
తిరుపతి సిట్టింగ్ ఎంపీ మరణంతో ఇప్పుడు ఆ పార్లమెంట్ నియోజకవర్గ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యం. అయితే.. ఎలాగూ సిట్టింగ్ స్థానమే కావునా అక్కడ వైసీపీ విజయం ఖాయమనే కనిపిస్తోంది. కొంత మెజార్టీ తగ్గుతుందేమో కానీ.. ఫ్యాన్ గాలి వీయడం మాత్రం గ్యారంటీగానే ఉంది. అంతే తప్ప ఆ సీటును తన్నుకుపోయేంత సీన్ అయితే ఏ పార్టీకీ కనిపించడం లేదు. అయితే.. తిరుపతిలో గెలిచినా కూడా జగన్‌కు కొత్త తలనొప్పులు రాబోతున్నాయా..? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి.
Also Read: సాగర్లో బీజేపీ వ్యూహం అదేనా?
తిరుపతిలో బీజేపీ దూకుడు అంతా కూడా సెకండ్ ప్లేస్ కోసమేనని రాజకీయ నిపుణులు చెబుతున్న మాట. గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కేవలం 16 వేల ఓట్లను తెచ్చుకుని నోటా కంటే 9 వేల ఓట్ల తేడాతో వెనకబడిన బీజేపీకి ఇప్పటికిప్పుడు గెలుపు అంటే కష్టమే. బీజేపీ లక్ష్యం ఏపీలో ఒక్కటే. అది తెలుగుదేశం పార్టీని మూడో స్థానానికి నెట్టేసి తానే అసలైన ప్రధాన ప్రతిపక్షం అని నిరూపించుకోవడమే. అందుకోసమే ఈ దూకుడు వ్యవహారం అంతా. మరోవైపు.. తిరుపతిలో టీడీపీకి బీజేపీకంటే ఎక్కువ బలం ఉంది. గత ఎన్నికల్లో దాదాపుగా అయిదు లక్షల ఓట్లు ఆ పార్టీకి వచ్చాయి. అయితే ఏడాదిన్నరగా టీడీపీ డల్‌గా ఉంది. పార్టీ తరఫున కూడా పెద్దగా కార్యక్రమాలు ఏవీ లేవు. పది నెలలుగా చంద్రబాబే హైదరాబాద్ ను వీడి రాలేదు. ఇక పార్టీ నాయకులు అయితే ఏ మాత్రం చురుగ్గా లేరు. దాంతో ఉప ఎన్నికల హడావుడి టీడీపీలో పెద్దగా కనిపించకపోవడమే బీజేపీకి కొత్త హుషార్ తెచ్చినట్లయింది.
ఇక ఈ ఎన్నికల్లో బీజేపీ ప్లాన్ ఏ, ప్లాన్ బీ కూడా అమలు చేయబోతోందట. ప్లాన్ ఏతో టీడీపీ తోసి ముందుకు దూసుకుపోవడం టార్గెట్. ఆ విధంగా ఆ పార్టీని ఏపీలో సోదిలో లేకుండా చేస్తామని భయం పుట్టించడం, తద్వారా టీడీపీ క్యాడర్ ని తమ వైపుగా ఆకట్టుకోవడం. అయితే బీజేపీ అనుకుంటున్నట్లుగా రెండో ప్లేస్ లోకి వచ్చినపుడే ఇవన్నీ సాధ్యపడతాయి. కానీ.. బీజేపీ ఎంత ఎగిరినా పదహారు వేలకు మరో పదహారు వేలు మాత్రమే ఓట్లు రాబట్టి చతికిలపడితే, మూడో స్థానానికే పరిమితం కావాల్సిందే. దాంతో ప్లాన్ బీ గా కమలనాథులు ముందుకు తెస్తారట.
Also Read: కేసీఆర్ “లేట్” ప్లాన్: బీజేపీ కార్పోరేటర్లే టార్గెట్
అనుకున్నట్లుగా తిరుపతి ఉప ఎన్నికలో బీజేపీ సత్తా చాటలేకపోతే ఏపీలో రెండు ప్రధాన పార్టీలైన టీడీపీ వైసీపీలతో బీజేపీ పొత్తుకు రెడీ అవుతుందని సమాచారం. అప్పుడు కూడా పై చేయి తనదే ఉండేలా చూసుకుంటూ బేరాలకు దిగుతుందట. ప్లాన్ బీకి బాబు రెడీ అయినా కూడా మునుపటి మాదిరిగా జూనియర్ పార్టనర్ గా ఉండేందుకు మాత్రం బీజేపీ ఒప్పుకోదనేది మరో టాక్. ఇక వైసీపీతో రెడీ అయితే జగన్‌కు కొత్త తలనొప్పులు మొదలవుతాయని అంటున్నారు. బీజేపీ సెకండ్ ప్లేస్‌లో ఉంటే కాషాయ రెపరెపలతో రానున్న మూడేళ్ల కాలమంతా ఏపీని డైరెక్ట్ గా ఊపేస్తుంది. మూడవ స్థానంలో ఉంటే పొత్తుల పేరిట ఒత్తిడి తెచ్చి రాజకీయ బ్లాక్ మెయిల్ కి దిగే చాన్స్ ఉంది. మరోవైపు టీడీపీ బీజేపీ జనసేన కలిసినా అది జగన్ కి ఇబ్బందే. మొత్తంగా ఈ ఉప ఎన్నికలో వైసీపీ గెలిచినా ఇరకాటం తప్పదేమోనని తెలుస్తోంది.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్