Krishnam Raju- Chiranjeevi: చిరంజీవితో కృష్ణంరాజు ప్రత్యేకమైన అనుబంధం కలిగి ఉన్నారు. వీరి మధ్య విడదీయరాని స్నేహం ఉంది. చిరంజీవి కెరీర్ ప్రారంభంలో చేసిన మనవూరి పాండవులు సినిమాలో కృష్ణంరాజు కీలక రోల్ చేశారు. ఇక ఇద్దరూ మొగల్తూరులో పుట్టారు. చిరంజీవి కంటే ముందు నటుడిగా మారిన కృష్ణంరాజు ఆయన పెద్ద స్టార్ అవుతాడని పసిగట్టాడు. అప్పట్లో చిరంజీవి రేడియోలో వచ్చే ప్రతి పాటకు డాన్స్ చేసేవాడట. అది చూసిన కృష్ణంరాజు నీలో మంచి రిథమ్ ఉంది, పెద్ద స్టార్ అవుతావని చెప్పాడట.

చిరంజీవి స్టార్ అయ్యాక ఆయన బర్త్ డే పార్టీకి కృష్ణంరాజు వెళ్ళాడట. ఆ వేడుకకు ఆయన లండన్ నుండి తెచ్చిన కెమెరా తీసుకెళ్లారట. కృష్ణంరాజుతో పాటు ఆయన మేనల్లుడు కూడా ఆ పార్టీకి వెళ్ళాడట. కృష్ణంరాజు తీసుకెళ్లిన కెమెరాతో మేనల్లుడు పార్టీకి వచ్చిన సెలబ్రిటీలను ఫోటోలు తీస్తున్నారట. ఆ కెమెరా చూసిన చిరంజీవి షాక్ అయ్యారట. ఈ కెమెరా నీకు ఎక్కడిది, దీన్ని నేను లండన్ లో చూశాను, బాగా ఖరీదని కొనలేదని చెప్పాడట. ఆ మాటలు విన్న కృష్ణంరాజు మేనల్లుడు మెడలో ఉన్న కెమెరా తీసి చిరంజీవి మెడలో వేశాడట. ఇదే నీకు నా బర్త్ డే గిఫ్ట్ అని చెప్పాడట.
ఆ బహుమతికి చిరంజీవి ముగ్దుడైపోయాడట. అంత గొప్ప స్నేహం వాళ్ళ మధ్య ఉండేది. పొలిటికల్ గా కూడా వీరి ప్రయాణం సాగింది. బీజేపీ పార్టీ తరఫునుండి ఎంపీగా గెలిచిన కృష్ణంరాజు వాజ్ పేయ్ హయాంలో కేంద్ర మంత్రిగా పలు బాధ్యతలు నిర్వర్తించారు. అయితే మిత్రుడు చిరంజీవి కోరిక మేరకు ఆయన పీఆర్పీ పార్టీలో చేరారు. 2009 లో రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గం నుండి ఎంపీగా పోటీ చేసి ఓటమి చెందారు. అనంతరం చిరంజీవి పీఆర్పీ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశారు. కృష్ణం రాజు బీజేపీకి మరలా దగ్గరయ్యారు.

పొలిటికల్ గా వేరు వేరు దారులు చూసుకున్నా వీరి స్నేహం మాత్రం చెక్కు చెదరలేదు. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ లో కలిసి పనిచేశారు. నేడు కృష్ణంరాజు మరణించడంతో చిరంజీవి అత్యంత విచారం వ్యక్తం చేస్తున్నారు. గొప్ప మిత్రుడిని కోల్పోయానని బాధపడుతున్నారు. 83 ఏళ్ల కృష్ణంరాజు ఆదివారం తెల్లవారుజామున అనారోగ్యంతో మరణించారు. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలతో కృష్ణంరాజు బాధపడుతున్నారు. ఆయన మృతి పట్ల చిత్ర ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు.