ప్రపంచ ఆర్దికాన్ని కుప్పకూల్చిన మహమ్మారిని ఐక్యంగా తరిమేద్దాం

కరోనా వైరస్ ప్రపంచాన్ని దిగ్భంధం చేసింది. ప్రపంచీకరణ నేపథ్యంలో ఈ దిగ్బంధనం మొత్తం ఆర్ధిక వ్యవస్థను అతలాకుతలం చేసింది. నిన్ననే విడుదలైన జనవరి పారిశ్రామిక ఉత్పత్తి గణాంకాలు ప్రోత్సాహకారంగానే వున్నా కరోనా వైరస్ ప్రభావం వాటిపై లేదు. ఫిబ్రవరి నుంచి ఇంకా చెప్పాలంటే ఈ నెల లెక్కలు పూర్తిగా గతి తప్పుతాయి. మార్చి లెక్కలు ప్రపంచాన్ని ఆర్ధిక మాంద్యంలోకి నెట్టుతాయనే దాంట్లో ఎటువంటి సందేహం లేదు. యూరప్ ఇప్పటికే మాంద్యంలోకి కూరుకుపోయిందని అనిపిస్తుంది. మిగతా ప్రపంచం ముఖ్యంగా […]

Written By: Ram, Updated On : March 14, 2020 10:27 am
Follow us on

కరోనా వైరస్ ప్రపంచాన్ని దిగ్భంధం చేసింది. ప్రపంచీకరణ నేపథ్యంలో ఈ దిగ్బంధనం మొత్తం ఆర్ధిక వ్యవస్థను అతలాకుతలం చేసింది. నిన్ననే విడుదలైన జనవరి పారిశ్రామిక ఉత్పత్తి గణాంకాలు ప్రోత్సాహకారంగానే వున్నా కరోనా వైరస్ ప్రభావం వాటిపై లేదు. ఫిబ్రవరి నుంచి ఇంకా చెప్పాలంటే ఈ నెల లెక్కలు పూర్తిగా గతి తప్పుతాయి. మార్చి లెక్కలు ప్రపంచాన్ని ఆర్ధిక మాంద్యంలోకి నెట్టుతాయనే దాంట్లో ఎటువంటి సందేహం లేదు. యూరప్ ఇప్పటికే మాంద్యంలోకి కూరుకుపోయిందని అనిపిస్తుంది. మిగతా ప్రపంచం ముఖ్యంగా అమెరికా కూడా ఆ దిశగా అడుగులేయొచ్చు. ఈ వార్తలు సాక్ష్యాలతో ప్రసారం కావటానికి ఇంకొన్ని రోజులు పట్టొచ్చు. ఇదేదో కావాలని భయం సృష్టించటానికి చెబుతున్న మాటలు కావు లాజికల్ గా ఆలోచిస్తే వస్తున్న కంక్లూజన్స్ . అవేమిటో ఒక్కసారి పరిశీలిద్దాం.

ప్రపంచం మొత్తం మీద జీడీపీ లో అధిక వాటా సేవా రంగం, ఉత్పత్తి రంగం. వ్యవసాయ రంగం వాటా బహు తక్కువ. ఈ రోజు ప్రపంచ దిగ్బంధనం తో సేవా రంగం అత్యధికంగా నష్టపోయింది. హాస్పిటాలిటీ రంగం, టూరిజం, వ్యాపారం, వినోదం, క్రీడలు, విమానయానం, ఒకటేమిటి అన్నిరంగాలు మూతబడి పరిస్థితి వచ్చింది. ఈ రంగాల్లోనే ఎక్కువమంది పనిచేస్తున్నారు. వీటిల్లో చాలా భౌతికంగా హాజరయితేనే జరిగేవి. ఇందులో కొన్ని విపరీతమైన పెట్టుబడులు కలిగివున్న రంగాలు. కొద్దిరోజులు పని ఆగిపోతేనే నష్టాల్లోకి వెళ్లే పరిస్థితి. అటువంటిది నెల రోజులు మూతబడితే వాటి ఆర్ధిక పరిస్థితి వూహించనలవి కాదు. ఈ రంగాలన్నీ తీవ్ర నష్టాల్లోకి వెళ్తాయి. అందులో పనిచేసే ఉద్యోగుల కొనుగోలు శక్తి పడిపోతుంది. పర్యవసానం ప్రపంచం మొత్తం వస్తువులకు గిరాకీ ఉండదు. ఇది ఒకనెల అయితే తిరిగి కోలుకోవచ్చు. అదే కొన్ని నెలలు ఏకంగా ఇదే పరిస్థితులు ఉంటే జరిగే పరిణామాలను వూహించలేకపోతున్నాము.

ఇక ఉత్పత్తి రంగం చూస్తే ప్రపంచంలో మొదటి స్థానాల్లో వున్న చైనా, అమెరికా, జపాన్, జర్మనీలు ఇప్పటికే ఒత్తిడిలో వున్నాయి. ప్రధమ స్థానంలో వున్న చైనా దాదాపు రెండు నెలలనుంచి ఉత్పత్తి ఆగిపోయింది. చైనాలో ఉధృతి తగ్గినా తిరిగి పూర్తి స్థాయీ ఉత్పత్తి సాధించటానికి కనీసం నెలపైనే పడుతుంది. ఒకవేళ ఉత్పత్తి చేసినా డిమాండ్ ఉండాలి. అమెరికాలో ప్రస్తుతానికి ఉత్పత్తి ఆగలేదు. కానీ ముందు ముందు ఆగే పరిస్థితులు కనబడుతున్నాయి. జర్మనీ ,జపాన్లు ఇప్పటికే రెడ్ జోనులో వున్నాయి. ఒక వైపు ఉత్పత్తి ఆటంకాలు, రెండో వైపు గిరాకీ లేని పరిస్థితి డిమాండ్-సప్లై కొరతలోకి నెట్టివేయబడ్డాయి.

ఇక ఆయిల్ పరిస్థితులు ఎలా మారుతాయో ఇప్పుడే చెప్పలేము. సౌదీ-రష్యా ఆయిల్ యుద్ధం భారత్ కు మేలుచేస్తుందని స్థూలంగా అనుకున్నా పరిస్థితులు ఇలాగే కొనసాగే అవకాశాలు లేవు. ఆయిల్ పరిశ్రమ సంక్షోభంలో పడే అవకాశాలు మెండుగా ఉన్నాయని అనిపిస్తుంది. ఎందుకంటే సౌదీ అధిక ఉత్పత్తి చేసి రష్యా ని, అమెరికా ని దెబ్బ తీయాలని ప్రయత్నించటం ముందు ముందు ఎక్కడకి దారి తీస్తుందో చెప్పలేము. ప్రస్తుతం అమెరికా షేల్ సాంకేతికత తో ఆయిల్ గుత్తాధిపత్యాన్ని బద్దలుచేసినా అది లాభదాయకంగా నడవాలంటే కనీసం బ్యారెల్ కి 50 డాలర్లు రేటు లేకపోతే ఆ రంగం మూతబడటం ఖాయం. ఓ విధంగా రష్యా అదే కోరుకుంటుంది. ఈ కరోనా వైరస్ ఆయిల్ ఉత్పత్తి దేశాల మధ్య కత్తులు నూరే వైరాన్ని తెచ్చిపెట్టింది. ఇది ఎక్కడికి దారి తీస్తుందో చెప్పలేము. చరిత్ర చూస్తే అమెరికా తన వ్యాపార ప్రయోజనాలు దెబ్బతింటే చూస్తూ ఊరుకోదు. ప్రపంచంలో నూతన ఉద్రిక్తతలకు దారి తీసే అవకాశాలే వున్నాయి. ప్రస్తుతానికి మన కరెంట్ ఖాతా లోటు తగ్గటానికి, ద్రవ్యోల్బణం తగ్గటానికి ఈ పరిస్థితి ఉపయోగపడుతుంది. కానీ దీర్ఘకాలంలో ఇది కొనసాగే అవకాశాలు లేవు.

మనదేశంవరకు చూసుకుంటే సేవా రంగందెబ్బతినటం తో ప్రజల ఆదాయం తగ్గటంతో పాటు ప్రభుత్వానికి పన్నుల ద్వారా వచ్చే ఆదాయం కూడా తగ్గుతుంది. దానితో ఆర్థికలోటు ఇంకా పెరుగుతుంది. జీడీపీ ఏదైతే తగ్గుతుందని ఆర్ధిక సంస్థలు అంచనా వేశాయో ఆ మేరకు కూడా వచ్చే అవకాశం లేదు. ఇంకా గణనీయంగా పడిపోయే అవకాశాలున్నాయి. మనదేశం తీసుకున్న దిగ్బంధన చర్యలు కనుక ఓ నెల రోజుల్లో ఎత్తివేసే పరిస్థితులు లేకపోతే పరిస్థితులు ఇంకా దారుణంగా ఉంటాయి. అవి వూహించటానికే వీలులేనంత స్థాయిలో ఉండొచ్చు. ప్రభుత్వం ఇచ్చే ఉద్దీపన చర్యలు పరిమిత ప్రయోజనాన్నే ఇవ్వగలుగుతాయి. ఎందుకంటే ఇది కేవలం ఆర్ధిక మాంద్యం కోణంలో చూడలేము. అంతకన్నా దారుణమైనది. ఆర్ధిక మాంద్యం అయితే ఉద్దీపన చర్యలు తిరిగి ఆర్ధిక పునరుజ్జీవనానికి ఉపయోగపడతాయి. అదే అన్ని కార్యక్రమాలు దిగ్బంధనం చేస్తే ఉద్దీపన చర్యల వలన ఆర్ధిక వ్యవస్థ పుంజుకోదు. నాకు తెలిసి ఆధునిక ప్రపంచంలో ఇటువంటి పరిస్థితి ఎప్పుడూ ఎదురుకాలేదు.

తక్షణ కర్తవ్యం ఏమిటి?

ముందుగా కరోనా వైరస్ ను ఆపగలగటం. ఇప్పటివరకు భారత్ మిగతా దేశాలతో పోలిస్తే మెరుగ్గానే వుంది. చాలావరకు బయటినుంచి వచ్చే ప్రమాదాన్ని గడప దగ్గరే ఆపగలిగారు. ఇప్పుడు ఏకంగా విదేశీయుల వీసా లన్నింటినీ తాత్కాలికంగా రద్దు చేయటం సరైన చర్య. ముందుగా ఈ వైరస్ ని మన గడప దగ్గర ఆపగలిగితే సగం ప్రమాదాన్ని నివారించగలిగినట్లే. మిగతాది ఇప్పటికే దేశంలో కి ప్రవేశించిన కేసులు మిగతావారికి విస్తరించకుండా జాగ్రత్తలు తీసుకోవటం. అందుకు కొద్ది రోజులు అన్ని పబ్లిక్ కార్యక్రమాల్ని రద్దుచేయటం మినహా వేరే మార్గం లేదు. ఇప్పటికే ఆ దిశగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. పలు రాష్ట్రాలు సినిమా హాళ్లు మూసివేశాయి. స్కూళ్లకు సెలవులు ప్రకటించాయి. క్రీడా కార్యక్రమాలు రద్దుచేశాయి. సాధ్యమైనంతవరకు ప్రయాణాలు నివారించగలిగితే ఇంకా మంచిది. వీటికి ప్రజలు పూర్తిగా సహకరించాలి. ఇదేదో ప్రభుత్వాలు అతిగా స్పందిస్తున్నాయని అనుకోవద్దు. ఒకసారి దేశంలోకి ప్రవేశించిన మహమ్మారిని రూపుమాపగలిగితే తిరిగి అన్ని కార్యక్రమాల్ని పునరుద్ధరించుకోవచ్చు. అందుకనే మనందరి , మన పిల్లల భవిష్యత్తు కోసం ఆ మాత్రం మనం సహకరించలేమా?

దానితోపాటు వ్యక్తిగత శుభ్రతకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. చేతులు ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవటం , దగ్గు, జలుబు వున్న వ్యక్తులకు కనీస దూరం పాటించటం , మన ఇల్లు, పరిసరాలు శుభ్రంగా అట్టిపెట్టుకోవటం మన చేతిలో పని. ప్రభుత్వం చేయాల్సినవి చేస్తే మనం చేయాల్సినవి చిత్త శుద్ధి తో చేద్దాం. ప్రభుత్వం , ప్రజలు కలిసి పనిచేస్తేనే మనం ఈ మహమ్మారిని వేగంగా మన దేశంనుంచి తరిమేయగలం. మనం భయాందోళనలకు గురికావాల్సిందేమీలేదు. ప్రభుత్వం చెప్పినట్లు చేస్తూ తగుజాగ్రత్తలు తీసుకుంటే త్వరలోనే సాధారణ పరిస్థితులు నెలకొంటాయి. దయచేసి ఇప్పుడు రాజకీయాలు చేయొద్దు. కాంగ్రెస్ పార్టీ ఎదో నిరసన ప్రదర్శనలు చేయబోతోందని తెలుస్తోంది. ఇప్పుడు కావాల్సింది నిరసన ప్రదర్శనలు కాదు. ప్రభుత్వానికి సహకరించటం. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రభుత్వానికి కొత్త తలనెప్పులు తీసుకురావద్దు. రాహుల్ గాంధీ ప్రకటన బాధ్యతారాహిత్యంగా వుంది. ఇన్నాళ్టికి కూడా పరిణితి రాక పోవటం విచారకరం. మీదగ్గర ఏమన్నా నిర్దిష్ట ప్రతిపాదనలుంటే ప్రభుత్వానికి ఇవ్వండి. అంతేగానీ దీంట్లో రాజకీయ లబ్ది పొందాలనుకుంటే ప్రజలు హర్షించరు . ఇప్పుడు కావాల్సింది అందరం కలిసి ఓ వుద్యమం లాగా కలిసి పనిచేయటం. ఇందులో అన్ని రాజకీయ పార్టీలు, కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు, సామాజిక సంస్థలు కలిసి ముందుకు నడుస్తాయని ఆశిద్దాం. మహమ్మారిని తరిమేద్దాం. ఎంత త్వరగా సాధారణ పరిస్థితులు నెలకొంటే అంతత్వరగా ప్రజలకు మేలు జరుగుతుంది. అందరం అందుకు సహకరిద్దాం.