
ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ బలం ప్రస్తుతానికైతే నామ మాత్రమే. స్థానిక సంస్థల ఎన్నికలు మొదలు మొన్నటి తిరుపతి ఉప ఎన్నిక ఫలితాల దాకా చాటి చెప్పిన విషయం ఇదే. అయితే.. కేంద్రంలో మాత్రం భారీ మెజారిటీతో అధికారంలో ఉంది. అందుకే.. అనివార్యంగా బీజేపీతో సఖ్యతో కోసం ప్రయత్నిస్తున్నారు జగన్. కరోనా నియంత్రణలో కేంద్రం తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శించిందని దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తిన వేళ.. మోడీకి మద్దతుగా జగన్ ట్వీట్ చేయడం హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. ఈ విధంగా మోడీ చల్లని చూపు కోరుకుంటున్నాననే విషయం బహిరంగంగా వెల్లడించారు జగన్.
ఇటు టీడీపీ కూడా మరోసారి బీజేపీతో చెలిమి చేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. కరోనా కండీషన్ ను బేస్ చేసుకొని పలు మార్లు ప్రెస్ మీట్లు జగన్ ను దునుమాడిన చంద్రబాబు.. మోడీ పేరు కూడా ఎత్తకపోవడం గమనించాల్సిన అంశం. అంతేకాదు.. ఇటీవల జరిగిన మహానాడులో బీజేపీతో కలిసి పనిచేస్తామని కూడా నేరుగా మనసులోని మాటను వెల్లడించారు. ఈ విధంగా ఈ రెండు పార్టీలూ బీజేపీతో ప్రెండ్షిప్ చేసేందుకు తెగ పోటీపడుతున్నాయి.
కానీ.. కమలదళం మాత్రం ఆచితూచి రాజకీయం చేస్తోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీన్ని తట్టుకోలేక.. అసహనాన్ని అణచుకోలేక ఈ రెండు పార్టీలు సతమతం అవుతున్నాయని అంటున్నారు విశ్లేషకులు. జగన్ కంట్లో నలుసుగా మారిన రెబల్ ఎంపీ రఘురామపై అనర్హత వేటు వేయాలని కేంద్రంలోని బీజేపీని పరోక్షంగా కోరుతున్నారు. దాదాపు ఏడాదికాలంగా కోరుతున్నా.. కాషాయ పెద్దలు లైట్ తీసుకుంటున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ అసహనాన్ని లేఖ రూపంలో విజయ సాయిరెడ్డి బయట పెట్టడం కూడా గమనించాలి. రఘురామ వ్యవహారం సుప్రీం తీర్పునకు విరుద్ధమని, ఫిరాయింపుల చట్టానికి కూడా వ్యతిరేకమేనని గళమెత్తారు. అంటే.. పరోక్షంగా కేంద్రం పట్టించుకోవట్లేదని నిరసన వ్యక్తం చేశారు.
అటు టీడీపీ నేతలు కూడా జగన్ సీబీఐ కేసుల అంశాన్ని తెరపైకి తెచ్చారు. కొన్ని కేసుల్లో చట్టం వేగంగా పనిచేసుకుంటూ వెళ్తుందని, కొన్ని కేసుల విషయంలో మాత్రం విచారణ త్వరగా జరగదంటూ యనమల రామకృష్ణుడు అసహనాన్ని వెళ్లగక్కారు. ఈ విధంగా ఈ రెండు పార్టీలూ తమ అసహనాన్ని చాటుకుంటున్నా.. అంతిమంగా తమకు ఏం కావాలో అదే రాజకీయం బీజేపీ చేస్తోందని అంటున్నారు.
రాబోయే ఎన్నికల నాటికి రఘురామ ఉపయోగపడతాడనే భావనతోనే.. అనర్హత విషయంలో కేంద్రం తాత్సారం చేస్తోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇటు జగన్ కేసుల విషయంలోనూ ఇదే వైఖరి అవలంభిస్తోంని అంటున్నారు. రాజ్యసభలో తగినంత బలం లేనందున.. వైసీపీ ఎంపీల మద్దతు అవసరం. అందుకే ఈ కేసుల విచారణ కూడా నత్తకన్నా నెమ్మదిగా సాగుతోందని అంటున్నారు. మొత్తానికి.. బీజేపీ ఆంధ్రప్రదేశ్ లో తన మార్కు రాజకీయం కొనసాగిస్తోందని అంటున్నారు విశ్లేషకులు.