Pawan Kalyan Chiranjeevi : మెగా బ్రదర్స్ లో చిరంజీవి మృదు స్వభావి. కల్మషం లేని మనసు ఆయనది. ఎదుటు వారు ఎన్ని ఇబ్బందులు పెట్టినా…చిరు నవ్వుతో స్వీకరిస్తారే కానీ.. రిప్లయ్ ఇవ్వరు. అయితే మిగతా ఇద్దరు సోదరులు అలా కాదు. పవన్, నాగబాబులు ప్రత్యర్థులకు దీటైన కౌంటర్లు ఇవ్వగలరు. గట్టిగానే మాట్లాడతారు. ప్రధానంగా చిరంజీవిని ఎవరైనా ఏమైనా అంటే వెంటనే బదులు తీర్చుకుంటారు. గతంలో చాలా సందర్భాల్లో వారి స్పందించిన తీరు చూశాం. అయితే తాజాగా నూతన సంవత్సరం వేడుకల్లో చిరంజీవి తన బాధను వ్యక్తం చేశారు. ప్రధానంగా పవన్ కళ్యాణ్ విషయంలో ప్రత్యర్థుల వ్యవహార శైలిని ప్రస్తావించారు. అటువంటి వారితో తాను కలవాల్సి రావడం, వారింట్లో పెళ్లిల్లు, పేరంటాలకు వెళ్లాల్సి రావడం చాలా ఇబ్బందిగా ఉంటుందని చెప్పుకొచ్చారు. దానిపై తాను చాలా బాధపడుతుంటానని కూడా చిరంజీవి ఆవేదన వ్యక్తం చేశారు.

కొత్త సంవత్సరం వేడుకల్లో భాగంగా పవన్ కళ్యాణ్ పై విమర్శలు మీకెలా అనిపిస్తాయని ప్రశ్నించినందుకు చిరంజీవి కొద్దిగా బాధగానే రియాక్టయ్యారు. ‘మితిమీరి వాడిని అనరాని మాటలు అంటున్నప్పుడు బాధ కలుగుతుంది. పవన్ ను తిట్టిన వాళ్లు నాదగ్గరకు వచ్చి పెళ్లిల్లు, పేరంటాలు, శుభకార్యాలకు పిలుస్తారు. నా తమ్ముడ్ని అన్ని మాటలు అన్నవారితో మాట్లాడాల్సి వస్తుందే…వాళ్లను కలవాల్సి వస్తుందే..అని బాధగా ఉంటుంది’ అని చిరంజీవి ఆవేదనతో చెప్పుకొచ్చారు. అయితే అయినదానికి, కానిదానికి పవన్ పై విమర్శలు గుప్పించేది వైసీపీ బ్యాచే. పవన్ వ్యక్తిగత జీవితం పై ఎక్కువగా మాట్లాడేది వారే. చివరాఖరుకు సీఎం జగన్ సైతం పవన్ వైవాహిక జీవితం పై మాట్లాడారు. పదే పదే అదే ప్రస్తావించి పవన్ మానసిక స్థైర్యాన్ని దెబ్బకొట్టే ప్రయత్నం చేశారు. అందుకే చిరంజీవి వారిని ఉద్దేశించే ఈ కామెంట్స్ చేశారన్న ప్రచారం నడుస్తోంది.
చిరంజీవి ఆ మధ్య సినిమారంగ సమస్యలపై సీఎం జగన్ ను కలిశారు. అప్పట్టో జగన్ చిరంజీవికి గౌరవం ఇవ్వలేదన్న ప్రచారమూ నడిచింది. దానిపై పవన్ రియాక్టయ్యారు కూడా. మెగాస్టార్ లాంటి వ్యక్తినే చేతులు జోడించి అర్థించేలా చేశారని మండిపడ్డారు కూడా. అటు జగన్ ఆహ్వానం మేరకు చిరంజీవి దంపతులు జగన్ ను కలిసిన సందర్భాలున్నాయి. అలాగే వైసీపీ నేతల ఇళ్లలో వివాహాలకు, శుభకార్యాలకు చిరంజీవి హాజరవుతూవస్తున్నారు. ఇప్పుడు చిరంజీవి నేరుగా చేసిన కామెంట్స్ జగన్ అండ్ కో కు ఉద్దేశించినవేనన్న ప్రచారం జరుగుతోంది. పవన్ ను తిట్టినోళ్లు వ్యక్తిగతంగా కలిసి బతిమలాడుకుంటున్నారని అర్ధం వచ్చేలా చిరు వ్యాఖ్యానించారు. ఇప్పుడు చిరంజీవి కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అటు మెగా అభిమానులు ట్రోల్ చేస్తున్నారు. కామెంట్స్ పెడుతున్నారు.