YCP vs BJP- Liquor Scam: ఏపీలో విచిత్ర రాజకీయ పరిస్థితులు నెలకొన్నాయి. ఎవరికి ఎవరు మిత్రులో..ఎవరు శత్రువులో అర్ధం కాని పరిస్థితి. ముఖ్యంగా వైసీపీ, జనసేన మధ్య భీకర రాజకీయ యుద్ధం నడుస్తోంది. అటు జనసేన అంటే కూడా వైసీపీ విరుచుకుపడుతోంది. రాష్ట్ర రాజకీయాల్లో బీజేపీ కీలక పాత్ర పోషించాలని పరితపిస్తున్నా పట్టించుకునేవారు లేరు. అటు కేంద్ర పెద్దల ప్రాపకం కోసం రాష్ట్రంలోని అధికార, విపక్ష పార్టీలు ప్రయత్నంచేస్తూనే ఉన్నాయి. అదే సమయంలో బీజేపీ నేతల నుంచి ఎటువంటి ఆరోపణలు వస్తున్నా అందరూ లైట్ తీసుకుంటున్నారు. భయమో.. లేక కేంద్ర పెద్దలకు తెలుస్తుందనో తెలియదు కానీ.. స్పందించేందుకు సాహసించడం లేదు. మరీ ముఖ్యంగా అధికార వైసీపీ అయితే బీజేపీ నేతలు తమ పార్టీ నేతల పేర్లు బయటకు చెబుతూ.. ఆధారాలతో మాట్లాడుతున్నా కనీసం ఖండించలేని స్థితిలో ఉన్నారు. లిక్కర్ స్కాం ఏపీలో కూడా ప్రకంపనలు పుట్టిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో వైసీపీ నేతల పాత్ర సర్వత్రా చర్చనీయాంశమైంది. చివరకు సీఎం కుటుంబసభ్యుల పేర్లు తెరపైకి వచ్చాయి.

మంత్రులపై సీఎం రుసరుస
అయితే తన కుటుంబసభ్యులపై టీడీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నా స్పందించడం లేదని నేరుగా కేబినెట్ మీటింగులోనే మంత్రులపై సీఎం జగన్ రుసరుసలాడారు. దీటుగా కౌంటర్ అటాక్ చేయాలని ఆదేశాలిచ్చారు. దీంతో మంత్రులు నోటికి పనిచెప్పడం ప్రారంభించారు. టీడీపీ నేతలపై విరుచుకుపడుతున్నారు.కానీ బీజేపీ నేతలు కూడా టీడీపీ నాయకుల కంటే దారుణమైన ఆరోపణలు చేస్తున్నారు. కానీ వారి విషయంలో వైసీపీ సర్కారు ఎందుకు వివక్ష చూపుతుందన్నదే ఇప్పుడు ప్రశ్న. ఇటీవల ఏపీ పర్యటనకు వచ్చిన కేంద్ర మంత్రి అనురాథ్ ఠాగూర్ లిక్కర్ స్కాంలో ఏపీ ప్రభుత్వ పెద్దలు ఉన్నారని.. త్వరలో వారి పేర్లు బయటకు వస్తాయని ప్రకటించారు. తెలంగాణ ఎమ్మెల్యే రఘునందన్ ఒక అడుగు ముందుకేసి ఈ స్కాంలో విజయసాయిరెడ్డి అల్లుడి పాత్ర ఉందని బయటపెట్టారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు అయితే వైసీపీ నేతలపై తీవ్ర స్తాయిలో ఆరోపణలు గుప్పిస్తున్నారు.
కనీసం కౌంటర్ ఇవ్వని వైనం..
బీజేపీ నేతలు వరుసగా ఆరోపణలు చేస్తున్నా వైసీపీ నేతలు అసలు స్పందించడం లేదు. కనీసం ఖండించడం లేదు. అవే ఆరోపణలు టీడీపీ చేస్తుంటే మాత్రం సహించలేకపోతున్నారు. ఆరోపణలు చేయడానికి వారెవరని? అసలు వారి వద్ద ఉన్న సమాచారం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. అదే విషయాన్ని పరిగణలోకి తీసుకుంటే టీడీపీ నేతలు చేసిన ఆరోపణలకంటే బీజేపీ నాయకులు చేసినవే సీరియస్. ఎందుకంటే కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నందున వారి వద్ద పక్కా సమాచారం ఉంటుంది. దీనికితోడు లిక్కర్ స్కాం ప్రకంపనలు అటు ఢిల్లీ, ఇటు తెలంగాణ చుట్టూ తిరుగుతున్నాయి. ఈ రెండు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నది బీజేపీ వ్యతిరేక ప్రభుత్వాలు. పోనీ బీజేపీ నేతలు ఉత్తినే ఆరోపణలు చేస్తే కేంద్రంలో అధికారంలో ఉన్నది మీరే కదా అని కౌంటర్ అటాక్ ఇవ్వొచ్చు. కానీ వైసీపీ నేతలు అలా చేయడం లేదు. మౌనాన్నే ఆశ్రయిస్తున్నారు. దీంతో బీజేపీ చేసిన ఆరోపణల్లో నిజముందన్న సంకేతాలు ప్రభుత్వానికి వెళుతున్నాయి.

టీడీపీ సవాల్…
బీజేపీ నేతలు శక్తికి మించి ఆరోపణలు చేస్తున్న స్పందించని వైసీపీ నేతలు టీడీపీ నేతలపై మాత్రం బూతులతో విరుచుకుపడుతున్నారు. అయితే ఇదే అంశాన్ని టీడీపీ నాయకులు ప్రస్తావిస్తున్నారు. మాపై బూతులు మాట్లాడడం కాదు..దమ్ముంటే బీజేపీ నేతలు చేస్తున్న ఆరోపణలకు సమాధానం చెప్పాలని సవాల్ విసరుతున్నారు. అందుకు సంబంధించి వీడియోలు జత చేసి సోషల్ మీడియా వేదికగా నిలదీస్తున్నారు. దానిని కూడా వైసీపీ నేతలు పట్టించుకోవడం లేదు. వ్యూహాత్మకంగా మౌనాన్నే ఆశ్రయిస్తున్నారు.