ్రాఫ్ అమాంతం పెరిగిపోయింది. జాగ్రత్త పడకుంటే పవన్ రూపంలో తమకు దెబ్బ తప్పదని వైసీపీ భావిస్తోంది. అందుకే పవన్ ను ముందుగా దెబ్బతియ్యాలని డిసైడ్ అయ్యింది.
పవన్ వెంట నడిచేవారెవరు? ఇప్పుడు నడుస్తున్నది ఎవరు? అనే జాబితాను నిఘా సంస్థలు సేకరిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో జనసేన తరుపున యాక్టివ్ గా ఉండే వారి వివరాలను కూడా ఆరా తీస్తున్నారు. వారందర్నీ పవన్ నుంచి దూరం చేయడానికి స్కెచ్ వేస్తున్నారు. జనసేనలో క్రియాశీలకంగా పనిచేసే నాయకులు తమ పార్టీలో చేరాలని.. వస్తే సముచిత స్థానం కల్పిస్తామని వైసీపీ ఆహ్వానాలు పంపిస్తోంది. అందుకు వారు అంగీకరిస్తే సరేసరి.. లేకుంటే వారిని ఎలాతిప్పుకోవాలో అన్నదానిపై కసరత్తు చేస్తోంది. ముఖ్యంగా వైసీపీ కీలక నాయకులు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో యాక్టివ్ గా ఉండే జనసేన నాయకులపై అధికార పార్టీ కన్నేసినట్టు తెలుస్తోంది,
తిరుపతికి చెందిన జనసేన నాయకుడు కిరణ్ రాయల్ చాలా యాక్టివ్ గా పనిచేస్తున్నారు. ఆయన మంత్రి రోజా ను టార్గెట్ చేసుకోవడంలో ముందుంటారు. దీంతో ఆయనకు వైసీపీ నేతలు టచ్ లోకి వెళ్లారు. పార్టీలోకి రావాలని ఆహ్వానించారు. అందుకు ఆయన సమ్మతించకపోవడంతో టార్గెట్ చేశారు. ఇప్పటికే పలు రకాల కేసులు నమోదుచేయించి జైలుపాలు చేశారు. అయినా ఆయన బెయిల్ పై విడుదలై పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. నగిరి సీఐ గత 15 రోజులుగా తనను వేధిస్తున్నారని.. వైసీపీలో చేరకపోతే అంతుచూస్తానని బెదిరిస్తున్నారని తాజాగా కిరణ్ రాయల్ ఆరోపించారు. మంత్రి రోజాయే ఇవన్నీ చేయిస్తున్నారని చెప్పారు. అయితే ఒక్క కిరణ్ రాయలే కాదు.. బెదిరింపు బాధితుల జాబితాలో చాలా మంది జనసేన నేతలు ఉన్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి చెందిన పోతిన మహేష్, విశాఖలో బొలిశెట్టి సత్యనారాయణ, మూర్తి యాదవ్ వంటి నాయకులకు ముందుగా వైసీపీ నుంచి ఆహ్వానాలు వస్తున్నాయి. వారు వినకపోయేసరికి లొంగదీసుకునేందుకు కసరత్తులు జరుగుతున్నాయి. మొత్తానికైతే పవన్ దూకుడ్ని కళ్లెం వేసేందుకు వైసీపీపక్కా స్కెచ్ వేసిందన్న మాట.