YCP Alliance With Congress: రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే.. మిత్రుడు శత్రువుగా మారుతారు… శత్రువే మిత్రుడవుతారు. దశాబ్దాల కాలంగా ఉన్న వైరం మరచి చంద్రబాబు గత ఎన్నికల్లో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్నారు. తెలంగాణాలో సైతం కాంగ్రెస్ తోనే నడిచారు. ఇప్పుడు ఆ వంతు జగన్ కు వచ్చింది. వచ్చే ఎన్నకల్లో ఆయన కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుంటారన్నటాక్ నడుస్తోంది. ప్రస్తుతానికి అయితే ఆయనకు నేరుగా కాంగ్రెస్ తో ఎటువంటి సంబంధాలు లేవు. కనీసం కాంగ్రెస్ నేతలతో మాట్లాడిన సందర్భాలూ లేవు. ఈ పరిస్థితుల్లో పొత్తు ఎలా సాధ్యమనుకుంటున్నారా? అదే వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ఇప్పుడు ఆ రెండు పార్టీలను కలిపే పనిలో పడ్డారు. దాదాపు జాతీయంగా, ఉత్తరాధి రాష్ట్రాల్లో తుడుచుపెట్టుకుపోయిన కాంగ్రెస్ కు పునరజ్జీవం పోసేందుకు ప్రశాంత్ కిశోర్ కంకణం కట్టుకున్న సంగతి తెలిసిందే. ఆయన కాంగ్రెస్ లో చేరుతారన్న వార్తలు గత కొద్దిరోజులుగా గుప్పుమంటున్నాయి.
అందుకు అనుగుణంగా ఆయన కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, యువనేత రాహుల్ గాంధీతో వరుసగా మంతనాలు జరుపుతున్న సంగతి తెలిసిందే. దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ అనుకూల పవనాలు వీయించాలన్న ప్రయత్నంలో ప్రశాంత్ కిశోర్ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీని మళ్లీ అధికారంలోకి తీసుకు వచ్చేందుకు ప్రశాంత్ కిషోర్ ప్రత్యేక వ్యూహాన్ని అమలుచేస్తున్నారు. దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో అనుసరించాల్సిన దానిపై అధిష్టానానికి ఒక బ్లూ ప్రింట్ అందించారు. తెలుగు రాష్ట్రాల విషయంలో ఆయన కీలకమైన విషయాలను కాంగ్రెస్ నేతల ముందుంచారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీ జగన్‌తో పొత్తు పెట్టుకోవాలని ప్రశాంత్ కిషోర్ సిఫార్సు చేశారు. అలా చేస్తేనే అక్కడ కాంగ్రెస్ పార్టీకి మనుగడ సాధించగలదని సూచిస్తున్నారు. తెలంగాణాలో మాత్రం కాంగ్రెస్ ఒంటరి పోరు చేయడమే మేలని చెబుతున్నారు. తెలుగు రాష్ట్రాల విషయంలో పీకే ప్రతిపాదనలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. రాజకీయాలను ఒక్కసారిగా వేడెక్కించాయి.
Also Read: CM Jagan: రాజ్యసభ సభ్యులుగా ఎవరికి అవకాశం ఇస్తారో
ప్రశాంత్ వ్యూహం వెనుక..
ప్రధానంగా ఏపీ విషయంలో పీకే సిఫారసులు ఎవరికీ ఊహకందనవిగా చెప్పుకుంటున్నారు. అసలు కాంగ్రెస్ తో వైసీపీ నేత జగన్ పొత్తుకు ఒప్పుకుంటారా అన్న సమాధానం వస్తోంది. ఇది జరిగే పనికాదని కొందరు వాదిస్తుండగా.. చంద్రబాబు పొత్తు పెట్టకోనిది లేనిదీ జగన్ ఎందుకు పెట్టుకోరన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. గత ఎన్నికల్లో వైసీపీకి వ్యూహకర్తగా పనిచేసిన పీకే జగన్ కు అంతులేని విజయాన్ని సాధించి పెట్టారు. ఇప్పటికీ కూడా వైసీపీకి పీకే సేవలందిస్తునే ఉన్నారు. ఆయనకు చెందిన ఐ ప్యాక్ టీం వచ్చే ఎన్నికల కోసం వైసీపీకి పని చేయడం ప్రారంభించింది. ఇలాంటి సమయంలో కాంగ్రెస్‌తో పొత్తుకు సిఫార్సు చేశారంటే.. వైసీపీ ముఖ్య నేతల అనుమతి లేకుండా అలా చేయరని భావిస్తున్నారు. ప్రస్తతుం కాంగ్రెస్ పార్టీ దయనీయంగా ఉన్నా ఆ పార్టీకి చెక్కు చెదరని అభిమానం ఉంది. మైనార్టీలు, దళితులు ఎక్కువగా ఆ పార్టీని అభిమానిస్తారు. గత ఎన్నికల్లో వీరు జగన్ వెంట ఉన్నారు.
అయితే గత మూడేళ్లుగా జరుగుతున్న పరిణామాలు వారిని ఆలోచనలో పడేశాయి. కేసుల భయంతో జగన్ బీజేపీని వెంపర్లాడడంతో వారు డిఫెన్స్ లో పడిపోయారు. అలాగని టీడీపీ వైపు వెళ్లే సూచనలు కనిపించడం లేదు. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ ను మచ్చిక చేసుకోవడం ద్వారా వారి పట్టు విడుచుకోకూడదని వైసీపీ భావిస్తోంది. అందుకే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ తో నడవాలని ప్రాథమికంగా నిర్థారణకు వచ్చినట్టు తెలుస్తోంది. అయితే ఇంకా ఎన్నికలకు సమయం ఉన్నందున ఇప్పుడే ప్లేటు ఫిరాయిస్తే.. కేసుల ఇబ్బందులు ఉంటాయని ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. రాష్ట్ర విభజనకు ముందు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలీయమైన శక్తి. కానీ విభజన కాక కాంగ్రెస్ పార్టీని దారుణంగా దెబ్బతీసింది. అదే సమయంలో ఆశాదీపంలా జగన్ కనిపించారు. దీంతో దళితులు, ముస్లిం, మైనార్టీలు గుంపగుత్తిగా జగన్ కు ఓటు వేశారు. ఇప్పుడు జగన్ బీజేపీతో అత్యంత సన్నిహితంగా ఉండటం వల్ల మైనార్టీలు, దళితులు అసంతృప్తితో ఉన్నారన్న ప్రచారం జరుగుతోంది. వారు ఒకటి, రెండు శాతం వైసీపీకి దూరం జరిగినా.. తేడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ సమీకరణాలన్నీ ప్రశాంత్ కిషోర్ వైసీపీకి చెప్పి ఉంటారని అంచనా వేస్తున్నారు. అదే వాస్తవమైతే వచ్చే ఎన్నికల నాటికి ఏపీలో సరికొత్త పొత్తు పొడచూపే అవకాశముంది. అయితే సహజంగా ఇది నచ్చని బీజేపీ పెద్దలు ఈ విషయంలో ఎలా స్పందిస్తారో చూడాలి మరీ.
Also Read:AP high Court: మరోసారి జగన్ ప్రభుత్వానికి షాక్ ఇచ్చిన హైకోర్టు.. ఆన్ లైన్ టికెట్ల విషయంలో..
Recommended Videos: