Karnataka Elections Congress: దేశంలో అతిపెద్ద పార్టీగా పునర్వైభవం సంపాదించుకునేందుకు కాంగ్రెస్ కు కర్ణాటక ఎన్నికలు కీలకంగా మారాయి. ఒకరకంగా చావో రేవో సమస్యలా తయారయ్యాయి. ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో గెలిస్తేనే భావి ఎన్నికలకు శకునాలన్నీ బాగుంటాయి. అందుకోసం కర్ణాటకలో గెలిచేందుకు అష్టకష్టాలు పడుతుంది. అంతేగాక, బీజేపీ జయభేరిని కాంగ్రెస్ అడ్డుకోలేదు అన్న నానుడి ఫులిస్టాప్ పెట్టాలని భావిస్తోంది.
బీజేపీ దేశంలో బలమైన శక్తిగా ఉంది. ఎన్డీఏను ఎదుర్కొనేందుకు చేస్తున్న ప్రయత్నాల్లో కాంగ్రెస్ పార్టీ నేతలు సఫలం కాలేకపోతున్నారు. ఇటీవల జరిగిన పంజాబ్, అస్సాం, ఉత్తరాఖండ్, మణిపూర్ తదితర రాష్ట్రాల్లో బీజేపీకి గట్టి ఇచ్చింది. మణిపూర్‌లో ఎక్కువ శాతం స్థానాలు గెలుచుకున్నప్పటికీ ఆ ప్రభావం మిగతా రాష్ట్రాలపై పెద్దగా కనబడ లేదు. ఆ తరువాత తలెత్తిన అంతర్గత విభేదాల నుంచి బయటపడేందుకు ఎక్కువ సమయం కేటాయించాల్సి వచ్చింది. తదనంతర పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి జాతీయ అధ్యక్షుడిగా మల్లికార్జున ఖర్గేను నియమించారు. ప్రస్తుతం ఆయన సొంత రాష్ట్రం కర్ణాటకలో ఎన్నికలు జరుగుతున్నందున ప్రతిష్టాత్మకంగా మారాయి.
కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపొందితే ఆటోమేటిగ్గా కొన్ని జవసత్వాలు వస్తాయి. మహారాష్ట్ర జీడీపీతో పోల్చుకుంటే కర్ణాటక జీడీపీ దాదాపు సరిసమానం. అంతపెద్ద రాష్ట్రంలో పాగా వేయగలిగితే బీజేపీకి భారీ స్థాయిలో దెబ్బ కొట్టినట్లవుతుంది. అవసరార్థులు ఎక్కువగా ఉంటారు. ఆర్థికంగా పరిపుష్టి పొందడంతో పాటు దేశంలో బీజేపీకి ప్రత్యామ్నాయం కాంగ్రెస్సే అన్న అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు బాగా ఉపయోగపడుతుంది.
మరోవైపు ఎన్డీఏలో మిత్ర పక్షాలు జారిపోతున్నాయి. సమాజ్ వాది పార్టీ, ఎన్సీపీ వంటి వారిని కలుపుకొని వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. వీటన్నింటికి కర్ణాటక ఎన్నికల్లో గెలుపుతో సమాధానం చెప్పాలని కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం బావిస్తోంది. మల్లికార్జున ఖర్గే అధ్యక్ష స్థానంలో ఉన్నా, రాహుల్ గాంధీని బలోపేతం చేయాల్సిన అవసరం కూడా ఉంది. ఆయన దేశం మొత్తం చుట్టేసే బృహత్తర కార్యక్రమాన్ని నిర్వహించారు. అన్ని రాష్ట్రాల్లో పాదయాత్ర కొనసాగింది. ఆయన సభ్యత్వం కోల్పోవడానికి బీజేపీ తెరవెనుక మంత్రాంగం నడిపిందన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.
మొత్తంగా చూసుకుంటే కర్ణాటక ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి జవసత్వాలు తీసుకువస్తాయని స్పష్టమవుతోంది. ప్రస్తుతం పోలింగ్ సరళిని ఆ పార్టీ నేతలు నిశితంగా గమనిస్తున్నారు. బీజేపీకి ప్రత్యామ్నాయంగా ఏర్పాటయ్యే కూటమికి బాధ్యత వహించాలన్న కోరిక కూడా నెరవేరుతుంది. అయితే, కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని తృణమూల్ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ వ్యతరేకిస్తున్నాయి. వీరందరికీ కర్ణాటక ఎన్నికలతో సమాధానం చెప్పడానికి సోనియా గాంధీ సిద్దమవుతున్నారు.