Karimnagar MLC seat: తెలంగాణలో టీఆర్ఎస్ కు ఎదురుదెబ్బలే తగులుతున్నాయి. ఇప్పటికే హుజురాబాద్ ఉప ఎన్నికలో సర్వ శక్తులు ఒడ్డి పోరాడినా ఫలితం మాత్రం దక్కలేదు. దీంతో బీజేపీపై ప్రత్యక్ష పోరాటానికి దిగింది. బీజేపీని ఎండగట్టేందుకు ధర్నాలు చేసింది. ఆందోళనలు చేపట్టినా కేంద్రం మాత్రం బెదరడం లేదు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా చుక్కెదురు కానుంది. దీంతో టీఆర్ఎస్ అంతర్మథనంలో పడింది. బీజేపీని ఎలాగైనా నిలువరించాలని చూస్తున్నా సాధ్యం కావడం లేదు. కేంద్రంపై అభాండాలు వేస్తూ పబ్బం గడుపుకోవాలని భావించినా నెరవేరకపోవడంతో ఇక ఏం చేయాలనే ఆలోచనలో పడిపోయింది. ఇన్నాళ్లు ఏ ఎన్నికలు వచ్చినా విజయం తమదేనని చెప్పుకునే టీఆర్ఎస్ కు ప్రస్తుతం సంకట పరిస్థితి ఎదురవుతోంది.
కరీంనగర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ రెబల్ గా బరిలోకి దిగిన మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ వ్యవహారం టీఆర్ఎస్ లో తలనొప్పులు తెస్తోంది. ఇన్నాళ్లు విధేయుడిగా ఉన్న రవీందర్ సింగ్ ఒక్కసారిగా తిరుగుబాటు జెండా ఎగురవేశారు. దీంతో ఏం చేయాలో అనే సందిగ్ధంతో టీఆర్ఎస్ పడిపోయింది. ఆయన నామినేషన్ వేసి అదృశ్యమయ్యారు. దీంతో టీఆర్ఎస్ అన్ని ప్రయత్నాలు చేసినా సఫలం కాలేదు. దీంతో కరీంనగర్ సీటు కోల్పోవడం ఖాయమనే నిర్ణయానికి వచ్చింది. ఇందులో భాగంగానే కేసీఆర్ తన మనసులోని మాట బయటపెట్టారు. గెలుపోటములు సహజం. ఒక్క సీటు కోల్పోయినంత మాత్రాన మేం అపజయం పాలైనట్లు భావిస్తే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. అంటే కరీంనగర్ లో ఓటమి ఖాయమని తెలిసిపోయిందని చర్చ జరుగుతోంది.
ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ కు ఇక ప్రతి ఎన్నికల్లో భంగపాటు తప్పకపోవచ్చనే సంకేతాలు వస్తున్నాయి. టీఆర్ఎస్ పై ప్రజల్లో కూడా వ్యతిరేకత వచ్చిందని దీంతోనే ఇలా అపజయాలు పలకరిస్తున్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి. మరోవైపు సర్దార్ రవీందర్ సింగ్ సింగ్ వెనుక ఉండి నడిపిస్తున్నది మాత్రం మాజీ మంత్రి, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అనే వాదనలు వినిపిస్తున్నాయి. దీంతో అధికార పార్టీని ఎక్కడ పడితే అక్కడ అడ్డుకునేందుకే ఈటల ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. కొరివితో తల గోక్కోవడమంటే ఇదే అని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. ఈటలను అనవసరంగా కెలికి తమ పతనం కొని తెచ్చుకుంటున్నారనే వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.
Also Read: KCR vs BJP: బీజేపీని తిట్టిపోసి.. ధాన్యం భారం దించుకొని.. కేంద్రంపైకి డైవర్ట్ చేసిన కేసీఆర్!
ఇన్నాళ్లు తమ పార్టీకి ఎదురులేదని చెప్పే నేతల మాటలు ఇప్పుడు పెకలడం లేదు. అన్ని పార్టీలను చులకనగా చూసే టీఆర్ఎస్ కు ప్రస్తుతం ఎదురుగాలి తప్పదనిపిస్తోంది. భవిష్యత్ లో పార్టీని నామరూపాల్లేకుండా చేసే పనిలో భాగంగానే బీజేపీ ప్రయత్నాలు ఆరంభించిందని తెలుస్తోంది. ఇందుకోసం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో పార్టీని బలోపేతం చేసే పనిలో పడింది. కేంద్ర హోం మంత్రి ఇటీవల తిరుపతి పర్యటన సందర్భంగా రెండు స్టేట్లలో పరిస్థితులపై ఆరా తీశారు. అధికారం కోసం చేపట్టే కార్యక్రమాలపై దిశా నిర్దేశం చేశారు. అందుకే అటు ఏపీలో ఇటు తెలంగాణలో భారీ మార్పులు కనిపిస్తున్నాయి. నేతల్లో వచ్చిన ఊపుతో రాబోయే ఎన్నికల్లో కూడా తమ ప్రభావం ఇలాగే కొనసాగించేందుకు పావులు కదుపుతున్నారు.
తాజాగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీని ఇరుకున పెట్టేందుకే బీజేపీ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇందుకోసమే పక్కా ప్రణాళికతో ముందుకెళుతూ టీఆర్ఎస్ ను టార్గెట్ చేసుకుని ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ను అభాసుపాలు చేయాలని చూస్తోంది. దీనికి ఈటల రాజేందర్ తన వ్యూహంతో రవీందర్ సింగ్ ను తమ వైపు తిప్పుకునేందుకే ప్రణాళికలు రూపొందించడం వెనుక ఈటల పక్కాగా ప్లాన్ వేసినట్లు సమాచారం. దీంతో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో సైతం చేదు అనుభవాలు ఎదుర్కోనుందని తెలుస్తోంది.
Also Read: YS Vivekananda Reddy: మలుపులు తిరుగుతున్న వివేకా హత్య కేసు