Hyderabad metro train: మానవుడు రోజు రోజుకు అభివృద్ధి చెందుతున్నాడు. ఎన్నో కొత్త ఆవిష్కరణలు చేస్తున్నాడు. భూమిపై నుంచే అంతరిక్షంలో ఏం జరుగుతుందో తెలుసుకునే టెక్నాలజీని సంపాదించుకున్నాడు. ఉన్న చోట నుంచే వేల మైల్ల దూరంలో ఉన్న మనిషితో క్షణాల్లో సంభాషణలు జరుపుతున్నాడు. భూమి మీద, నీటిలో, గాలిలో ప్రయాణించే వాహనాలను సమకూర్చుకున్నాడు. రోజు రోజుకు అభివృద్ధికి దిశలో పయనిస్తున్న మనిషి.. మానవత్వం ప్రదర్శించడంలో మాత్రం తిరోగమి దిశలో పడిపోతున్నాడు. తోటి వారికి సాయం చేయడంలో ఉన్న ఆనందాన్ని మర్చిపోతున్నాడు.

ఇది అభివృద్ధా ?
మానవుడు ఎక్కడికి వెళ్తున్నాడు ? సాంకేతికతను అందిపుచ్చుకొని సమాజానికి అవసరమయిన అన్ని వస్తువులను తయారు చేసుకోగలుగుతున్నాడు. ఇది అభివృద్ధే.. కానీ ఇదే అభివృద్ధి కాదు. కాలంతో పాటు పరిగెడుతూ, ఈ యాంత్రిక జీవితంలో డబ్బు సంపాదనలో పడి తోటి మానవులపై, జీవులపై జాలి, దయ, కరుణ చూపించడం మర్చిపోతున్నాడు. ఇది చాలా సందర్భాల్లో బయటపడుతోంది.
మానవ సేవలోనే మాదవ సేవ లేదా ?
మనిషి పుణ్యం కోసం దేవాలయాలు, పుణ్యక్షేత్రాలు తిరుగుతున్నాడు. ఆధ్యాత్మిక ఉత్సవాలు, యజ్ఞ యాగాలు ఘనంగా నిర్వహిస్తున్నాడు. కానీ మానవ సేవే మాదవ సేవ నిజమైన తాత్విక భావాన్ని గ్రహించలేకపోతున్నాడు. తోటి మనిషికి సాయం చేస్తే అది భగవంతుడికి సేవ చేసినట్టే అవుతుందని అర్థం చేసుకోలేకపోతున్నాడు. మనం చేసే మంచి ప్రకృతి మనకు తిరిగి ఏదో ఒక విధంగా ఇచ్చేస్తుందనే సత్యాన్ని తెలుసుకోలేకపోతున్నాడు. ఈ సమాజంలో కనిపించే ప్రతీ జీవిపై దయతో, మానవత్వంతో ఉండాలని అన్ని మాతాలు బోధించే ప్రాథమిక భావనను జీర్ణం చేసుకోలేకపోతున్నాడు.
సాయం చేసే గుణాన్ని నేర్పని చదువులెందుకు ?
చదువు కేవలం ఉద్యోగం, వ్యాపారం కోసమే కాదు. చదువు ద్వారా మనిషి జ్ఞానం పొందాలి. సంస్కారం నేర్పాలి. సమాజంలో మనుషులు పట్ల ఇతర జీవుల పట్ల ఎలా మెలగాలో నేర్పాలి. కానీ ఇప్పటి చదువులన్నీ కమర్షియల్ అవుతున్నాయి. ఇంజనీరింగ్ చదివితే ఇంత సంపాదించవచ్చు. మెడిసిన్ చదివితే ఇంత వెనకేసుకోవచ్చ అంటూ లెక్కలేసుకుంటున్నారు. కానీ అదే సమయంలో మానవ సహజ లక్షణమైన మానవత్వాన్ని మర్చిపోతున్నారు. ఇటీవల హైదరాబాద్ మెట్రోలో జరిగిన ఘటన చదువుకున్న నాగరికుల్లో మానవత్వం కనుమరుగైపోయిందని నిరూపిస్తోంది.
అందరూ చదువుకున్న వారే.. కానీ ఒక్కరూ సీటివ్వలే..
హైదరాబాద్ మెట్రోలో జరిగిన ఘటన ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది. ఓ మహిళ చంటి బిడ్డను ఎత్తుకొని మెట్రో ఎక్కింది. ఎక్కడా సీటు ఖాళీగా లేకపోవడం ఆ పసిపాపను తీసుకొని కిందనే కూర్చొని ప్రయాణించింది పాపం. ఆ కాంపాట్‌మెంట్ కేవలం మహిళలకు కేటాయించినదే. ఆ చుట్టు పక్కల ఉన్నది మొత్తం దాదాపు చదువుకున్న మహిళలే. కానీ ఏ ఒక్కరూ ఆ తల్లి ఇబ్బందిని గమనించలేదు. ఓ ఒక్కరూ నిలబడి ఆ మహిళకు సీటు ఇవ్వలేదు. తాము మహిళలమే అని మరిచారో ఏమో గానీ ఏ ఒక్కరూ ఆ తల్లీ బిడ్డలపై కరుణ చూపలేదు. మానవత్వం కనుమరుగైపోతుందనడానికి ఈ కన్నీళ్లు తెప్పించే ఘటన సాక్ష్యంగా నిలుస్తోంది. ఇదందా అక్కడే ఉన్న ఒకరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో అది వైరల్‌గా మారింది. వాట్సప్ స్టేటస్సులో, ఫేస్ బుక్ గ్రూపుల్లో ఈ వీడియో చక్కర్లు కొడుతోంది. దీనిపై చాలా మంది స్పందిస్తున్నారు. తమకు కూడా ఇలాగే జరిగిందని, వారికి జరిగిన అనుభవాలను పంచుకుంటున్నారు. జ్వరంతో, నీరసంతో నిలబడి ఉన్నా సీటు ఇవ్వలేదని చెబుతున్నారు. నిలబడి ఉన్న వ్యక్తి వయస్సు, వారు వేసుకున్న దుస్తులు కూడా సీటు ఇవ్వాలా ? వద్దా అనే విషయాన్ని డిసైడ్ చేస్తున్నాయని కొందరు తెలియజేస్తున్నారు. ఏది ఏమైనా ఈ యాంత్రీకరణ జీవితంలో పట్టణవాసులు యంత్రాల్లాగే ఎలాంటి ఎమోషన్లు లేకుండా జీవించేస్తున్నారని ఈ ఘటన రుజువు చేస్తోంది.