Homeఅంతర్జాతీయంశ్రామికుల రక్తతర్పణ సాక్షి: పారిస్ కమ్యూనార్డుల గోడ

శ్రామికుల రక్తతర్పణ సాక్షి: పారిస్ కమ్యూనార్డుల గోడ

అది 1871 మే 27. పారిస్ లోని పెర్ లాషాయిస్ ఖనన స్థలి.
ఇవాళ్టికి సరిగ్గా నూటయాబై సంవత్సరాల కింద నూట నలబై ఏడు మంది కమ్యూన్ పరిరక్షకులను ఒక గోడ ముందు నిలబెట్టి, కాల్చి చంపి, మృత దేహాలను గోడ పక్కన కందకం లోకి తోసేశారు. అప్పటికి పది వారాలుగా సాగుతున్న పారిస్ కమ్యూన్ ను, తొట్టతొలి శ్రామిక వర్గ రాజ్యాధికారాన్ని కాపాడుకునే చిట్టచివరి ప్రయత్నంలో ఈ నూట నలబై ఏడు మంది వీరులు ఒరిగిపోయారు.

వ్యవస్థను ధిక్కరించి పోరాడి ఓడిపోయిన వీరులలో వారు మొదటివారూ కారు, చివరివారూ కారు. చరిత్రకు తెలిసిన స్పార్టకస్, మెనెప్టా ల నుంచి తెలియని వేలాది, లక్షలాది మంది వీరులు వందలాది సంవత్సరాలుగా దోపిడీ పీడనలకు వ్యతిరేకంగా పోరాడుతూనే ఉన్నారు.

స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, ఆహారమూ శాంతీ, జాతి విముక్తి, స్వాతంత్ర్యం, రోటీ కపడా ఔర్ మకాన్, జల్, జంగల్, జమీన్, ఇజ్జత్, ఆత్మగౌరవం, ప్రజాహిత రాజ్యం, ప్రజానుకూల రాజ్యం, ప్రజారాజ్యం, సమసమాజం – నినాదం ఏదైనా కావచ్చు, మనిషిని మనిషి పీడించే సాంఘిక ధర్మం ఇంకానా ఇకపై చెల్లదు అనే సుదీర్ఘ కాలపు స్వప్న సాకార ప్రయత్నాలలో లక్షలాది మంది, కోట్లాది మంది కూడానేమో, పాల్గొన్నారు. ప్రత్యర్థి కరకు కత్తులకు లక్షలాది మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. అనేక మంది అపజయానికి గురయ్యారు. కొందరు ఒక చిన్న ప్రాంతంలోనో, అతి కొద్ది కాలానికో విజయం సాధించి కూడా ప్రతీప శక్తుల బలం ముందు తమ బలం చాలక ఓడిపోయారు. అనేక మంది మధ్య దారిలో అలసిపోయారు, ఆగిపోయారు. తమ ఆశయ సాధనకు మరొక మార్గమేదన్నా ఉందా అని ప్రత్యామ్నాయాలు అన్వేషించారు. ప్రత్యామ్నాయాలనిపించిన ఎండమావులలో కరిగిపోయారు. జరిగిపోయారు. ఇది ఒక సుదీర్ఘ కంటకావృత మహా జనపథం.

ఆ అనంత ఉజ్వల వీరయోధుల ధారలో ఇవాళ్టికి నూట యాబై ఏళ్ల కింద ప్రాణత్యాగం చేసిన ఆ నూట నలబై ఏడు మంది అమర కమ్యూనార్డులను ప్రత్యేకంగా తలచుకోవలసి ఉంటుంది. మానవ సమాజం వేల ఏళ్లుగా కంటున్న కల నిజం అయిన సందర్భం అది. సంపూర్ణంగా కష్టజీవులతో కూడిన విప్లవ సోషలిస్టుల బృందం 1871 మార్చ్ 28న ఇరవై లక్షల జనాభా ఉన్న పారిస్ రాజ్యాధికారాన్ని చేపట్టింది. పారిస్ కమ్యూన్ ఏర్పరిచింది. నిజమైన కార్మికవర్గ బిడ్డలు, స్త్రీలూ పురుషులూ, చెప్పులు కుట్టేవాళ్లూ, రొట్టెలు తయారు చేసేవాళ్లూ, చేతివృత్తులవాళ్లూ, చిన్న దుకాణదారులూ, గుమస్తాలూ, అచ్చుయంత్రాల మీద పనిచేసేవాళ్లూ, కళాకారులూ, పాత్రికేయులూ – ఒక్క మాటలో చెప్పాలంటే, నిజమైన శ్రామికులు, శ్రామికుల ప్రతినిధులు కార్యనిర్వాహక వర్గానికి ఎన్నికయ్యారు. పారిస్ కమ్యూన్ నిర్వాహక వర్గ సభ్యులలో ఒకరూ, మేలుకోండి పేద ప్రజలారా అనే అంతర్జాతీయ గీతం రాసిన కవి యూజిన్ పొటియర్ స్వయంగా హమాలీ.

ఇప్పటివరకూ ప్రపంచ చరిత్రలో ఎన్ని ప్రభుత్వాలు మారినా, పాలకుల రంగులూ జెండాలూ నినాదాలూ ఏమి మారినా, మౌలికంగా కొనసాగుతూ వచ్చినది దోపిడీ వర్గాల పాలనే. అందుకు భిన్నంగా పారిస్ కమ్యూన్ లో తొలిసారి దోపిడీ పాలక వర్గాల అధికారాన్ని కూలదోసి, ఇంతకాలం దోపిడీకి గురయిన వర్గాల సమష్టి అధికారం ప్రారంభమయింది. అప్పటివరకూ యుద్ధంలో మునిగి ఉన్న ప్రష్యా, ఫ్రాన్స్ పాలకవర్గాలు కమ్యూన్ ను ధ్వంసం చేయడానికి చేతులు కలిపాయి, పారిస్ ను చక్రబంధం చేశాయి. సైనిక దాడులు జరిపాయి, లోపలి నుంచి కుట్రలు జరపడానికి ప్రయత్నించాయి. ఈ దాడులను ఎదిరిస్తూ, నిండా రెండున్నర నెలలు కూడా అధికారంలో ఉండలేకపోయినప్పటికీ, పారిస్ కమ్యూన్ కార్మిక అధికారం చరిత్రలో కనీ వినీ ఎరగని విప్లవాత్మక, గుణాత్మక పాలనా విధానాలు చేపట్టింది.

అధికారంలో ఉన్న డెబ్బై రెండు రోజులలో, ఒకవైపు అనేక యూరపియన్ రాచరిక, “ప్రజాస్వామిక” పాలకుల కుట్రలనూ, కుహకాలనూ, సైనిక దాడినీ ఎదిరించి పోరాడుతూనే, శ్రామిక వర్గం రాజ్యాధికారానికి వస్తే ఎన్ని అద్భుతాలు సృష్టించగలదో పారిస్ కమ్యూన్ చూపింది. మరణ శిక్షను రద్దు చేసింది. పారిస్ నగరంలో అప్పటికి మరణ శిక్ష అమలవుతుండిన గిలటిన్ ను కూల్చివేసి తన సంకల్పాన్ని ప్రతీకాత్మకంగా కూడా ప్రకటించింది. పొరుగు రాజ్యాలతో దురహంకార, అనవసర యుద్ధాలు జరపడానికీ, యుద్ధం లేకపోయినా వేలాది, లక్షలాది మందిని కూచోబెట్టి దేశ ప్రజల సంపదను మెక్కబెట్టి వృథా చేయడానికీ కారణమైన సైన్యాన్ని రద్దు చేసింది. అప్పటికి యూరప్ లో ఉండిన యువకుల నిర్బంధ సైనిక నియామకాలను రద్దు చేసింది. ప్రజలందరూ అవసరమైనప్పుడు సైనికులుగా మారాలనే, పూర్తికాలం సైనికులుగా ఉండని ప్రజా సాయుధ దళమే అవసరమైతే దేశ రక్షణ చేస్తుందనే కొత్త పద్ధతి ప్రవేశపెట్టింది. నెపోలియన్ కాలంలో పొరుగు దేశాల మీద యుద్ధాలు చేసి ఫ్రాన్స్ స్వాధీనం చేసుకున్న ఆయుధాలు కరిగించి పారిస్ లో నిర్మించిన ప్లేస్ వెండోమ్ అనే స్మారక చిహ్నాన్ని ధ్వంసం చేసింది. ఫ్రెంచ్ జాతీయ దురహంకారాన్ని రద్దు చేయాలనీ, జాతీయ దురహంకారానికీ, ఇతర జాతుల పట్ల ద్వేషానికీ చిహ్నంగా ఉన్నందువల్లనే ప్లేస్ వెండోమ్ ను కూల్చి వేస్తున్నామనీ ప్రకటించింది. ఫ్రెంచి విప్లవపు రోజుల్లో చక్రవర్తిని నడివీధిలోకి లాగి వధించినందుకు క్షమాపణ కోరుతూ తర్వాతి కాలంలో నిర్మాణమైన ప్రాయశ్చిత్తపు ప్రార్థనాలయాన్ని ధ్వంసం చేసింది.

ఇళ్ల అద్దెలు రద్దు చేసింది. అప్పుల చెల్లింపుల మీద మూడేళ్ల మారటోరియమ్ ప్రకటించింది. తాకట్టు పద్ధతి రద్దు చేసి, అప్పటివరకూ ప్రభుత్వ ఖజానాలో ఉండిన తాకట్టు వస్తువులు వెనక్కి ఇచ్చేసింది. విదేశీయులకు కూడా సమాన హక్కులు ప్రకటించింది. కమ్యూన్ కు చెందిన ఏ అధికారికీ సగటు కార్మికుని వేతనం (అప్పటి ఫ్రాన్స్ లో అది నెలకు ఐదువందల ఫ్రాంకులు) కన్నా ఎక్కువ ఉండగూడదని నిర్ణయించింది. రాజ్యానికీ చర్చికీ సంబంధం రద్దు చేసింది. మత కార్యకలాపాలకూ, మతాధికారులకూ రాజ్యం నిధులు ఇచ్చే పద్ధతిని రద్దు చేసింది. చర్చి ఆస్తుల స్వాధీనం ప్రారంభించింది. విద్యా సంస్థల్లో, విద్యాబోధన విషయంలో చర్చి జోక్యాన్ని, మత జోక్యాన్ని రద్దు చేసింది. మూతబడిన కర్మాగారాలను తెరిచి, ఆ కర్మాగారాల కార్మికులతోనే సహకార సంఘాలు ఏర్పాటు చేసి ఆ కర్మాగారాలను నడిపించింది. ఐదు లక్షల మంది కార్మికులతో ఏర్పడిన ఈ సహకార సంఘాల సమాఖ్య కోసం ప్రయత్నాలు ప్రారంభించింది. పాత కర్మాగారాల యజమానుల అక్రమాల మీద చర్యలు ప్రారంభించింది. వారు ఇంతకాలం కార్మికులదగ్గర వసూలు చేసిన అక్రమ జరిమానాలను వెనక్కి ఇప్పించడం ప్రారంభించింది. బాలకార్మికుల శ్రమనూ, రాత్రి పూట శ్రమనూ నిషేధించింది. ఉద్యోగ నియామకాలలో పారదర్శకత, ప్రజాస్వామ్యం, వికేంద్రీకరణ కోసం కొత్త వ్యవస్థలను నిర్మించింది. ఆ డెబ్బై రెండు రోజులలో అసహజ మరణాలు లేవు, హత్యలు లేవు, దొంగతనాలు లేవు, బందిపోట్లు లేవు.

రెండు కిమీ అవతల ప్రష్యన్, ఫ్రెంచ్ సైన్యాలు పొంచి ఉండగా పారిస్ కమ్యూన్ ఇవన్నీ సాధించింది. ఎంత సృజనాత్మకంగా, ఎన్నెన్ని పనులు చేయడానికి కార్మిక వర్గానికి శక్తి ఉందో అవన్నీ చేసి చూపింది. పారిస్ కమ్యూన్ ను చక్రబంధంలో పెట్టిన ప్రష్యన్, ఫ్రెంచ్ సైన్యాలకు చిట్టచివరికి మే 21న పారిస్ లో ప్రవేశించడానికి అవకాశం దొరికింది. ఆ కమ్యూన్ వ్యతిరేక సైన్యాలను కమ్యూనార్డులు అనేక చోట్ల బారికేడ్లతో, వీథిపోరాటాలతో అడ్డుకోవడానికి ప్రయత్నించారు. అయినా వర్సెయిల్స్ సైన్యాలూ, ప్రష్యన్ సైన్యాలూ లోలోపలికి చొచ్చుకు వస్తూ, ఒక్కొక్క ప్రాంతం మీదా దాడి చేస్తూ, కార్మికవర్గ రాజ్యాధికారాన్ని కూలదోస్తూ, వందలాది, వేలాది మందిని ఊచకోత కోస్తూ మే 27 సాయంత్రం ఆరు గంటలకు కార్మికవర్గపు చిట్టచివరి స్థావరమైన పెర్ లాషాయిస్ సిమెటరీ దగ్గరికి చేరాయి. ఫిరంగులతో సిమెటరీ సింహద్వారాన్ని బద్దలు కొట్టి లోపల ప్రవేశించాయి. ఆ సైనికుల సంఖ్యా బలం, ఆయుధ బలం ముందు సమాధులను, గోడలను రక్షణగా తీసుకుని పోరాడిన కమ్యూనార్డుల బలం సరిపోలేదు. అక్కడ మిగిలిన 147 మంది కార్మికవర్గ యోధులనూ బంధించిన ప్రభుత్వ సైన్యాలు ఆ ఖననస్థలి వెనుక భాగాన గోడ దగ్గరికి వారిని తీసుకువెళ్లి అక్కడ గోడకు నిలబెట్టి వారి మీద నేరుగా కాల్పులు జరిపారు. మృత దేహాలను గోడ పక్కన కందకం లోకి తోసేశారు.

ఆ మర్నాటికల్లా పాలకవర్గ సైన్యాలదే విజయమయింది. పారిస్ కమ్యూన్ ను, కార్మిక వర్గ రాజ్యాధికార పసిపాపను గొంతు నులిమి చంపివేశారు. సమకాలీన యూరప్ చరిత్ర కారులందరూ “రక్తసిక్త వారం”గా అభివర్ణించిన ఆ వారం రోజులలో ఇరవై వేల మంది కమ్యూనార్డులు హత్యకు గురయ్యారు. నలబై ఐదు వేల మంది కమ్యూనార్డులను బందీలుగా పట్టుకుని తూతూ మంత్రపు విచారణలు జరిపి మరణశిక్షలూ, ద్వీపాంతరవాస శిక్షలూ, జైలు శిక్షలూ విధించారు. వేలాది మంది కమ్యూనార్డులు శరణార్థులుగా ఇతర యూరపియన్ దేశాలకు తరలివెళ్లారు.

వర్సెయిల్స్ ప్రభుత్వ నేత అడాల్ఫ్ థియెర్స్ పారిస్ కమ్యూన్ మీద తమ విజయాన్ని ప్రకటిస్తూ గర్వంగా “సోషలిజాన్ని అంతం చేశాం” అన్నాడు. పాలకవర్గ అధినేతలు వందలాది సార్లు చేసిన ప్రకటన అది. అదే ప్రకటన పదే పదే వందలాదిసార్లు చేశారంటేనే వాళ్లు ఆశించిన, అన్నపని జరగలేదనీ, జరగడం అసాధ్యమనీ అర్థం.
———————————————

ఆ కమ్యూనార్డుల గోడ గురించి మొదటిసారి కొండపల్లి సీతారామయ్య గారి వ్యాసంలో, అంతకు మూడు సంవత్సరాల ముందే ఆంధ్రభూమిలో అచ్చయిన ఆ వ్యాసాన్ని 1975 మార్చ్ సంచిక సృజనలో పునర్ముద్రించినప్పుడు చదివాను. అప్పటి నుంచి 2017 మే లో విరసం నిర్వహించిన పాఠశాలలో పారిస్ కమ్యూన్ మీద మూడు నాలుగు గంటల పాఠం చెప్పడానికి మళ్లీ ఒకసారి చదివేవరకూ ఎందరెందరి రచనల్లోనో ఎన్నోసార్లు ఆ కమ్యూనార్డుల గోడ గురించి ప్రస్తావనలు చదివాను. ఆ పాఠంలోనూ దాని గురించి చెప్పాను.

తాను జర్మనీలో ఉండగా రావాలని మిత్రుడు రంజిత్ కోరిన కోరిక, మార్క్స్ 200 పుట్టినరోజున ఆయన పుట్టిన ఊళ్లో కార్యక్రమాల్లో పాల్గొనాలనే నా కోరికా కలిసి 2018 మే లో జర్మనీ వెళ్లే అవకాశం వచ్చింది. యూరప్ లో యుకె కు తప్ప మిగిలిన అన్ని దేశాలకూ ఒకే వీసా అని తెలిసినప్పుడు, మరి ఒకటి రెండు దేశాలైనా చూడాలని, ముఖ్యంగా ఫ్రాన్స్ కు, పారిస్ కు వెళ్లాలనే కోరిక బలపడింది. పారిస్ లో చూడవలసినవెన్నో ఉన్నాయి. ఉండగలిగిన రెండు మూడు రోజులలో చూసే నాలుగైదు స్థలాలు ఎంచుకోవలసి వచ్చినప్పుడు, సహజంగానే కమ్యూనార్డుల గోడ ప్రాధాన్యతా క్రమంలో మొదటి స్థానంలో ఉండింది. రెండో రోజుకే విభాతకు అక్కడి తిండీ అలసటా పడక, ఆరోగ్యం చెడిపోయి, మా ప్రయాణం అర్ధాంతరంగా మారిపోయినప్పుడు, మిగిలిన నాలుగైదు గంటల్లో హడావిడిగా కమ్యూనార్డుల గోడ వెతుకుతూ పరుగెత్తాను.
2018 మే 13 మధ్యాహ్నం తిరుగు ప్రయాణం అనగా, ఉదయం మొదట విక్టర్ హ్యూగో ఇల్లు చూసి, అక్కడి నుంచి పారిస్ సిటీ మ్యాపుల సహాయంతో, పెర్ లాషాయిస్ సిమెటరీ అయితే చేరగలిగాను గాని, ఇంగ్లిష్ లో ఎవరిని అడిగినా జవాబు లేదు. కమ్యూనార్డుల గోడను ఫ్రెంచ్ లో మ్యూ దే ఫెదెరే (Mur des Federes) అనాలని తెలియదు.

ఆ వంద ఎకరాలకు పైబడిన మహా ఖనన స్థలి లో ఎవరి సమాధి ఎక్కడ ఉందో చెప్పే మ్యాపులు లేవు. నిజానికి ఆ సిమెటరీ ఏటా 35 లక్షల మంది సందర్శించే ప్రఖ్యాత యాత్రా స్థలం. పద్దెనిమిదో శతాబ్ది నుంచీ ఉన్న ఈ ఖనన స్థలి, 1804 లో కవి లా ఫోంటేన్, నాటక కర్త మోలియర్ వంటి వాళ్ల అవశేషాలను అక్కడికి మార్చిన తర్వాత చాలా ప్రసిద్ధి పొందిందట. ఈ రెండు వందల ఏళ్లలో అక్కడ కనీసం పది లక్షల మంది ఖననం అయ్యారట. బాల్జాక్, ఆస్కార్ వైల్డ్, మార్సెల్ ప్రౌస్ట్, పాల్ ఎల్వార్, హెన్రీ బార్బూస్, మిగ్వెల్ అస్టూరియా వంటి రచయితలు, హోమియో వైద్య విధాన స్థాపకుడు శామ్యూల్ హానిమన్, అర్థశాస్త్రవేత్త జె బి సే, తత్వవేత్త లయటార్డ్ వంటి ఎందరినో అక్కడే ఖననం చేశారట. బహుశా రోజుల పాటు తిరగవలసిన చారిత్రక స్థలం అది. అక్కడ ఫ్రెంచ్ లో ఎన్నో బోర్డులున్నాయి, ప్రతి సమాధి మీద ఫ్రెంచ్ లో వివరాలున్నాయి గాని, ఇంగ్లిష్ లో అక్షరం ముక్క లేదు. నేను ఉదయం పదింటికి అక్కడికి చేరేసరికే పుష్పగుచ్చాలు పట్టుకుని తమ బంధు మిత్రుల సమాధుల దగ్గర శ్రద్ధాంజలి ఘటించడానికి ఓ వంద మంది దాకా ఉన్నారు. వారందరూ వారికి కావలసిన చోటికి వెళ్తున్నారు. నాకు చిరునామా చెప్పడానికి, కనీసం దిక్కు సూచించడానికి ఎవరూ లేరు.

అలా ఎంతో మందిని అడిగి ఆఖరికి ఒకరిద్దరు చెప్పిన సూచనల ప్రకారం కమ్యూనార్డుల గోడ దగ్గరికి చేరాను. నిజంగానే అది ఆ ఖనన స్థలం ఆవరణలో చిట్టచివరి మూల. అక్కడ అటు ఫర్లాంగు ఇటు ఫర్లాంగు కనుచూపు మేరలో మరెవరూ లేరు. అప్పటికే ఎవరైనా వచ్చి వెళ్లారో, అంతకు ముందు రోజువో గాని తాజా పుష్ప గుచ్ఛాలు నాలుగైదు ఉన్నాయి. మౌనంగా కన్నీరు కార్చి, శ్రద్ధాంజలి ఘటించాను. మీ త్యాగం వృథా కాదు, ఆలస్యం కావచ్చు కాని మానవజాతి ఎప్పటికైనా తన సమసమాజ స్వప్నాన్ని సాకారం చేసుకున్నప్పుడు, ఈ సుదీర్ఘ మహా జనపథం దారి పొడుగునా జరిగిన త్యాగాలనూ, రక్త తర్పణలనూ గుర్తుంచుకుంటుంది, సగౌరవంగా స్మరించుకుంటుంది. సవినయంగా శ్రద్ధాంజలి ఘటిస్తుంది. ఈ స్వప్నం చెదిరిపోకుండా కాపాడుతుంది అని నాకు నేనే ఆశ్వాసం చెప్పుకున్నాను. ఆ వీరుల స్ఫూర్తికి వాగ్దానం చేశాను.

శ్రీశ్రీ అన్నట్టు,
‘ఇదుగో జాబిల్లీ, నువ్వు
సముద్రం మీద సంతకం చేసేటప్పుడు
గాలి దాన్ని చెరిపెయ్యకుండా
కాలమే కాపలా కాస్తుందిలే’
అని నాకు నేనూ చెప్పుకున్నాను, ఆ అమరవీర స్మృతికీ చెప్పాను.

-ఎన్. వేణుగోపాల్

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.
RELATED ARTICLES

Most Popular