KGF Chapter 2: భారీ అంచనాలతో మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీగా వస్తున్న కేజీఎఫ్-2 ఇప్పుడు దేశవ్యాప్తంగా ట్రెండింగ్ లో ఉంది. ఎక్కడ చూసినా ఈ మూవీ గురించే చర్చ సాగుతోంది. త్రిబుల్ ఆర్ సమయంలో ఎలాంటి హైప్ వచ్చిందో.. ఈ మూవీ విషయంలో అంతకుమించి హైప్ వస్తోంది. ఈ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ చూస్తే ఎవ్వరికైనా కళ్ళు బైర్లు కమ్మాల్సిందే. త్రిబుల్ ఆర్ లాంటి పెద్ద సినిమాలకు మించి బిజినెస్ చేస్తోంది అంటే ఏ రేంజ్ లో క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన కే జి ఎఫ్ ఎన్ని సంచలనాలు సృష్టించిందో చూశాం. ఆ మూవీకి సీక్వెల్ గా వస్తున్న కేజీఎఫ్టు-2 మీద ఆటోమేటిక్ గా అంచనాలు ఆకాశంలో ఉన్నాయి. ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో వస్తున్న ఈ మూవీలో రాకింగ్ స్టార్ యష్ హీరోగా, బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ విలన్ గా నటిస్తున్నారు. హీరోయిన్ శ్రీనిధి శెట్టి ఈ చాప్టర్-2 లో కీలకంగా కనిపించబోతోంది.
ఇక ప్రకాశ్ రాజ్, రావు రమేష్ లాంటి వారు కీలక పాత్రలో నటిస్తున్నారు. ఏప్రిల్ 14న రిలీజ్ కాబోతున్న ఈ మూవీకి హైప్ తీసుకు వచ్చే పనిలో భాగంగా మూవీ టీం జోరుగా ప్రమోషన్స్ చేస్తోంది. అయితే మిగతా రాష్ట్రాల్లో ఎలా ఉన్నా కూడా తెలంగాణలో మాత్రం ఈ మూవీ టికెట్ రేట్లను పెంచుకోవటానికి ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది. ఇందుకోసం ఇప్పటికే జీవోను కూడా రిలీజ్ చేసింది.
మల్టీప్లెక్స్ లు, ఐమాక్స్, ఏసీ థియేటర్లలో టికెట్లను పెంచుకునేలా వీలు కల్పించింది. మల్టీప్లెక్స్, ఐమాక్స్ ధియేటర్ లలో రూ.50 వరకు పెంచుకోవచ్చు. ఏసీ థియేటర్లలో రూ.30 వరకు పెంచుకునేలా జీవోను జారీ చేసింది కేసీఆర్ ప్రభుత్వం. నాన్ ఏసీ థియేటర్ లలో టికెట్ల రేట్లు అలాగే ఉన్నాయి. మొన్న వచ్చిన త్రిబుల్ ఆర్ సమయంలో ఎలాంటి వీలు కల్పించిందో ఇప్పుడు కేజీఎఫ్-2 విషయంలో కూడా అలాంటి జీవోను జారీ చేసింది. ఇక తెలుగులో డిస్ట్రిబ్యూట్ చేస్తున్న దిల్ రాజు లాంటి వాళ్లకు ఇది గుడ్ న్యూస్ అని చెప్పాలి. వారికి కాసుల పంట పండనుంది. మొన్న త్రిబుల్ ఆర్ నైజాం డిస్ట్రిబ్యూటర్ గా ఉన్న దిల్ రాజు.. ఇప్పుడు అదే ఏరియాలో కేజిఎఫ్-2కి డిస్ట్రిబ్యూటర్ గా ఉన్నారు. దీంతో మళ్లీ ఆయనకు లాభాల వర్షం కురువనుంది.