Women Reservation Bill 2023: ఆ 58 అసెంబ్లీ, 8 లోక్ సభ స్థానాలు ఇక మహిళలకే

2029 సార్వత్రిక ఎన్నికల నాటికి మహిళా బిల్లు అమలులోకి వచ్చే అవకాశం ఉంది. దీంతో రాష్ట్రంలో ఏయే నియోజకవర్గాల్లో మహిళా ఓటర్లు అధికంగా ఉన్నారని నేతలు ఆరా తీయడం ప్రారంభించారు.

Written By: Dharma, Updated On : September 20, 2023 1:09 pm

Women Reservation Bill 2023

Follow us on

Women Reservation Bill 2023: మహిళలకు శుభవార్త. నేరుగా చట్టసభల్లో అడుగుపెట్టే అరుదైన చాన్స్ వారు దక్కించుకోనున్నారు. ఈ అవకాశాన్ని కల్పించి ప్రధాని మోదీ చరిత్రకెక్కనున్నారు. చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్ కల్పిస్తూ లోక్సభలో కేంద్ర ప్రభుత్వం మంగళవారం బిల్లును ప్రవేశపెట్టింది. వెంటనే ఈ బిల్లు ఆమోదం పొందే అవకాశం ఉంది. రెండు రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తికానున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పుడు రాజకీయ పార్టీలకు కొత్తగా వచ్చే టెన్షన్ ఏమీ లేదు. రానున్న అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో అమలయ్యే అవకాశాలు లేవు. 2028 తర్వాత జరిగే ఎన్నికలకు మాత్రమే వర్తించేలా బిల్లులో కొన్ని షరతులు పెట్టారు. అంతేకాదు కేవలం ప్రజలు నేరుగా ఎన్నుకునే లోక్ సభ, అసెంబ్లీలకు మాత్రమే మహిళా రిజర్వేషన్ వర్తిస్తుంది. కాగా అప్పుడే ఏపీలో మహిళా రిజర్వేషన్ బిల్లు కాక పుట్టిస్తోంది. మహిళా బిల్లు అమల్లోకి వస్తే రాష్ట్ర ముఖచిత్రమే మారనుంది. రాష్ట్రవ్యాప్తంగా 8 లోక్సభ స్థానాలు, 58 అసెంబ్లీ నియోజకవర్గాలు మహిళల కే దక్కనున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి.

2029 సార్వత్రిక ఎన్నికల నాటికి మహిళా బిల్లు అమలులోకి వచ్చే అవకాశం ఉంది. దీంతో రాష్ట్రంలో ఏయే నియోజకవర్గాల్లో మహిళా ఓటర్లు అధికంగా ఉన్నారని నేతలు ఆరా తీయడం ప్రారంభించారు. తొలుత 2024 సార్వత్రిక ఎన్నికల నాటికి ఈ బిల్లు అమల్లోకి వస్తుందని ప్రచారం జరిగింది. దీంతో తమ ఆధిపత్యానికి గండి పడనుందని ఎక్కువమంది ఆందోళన చెందారు. తరువాత ఇప్పుడు కాదని తెలియడంతో ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఏయే నియోజకవర్గాల్లో మహిళా ఓటర్ల సంఖ్య ఉందో అని తెలుసుకోవడానికి ప్రజా ప్రతినిధులు, నాయకులు ఆరా తీయడం కనిపించింది. భవిష్యత్తులో ఏయే నియోజకవర్గాలు మహిళలకు కేటాయిస్తారో నన్న చర్చ సర్వత్రా జరుగుతోంది.

రాష్ట్రంలో 25 లోక్ సభ నియోజకవర్గాలు ఉన్నాయి. వాటి సంఖ్య పెరగకుండా ఉంటే… మహిళలకు 33 శాతం రిజర్వేషన్ అమలయితే 8 స్థానాలు మహిళలకు కేటాయించాల్సి ఉంటుంది. ఒకవేళ భవిష్యత్తులో పునర్విభజన జరిగి నియోజకవర్గాల సంఖ్య పెరిగితే.. మహిళలకు దక్కే స్థానాలు పెరగవచ్చు. ప్రస్తుత మహిళా ఓటర్ల గణాంకాలు ప్రకారం విశాఖపట్నం, గుంటూరు, నరసరావుపేట, నెల్లూరు, తిరుపతి, అనంతపురం, నంద్యాల, విజయవాడ నియోజకవర్గాలు మహిళలకు రిజర్వ్ అయ్యే అవకాశం ఉంది. అయితే ఇవన్నీ నగర నియోజకవర్గాలే కావడం గమనార్హం. శాసనసభ నియోజకవర్గాలకు సంబంధించి.. దాదాపు 58 స్థానాలు మహిళలకు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇవి కూడా ఎక్కువగా నగరాలు, జిల్లా కేంద్రాలతో మిళితమైన నియోజకవర్గాలే కావడం గమనార్హం