సూర్యపేట జిల్లా రాజు నాయక్ తండాకు చెందిన శంకర్ నాయక్ జూన 13న హత్యకు గురయ్యాడు. ఆ ఊరికే చెందిన బాధితురాలు ఈ కేసులో నిందితురాలిగా అరెస్టయ్యారు. శంకర్ నాయక్ బంధువులతో ఆమెకు పాత కక్ష్యలున్నాయి. బాధితురాలు ఇటీవల బెయిల్ పై విడుదలై సూర్యపేటలోని తన సోదరి ఇంట్లో తలదాచుకుంటున్నారు. రాజ్ నాయక్ తండాకు చెందిన బంధువొకరు శనివారం మృతిచెందడంతో ఆ మహిళ అక్కడికి వెళ్లింది.
అయితే ఆమెను చూసిన శంకర్ నాయక్ బంధువులు కోపోద్రిక్తులై ఆమెపై దాడికి తెగబడ్డారు. ఆమెను వివస్ర్తను చేసి ఇంట్లో నుంచి బయటకు తీసుకొచ్చి కళ్లల్లో కారం కొట్టి నగ్నంగా వీధుల్లో తిప్పుతూ కర్రలతో బాదారు. దాదాపు గంటపాటు ఇలా చేయడంతో ఆమె తట్టుకోలేకపోయింది. దీన్ని ఎవరూ ఆపలేదు. ఈ నేపథ్యంలో వారి నుంచి తప్పించుకున్న ఆమె స్థానిక ఎంపీటీసీ శాంతాబాయి ఇంటికి పరుగు తీసింది. ఆమెను శాంతాబాయి వేరే దుస్తులు ఇచ్చి రక్షణ కల్పించి పోలీసులకు సమాచారం అందించారు.
దీంతో పోలీసులు గ్రామానికి చేరుకుని బాధితురాలికి రక్షణ కల్పించారు. ఉద్రిక్త పరిస్థితుల మధ్య బాధితురాలిని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. లునావత్ భారతి, బానోతు జ్యోతి, లునావత్ పద్మ, జ్యోతి, సునీత, పింప్లి, రాజేష్, సుప్రియ, కిషన్, మరో బాలిక తనప దాడికి పాల్పడ్డారని ఫిర్యాదు చేసింది. సర్పంచ్, గ్రామస్తులు చూస్తున్నా ఎవరు కూడా అడ్డుకోలేదని చెప్పింది. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సూర్యపేట గ్రామీణ ఎస్సై లవకుమార్ తెలిపారు.