
ఏపీలో గ్రూపు రాజకీయాలు రాజ్యమేలుతున్నాయి. ఆధిపత్య పోరు నడుస్తోంది. పార్టీలు మారనా సీన్ మారలేదు. అదే తంతు. ప్రభుత్వమేదైనా తీరు అదే. సీన్ అంతే. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీల మధ్య రసవత్తర పోరు సాగుతోంది. గత టీడీపీ ప్రభుత్వంలో ఈ గ్రూపు రాజకీయాలే కొంప ముంచాయి. ఇప్పుడు వైసీపీలోను అదే ఊపు కనిపిస్తోంది. విచిత్రం ఏంటంటే నాడు ఏ నియోజకవర్గంలో జరిగిందో ఇప్పడు అదే నియోజకవర్గం కావడం గమనార్హం. పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గంలో ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్ వర్సెస్ చింతలపూడి ఎమ్మెల్యే ఎలీజా మధ్య గ్రూపు రాజకీయాలు వేడెక్కాయి.
గత తెలుగుదేశం ప్రభుత్వంలో చింతలపూడి ఎమ్మెల్యే, మంత్రిగా ఉన్న పీతల సుజాత వర్సెస్ నాటి ఏలూరు ఎంపీ మాగంటి బాబు వర్గాల మధ్య గ్రూపు రాజకీయాలు ఉండేవి చివరకు ఈ గ్రూపు పోరులోనే మంత్రి సుజాత మంత్రి పదవి సైతం కోల్పోయారు. అయినా గత ఎన్నికలకు ముందు వరకు రెండు వర్గాల పంతం అలాగే నడిచింది. చివరకు సుజాత నాలుగున్నరేళ్ల పాటు చింతలపూడి ఏఎంసీ చైర్మన్ పదవి కూడా భర్తీ చేయలేదు. చివరకు సుజాతకు టికెట్ కూడా రాలేదు. మాగంటి బాబుకు సీటు దక్కించుకున్నా ఓటమి పాలయ్యారు.
ఏపీలో ప్రభుత్వాలు మారినా సీన్ మారలేదు. చింతలపూడి వైసీపీ ఎమ్మెల్యే, ఏలూరు వైసీపీ ఎంపీయే ఉన్నారు. నాడు టీడీపీలో జరిగిన వర్గాల పోరే నేడు జరుగుతోంది. గత ఎన్నికల్లో గెలిచాక తొలి ఏడాది బాగానే ఉన్నా ఎమ్మెల్యే ఎలీజా, ఎంపీ శ్రీధర్ మధ్య ఇప్పుడు తీవ్రమైన యుద్ధమే నడుస్తోంది. చివరకు స్థానిక సంస్థల ఎన్నికల్లో కీలక పంచాయతీల్లో వైసీపీలోనే రెండు వర్గాల ప్యానెల్స్ పోటీ చేశాయి. ఈ పో రులో ఎలీజా వర్గం చిత్తుగా ఓడిపో యింది.
చింతలపూడి నియోజకవర్గానికి గుండెకాయ లాంటి జంగారెడ్డిగూడెం మున్సిపల్ చైర్మన్ పదవి ఏఢాది క్రితమే ఎంపీ వర్గానికి చెందిన వ్యక్తికి ఇవ్వాలని అనుకున్నారు. ఈ వర్గ పోరు తర్వాత ఎమ్మెల్యే తన వర్గానికి చెందిన నేతలకు చైర్మన్ పదవి కట్టబెట్టాలని ప్రయత్నాలు చేశారు. చివరకు రెండు వర్గాల పంచాయతీ సీఎం వద్దకు చేరడంతో మధ్యే మార్గంగా బీసీలకు ఈ పదవి కట్టబెట్టారు. కోటగిరి వర్గానికి ధీటుగా పట్టు పెంచుకోవాలని ప్రయత్నిస్తోన్న ఎమ్మెల్యే కొన్ని వర్గాలను ప్రోత్సహిస్తున్నారు. ఎంపీ వర్గం ఎక్కువగా ఉండడంతో అక్కడ విలువ లేదనుకున్న వారంతా ఇప్పుడు ఎమ్మెల్యే వర్గంలో చేరిపోతున్నారు. ఎంపీకి బలమైన నేతలుగా ఉన్న టీడీపీ నేతలను పార్టీలో చేర్చుకుంటున్నారు.