North Korea: దేశమంతా దుర్భర దారిద్ర్యం.. ఇతర దేశాలతో సత్సంబంధాలు లేవు.. ఇంటర్నెట్, టీవీ వాడకంపై నిషేధం.. ఆహార పదార్థాల ధరలు కొండెక్కి కూర్చున్నాయి. కనీసం రోజుకు మూడు పూటలా అన్నం తినడం కూడా అక్కడి ప్రజలకు గగనమైపోయింది. ఇన్ని సమస్యలకు కారణం ఆ దేశ అధ్యక్షుడి మూర్ఖపు విధానాలు. ఫలితంగా ఇంటా బయట ఆ దేశం తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. అయినప్పటికీ ఆ అధ్యక్షుడు దేనిని లెక్కచేయడం లేదు.

ప్రపంచం ఓ వైపు ఉక్రెయిన్ యుద్ధం, తైవాన్ సమస్యతో సతమతమవుతుంటే ఆ అధ్యక్షుడి నాయకత్వంలోని ప్రభుత్వం దుందుడుకు చర్యలకు పాల్పడుతున్నది. ఈ ఏడాది అక్టోబర్ వరకు 40 కి పైగా క్షిపణి పరీక్షలు జరిపింది. ఆ క్షిపణుల్లో కొన్నింటికి దక్షిణ కొరియా, అమెరికా, జపాన్ భూ భాగాలను తాకే సత్తా ఉంది. ఇంతకీ ఏమిటా దేశం? ఎవరు ఆ అధ్యక్షుడు? ఓ లుక్కేద్దాం పదండి.
క్షిపణి పరీక్షలు నిర్వహిస్తోంది
సాధారణంగా మనం మన అవసరాలు తీరాకే మిగతా వాటి గురించి ఆలోచిస్తాం. తిండికి లేకున్నప్పటికీ దీపావళి బాణసంచా కొనుగోలు చేస్తామా? లేదు కదా?! కానీ దురదృష్టవశాత్తు ఉత్తరకొరియా అధ్యక్షుడు తన అవసరాలు తీరిన తర్వాత మిగతా వాటిని పట్టించుకోడు. పైగా ప్రజలకు మూడు పూటల అన్నం పెట్టే దానికంటే మందు గుండు సామగ్రికే ఎక్కువ ఖర్చు చేస్తాడు. అందువల్లే అక్కడి ప్రజల్లో పోషకాహార లోపం తలెత్తుతోంది. పైగా తాను తయారుచేసిన క్షిపణులను ఉత్తరకొరియా ప్రయోగించడం వల్ల సరిహద్దు దేశాలు వణికి పోతున్నాయి. ఉత్తరకొరియా క్షిపణి పరీక్షలు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తీర్మానాలను తుంగలో తొక్కి మరీ పలు విధ్వంసాలను సృష్టిస్తున్నాయి. గత నెలలో అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారీస్ దక్షిణ కొరియా, జపాన్ దేశాలను సందర్శించిన సమయంలోనూ ఉత్తర కొరియా ఒక క్షిపణి పరీక్ష జరిపింది. మరో క్షిపణి జపాన్ మీదుగా ఎగిరి సముద్రంలో పడింది. అమెరికా ఏలుబడిలోని పసిఫిక్ మహాసముద్ర ద్వీపం గ్వామ్ ను తాకగల క్షిపణి నీ పరీక్షించింది. తన ఆగడాలకు ప్రతిగా అమెరికా, దక్షిణ కొరియాలు సైనిక కవాతులు, నౌకా విన్యాసాలు జరిపితే వాటిని సాకుగా చెప్పి ఉత్తర కొరియా మరిన్ని ఆయుధ పరీక్షలకు తెగబడుతోంది. కొద్ది రోజుల క్రితం ఒక క్షిపణిని కొరియా ద్వీపకల్పానికి, జపాన్ కు మధ్య ఉన్న సముద్ర జలాల్లోకి ప్రయోగించింది. ఆపైన సముద్రంలో ఫిరంగి గుళ్లను పేల్ చేసింది. దక్షిణకొరియా సరిహద్దుల సమీపంలోకి యుద్ధ విమానాలనూ పంపింది. ఉత్తర, దక్షిణ కొరియాల మధ్య సముద్ర, భూ సరిహద్దుల వెంబడి విమానాలు ఎగరకూడదని, ఆయుధ పరీక్షలు జరపకూడదంటూ గతంలో కుదిరిన ఒప్పందాన్ని ఉత్తరకొరియా యదేచ్చగా ఉల్లంఘించింది.
ఏడో అణ్వస్త్ర పరీక్ష జరిపేందుకు
చైనా కమ్యూనిస్టు పార్టీ మహాసభలు ముగిసిన తర్వాత, నవంబర్ 8న అమెరికా కాంగ్రెస్ మభ్యంతర ఎన్నికల జరిగే ముందు ఉత్తర కొరియా ఏడో అణ్వస్త్ర పరీక్ష జరిపేందుకు సమాయత్తమవుతోందని గూడచారి సంస్థలు హెచ్చరిస్తున్నాయి. ఆ దేశం వద్ద ఇప్పటికే 50 అణ్వస్త్రాలు ఉన్నాయని ఒక అంచనా. ఉత్తర కొరియా వ్యవస్థాపకుడు, తాత కిమ్ ఇల్ సంగ్, తండ్రి కిమ్ జొంగ్ ఇల్ మాదిరిగానే కిమ్ జొంగ్ ఉన్ కు కూడా అణ్వస్త్రాలను విడిచిపెట్టే ఆలోచన లేదని స్పష్టం అవుతుంది. కిమ్ 2020లో జలాంతర్గామి నుంచి ప్రయోగించగల అణ్వస్త్ర వాహక క్షిపణిని పరీక్షించారు. దీని తర్వాత రాత్రిపూట జరిగిన సైనిక కవాతులో సుదూర లక్ష్యాలను ఛేదించగల సరికొత్త క్షిపణిని ప్రయోగించారు. అణ్వస్త్ర తయారీకి కావలసిన ఫ్లూటోనియం శుద్ధి కార్యక్రమానికి ఉత్తర కొరియా పున: ప్రారంభించిందని 2021లో అంతర్జాతీయ అణు శక్తి సంస్థ తెలిపింది. ఆ వెంటనే కిమ్ సర్కారు దూర శ్రేణి క్రూయిజ్ క్షిపణులను, అణ్వస్త్ర వాహక సామర్థ్యం గల హైపర్ సోనిక్ క్షిపణి నీ పరీక్షించింది. కొన్ని సంవత్సరాల క్రితం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, కిమ్ జొంగ్ ఉన్ అణు యుద్దానికి సై అంటే సయ్యని సవాలు చేసుకున్నారు. అప్పట్లో వియత్నాం దేశంలో ట్రంప్ తో భేటీ నిష్ఫలంగా ముగియడంతో కిమ్ క్షిపణి పరీక్షలు, అణ్వస్త్ర తయారీ సన్నాహాలు పున ప్రారంభించారు. ఇప్పుడు ఉక్రియ యుద్ధం పైకి ప్రపంచం మొత్తం తన దృష్టిని మళ్లించడంతో అమెరికా, దక్షిణ కొరియా, జపాన్ లపై తిరిగి కిమ్ బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించాడు. దీనికోసం ఆయుధ పరీక్షలు ముమ్మరం చేశాడు.

చైనా, రష్యా సహకరించే పరిస్థితి లేదు
ప్రచ్చన్న యుద్ధం ముగిసిన తర్వాత రష్యా, చైనా దేశాలతో అమెరికా సానుకూల సంబంధాలు నడిపింది. దీంతో ఆ ప్రధాన రాజ్యాల మధ్య విభేదాలను ఉపయోగించుకొని ఉత్తరకొరియా తన అజెండాను నెరవేర్చుకునే వీలు లేకుండా పోయింది. కానీ తాజాగా ఉక్రెయిన్, తైవాన్ సమస్యల వల్ల ఉద్రిక్తతలు రగులుతున్నాయి. అందువల్ల ఉత్తరకొరియాకు కళ్ళేలు బిగించేందుకు అమెరికాకు డ్రాగన్, రష్యా సహకరించే పరిస్థితి లేదు. వచ్చే రోజుల్లో ఉత్తరకొరియా ఏదైనా అణ్వస్త్ర ప్రయోగాలు జరిపితే ఐక్యరాజ్యసమితి చర్యలు తీసుకోకుండా రష్యా, చైనా అడ్డుపడే అవకాశం లేకపోలేదు. ఒకవేళ ఉత్తర కొరియా మీదికి అమెరికా దృష్టి మళ్ళిస్తే ఉక్రెయిన్, తైవాన్ మీద ఆసక్తి తగ్గుతుందని బీజింగ్, మాస్కో భావిస్తున్నాయి.. అయితే ఇప్పటికే ఆర్థిక మాంద్యం అంచుల వెంట నిలిచి ఉన్న ప్రపంచానికి రష్యా, ఉక్రెయిన్ యుద్ధం ఒక పంటి పోటుగా నిలిచింది. దానిని మర్చిపోకముందే ఇప్పుడు ఉత్తర కొరియా రూపంలో మరో సమస్య ఎదురు పడింది. మరి దీనికి పరిష్కార మార్గం ఏమిటో ప్రపంచ దేశాధినేతలే ఆలోచించాలి. మొదటి, రెండవ ప్రపంచ యుద్ధాల వల్ల మానవజాతి చాలావరకు కోల్పోయింది. యుద్ధం వల్ల ఎంతటి నష్టం సంభవిస్తుందో ఇప్పటికీ శిరోషిమా, నాగసాకి ని చూస్తే అర్థమవుతుంది. కిమ్ లాంటి మూర్ఖపు దేశాధ్యక్షుల వల్ల మూడో ప్రపంచ యుద్ధం వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఆ మంటల్లో చైనా, రష్యా, అమెరికా లాంటి దేశాలు చలికాచుకున్నా పెద్దగా అతిశయోక్తి చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆవులు, ఆవులు పోట్లాడుకుంటే కాళ్లు విరగ్గొట్టుకునేది లేగలే.