YCP: ఏపీలో రెండోసారి అధికారంలోకి రావాలని జగన్ గట్టి ప్రయత్నమే చేస్తున్నారు. వై నాట్ 175 అన్న నినాదంతో ముందుకు వెళుతున్న ఆయన పెద్ద ఎత్తున అభ్యర్థులను మార్చారు. ముఖ్యంగా బీసీలకు పెద్దపీట వేశారు. ఏకంగా 48 అసెంబ్లీ, 11 పార్లమెంట్ స్థానాలను బీసీలకు కేటాయించారు. ఇటీవల ఇంత మొత్తంలో బీసీలకు టిక్కెట్లు ఇవ్వడం ఇదే తొలిసారి. 2009లో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ తర్వాత.. బీసీలకు టికెట్లు ఇచ్చింది ఎక్కువగా జగనే. ఎన్నికల్లో ఫలితాలు వైసీపీకి అనుకూలంగా వస్తే.. ఏపీలో బీసీలకు ప్రాధాన్యం పెరిగే అవకాశం ఉంది. ఇకనుంచి ప్రతి రాజకీయ పార్టీ బీసీలకు పెద్ద ఎత్తున టికెట్లు ఇవ్వాల్సి ఉంటుంది.
తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత నందమూరి తారక రామారావు బీసీలకు ఎక్కువగా ప్రాధాన్యమిచ్చారు. ఉమ్మడి రాష్ట్రంలో చాలామంది బీసీ నాయకులు రాజకీయంగా ఎదిగారు. కాంగ్రెస్ పార్టీ వివిధ సమీకరణలో బీసీలకు అంత ప్రాధాన్యం ఇవ్వలేదు. అది గమనించిన ఎన్టీఆర్ తన టిడిపిలో బీసీలకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు. బీసీ నాయకులకు పెద్ద ఎత్తున టికెట్లు ఇచ్చి గెలిపించుకున్నారు. అప్పటినుంచి తెలుగుదేశం పార్టీ బీసీ పార్టీ అన్న ముద్రను సొంతం చేసుకుంది. అయితే కాలక్రమంలో తెలుగుదేశం పార్టీలో బీసీలకు అవకాశాలు తగ్గుముఖం పట్టాయి. 2009లో మాత్రం చిరంజీవి సామాజిక న్యాయం పేరిట బీసీలకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు. బీసీ నాయకులకు టికెట్లు ఇచ్చారు. కానీ నాడు త్రిముఖ పోటీలో బీసీ అభ్యర్థులు గెలవలేదు.
2009లో సామాజిక న్యాయం పనిచేయకపోవడంతో 2014లో బీసీ నినాదం పడిపోయింది. ఏ పార్టీ కూడా పూర్తిగా పట్టించుకోలేదు. జగన్ సైతం గ్రహించలేదు. ఆ ఎన్నికల్లో ఓటమితో తత్వం బోధపడింది. అందుకే 2019లో జగన్ దానిని సరి చేసుకున్నారు. బీసీ నినాదాన్ని తెరపైకి తెచ్చారు. బీసీ అభ్యర్థులకు టికెట్లు ఇచ్చారు. ఏకపక్ష విజయాన్ని దక్కించుకున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీ కార్పొరేషన్లను, ఫెడరేషన్ లను ఏర్పాటు చేశారు. పెద్ద ఎత్తున బీసీల కు రాజకీయ అవకాశం ఇచ్చారు. తాజా ఎన్నికల్లో సైతం 48 అసెంబ్లీ, 11 పార్లమెంట్ స్థానాలను కేటాయించారు. ఈ ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించి.. బీసీలు పెద్ద ఎత్తున గెలిస్తే మాత్రం.. అన్ని పార్టీలు బీసీలకు ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడి నుంచి జరిగే ప్రతి ఎన్నికల్లో బీసీలకు పెద్దపీట వేయాల్సి ఉంటుంది. అటు బీసీలకు టిక్కెట్లు ఇవ్వడం ద్వారా పటిష్టమైన ఓటు బ్యాంకుగా మలుచుకోవాలని జగన్ భావిస్తున్నారు. బీసీలపై పెద్ద ఆశలే పెట్టుకున్నారు. మరి ఎన్నికల్లో బీసీలు ఎటువైపు మొగ్గు చూపుతారో చూడాలి.