Telangana Elections 2023: మీడియా మీడియా లాగా ఉండాలి. అంటే ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధి లాగా తన బాధ్యతను నిర్వర్తించాలి. అప్పుడే జనాలకు మీడియా అంటే గౌరవం ఉంటుంది. మీడియా ఏం చెప్పినా వినాలి అనిపిస్తుంది. మరేం రాసినా చదవాలి అనిపిస్తుంది. కానీ ఈ సన్నని గీతను మీడియా యాజమాన్యాలు తమ సొంతానికి వాడుకుంటేనే అసలు ఇబ్బంది మొదలవుతుంది. ఆ తర్వాత మీడియా నిస్పాక్షికత మీదనే అనుమానం మొదలవుతుంది.. ఇక ప్రస్తుతం తెలంగాణలో ఒక వర్గం మీడియా చేస్తున్న వక్రీకరణలు కూడా అదే విధంగా ఉన్నాయి.
ఎగ్జిట్ పోల్స్ వచ్చిన తర్వాత
నిన్న తెలంగాణ రాష్ట్రంలో పోలింగ్ ముగిసింది. హైదరాబాద్ మినహా మిగతా ప్రాంతాలన్నింటిలో మెరుగైన పోలింగ్ నమోదయింది. సాధారణంగా పోలింగ్ ముగిసిన తర్వాత ఎగ్జిట్ పోల్స్ విడుదలవుతుంటాయి. అయితే నిన్న చాలావరకు సంస్థలు తాము విడుదల చేసిన ఎగ్జిట్ పోల్స్ లో భారత రాష్ట్ర సమితి కాకుండా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పేశాయి. సరే దీనిని భారత రాష్ట్ర సమితి కొట్టి పారేసినప్పటికీ మెజారిటీ రాజకీయ విశ్లేషకులు మాత్రం ప్రజల గాలి కాంగ్రెస్ వైపు ఉందని చెబుతున్నారు. దీనికి వారు రకరకాల కారణాలు విశ్లేషిస్తున్నారు. ఇక్కడ ఒక వర్గం మీడియా మాత్రం డిఫరెంట్ ప్రచారం చేస్తోంది. తెలంగాణ ఇచ్చిన తర్వాత కూడా పదేళ్లపాటు అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ.. కెసిఆర్ తీసిన చావు దెబ్బల నుంచి కోలుకొని అధికారం వైపు అడుగులు వేస్తోంది. తరుణంలో అంతటి ఆశావాహ దృక్పథాన్ని క్యాడర్లో ప్రోది చేసిన రేవంత్ రెడ్డికి ఆ క్రెడిట్ దక్కకుండా చేస్తోంది.
ఆ చానల్స్ లో..
సాధారణంగా ఆ మూడు చానల్స్ పచ్చ భజన చేస్తాయి అంటారు. అవి చంద్రబాబు క్యాంపుకు అనుగుణంగా వార్తలు వండి వారుస్తాయి అంటారు. అయితే ఈసారి ఎన్నికల్లో టిడిపి పోటీ చేయలేదు. అయితే కాస్తో కూస్తో ఉన్న క్యాడర్ కు ఎటువంటి దిశా నిర్దేశం లేకపోవడంతో ఎవరికివారు తమ రాజకీయ అవసరాలకు అనుగుణంగా పనిచేసుకుంటూ వెళ్లారు. అయితే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి సానుకూల పవనాలు వీస్తున్న నేపథ్యంలో ఆ ఘనత మొత్తం టిడిపికే దక్కుతుందని, చంద్రబాబు పాచికలు వేయడం వల్లే ఇదంతా జరిగిందని పచ్చ మీడియా చెబుతోంది. నిన్న సాయంత్రం నుంచి ఆ పచ్చభజన చేస్తూనే ఉంది. అసలే గెలుపుకు అడుగు దూరంలో ఉన్న కాంగ్రెస్ క్యాడర్.. ఈ పచ్చ మీడియా అతి చూసి ముక్కున వేలేసుకుంటున్నారు. గెలుపు ఉత్సాహాన్ని ఆస్వాదించకుండా చేస్తున్నదని మండిపడుతున్నారు.