JanaSena- BJP And TDP: ఏపీలో రాజకీయాలు ఒక్కసారిగా మారాయి. పవన్ కళ్యాణ్ విశాఖ పర్యటనలో నిర్బంధాలు పెట్టిన వైసీపీ తన గొయ్యి తనే తవ్వుకుంది. పవన్ కళ్యాణ్ కు ప్రజల్లో, ప్రతిపక్షాల్లో సానుభూతి వెల్లివిరిసింది. పవన్ ను స్వయంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, టీడీపీ అధినేత చంద్రబాబు కలిసి సానుభూతి తెలిపారు. దీంతో ఈ మూడు పార్టీలు కూటమి కడుతాయా? 2024 ఎన్నికల్లో కలిసి పోటీచేస్తే లాభమా? నష్టమా? అన్న చర్చ మొదలైంది.. జగన్ ను ఢీకొట్టే సత్తా ఈ మూడు పార్టీలకు ఉందా? అన్న దానిపై స్పెషల్ ఫోకస్.

ఏపీలో జనసేనాని ఒంటరిగా పోరాడుతున్నారు. అటు బీజేపీని, ఇటు టీడీపీని కలుపుకొని పోకుండా క్షేత్రస్థాయిలో జనసేనను బలోపేతం చేసి వచ్చే ఎన్నికల్లో 50 సీట్లు టార్గెట్ గా సాగుతున్నారు. ఇప్పటికే వైసీపీకి 65 సీట్ల కంటే ఎక్కువ రావని జనసేన సర్వేలో తేలింది. జనసేన ఎలాగైనా 50 సీట్లు సాధించాలని యోచిస్తోంది. అయితే వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వకుండా పవన్ పొత్తులకు తెరతీస్తాడా.? లేదా చంద్రబాబే పొత్తుకు ముందుకు వస్తాడా? అన్నది భవిష్యత్ నిర్ణయిస్తుంది.
ఇప్పటికే బీజేపీతో పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకున్నారు. వచ్చే ఎన్నికల్లో జనసేన, బీజేపీ కలిసి పోటీచేయడం ఖాయం. ఇక వీరితో కనుక టీడీపీ కలిస్తే ఖచ్చితంగా ఈ కూటమికి చాలా లాభం అనడంలో ఎలాంటి సందేహం లేదు. అధికారం పొందడానికి ఈ మూడు పార్టీల పొత్తు దోహదపడుతుంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఈ కూటమికి గంపగుత్తగా పడుతుంది.
బీజేపీ ఇప్పటికీ పవన్ కళ్యాణ్ కు రోడ్ మ్యాప్ ఇవ్వలేదు. ఇక నిన్న కలిసిన చంద్రబాబు మాత్రం టీడీపీ రోడ్ మ్యాప్ కి సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఒకవేళ రాష్ట్రంలో టీడీపీ – జనసేన కలిస్తే లాభం అని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే టీడీపీ – జనసేన పొత్తుకు బీజేపీ ఒప్పుకుంటుందా ? లేదా? అన్నదే ట్విస్ట్. ఎందుకంటే కేంద్రంలోని బీజేపీ జగన్ తో సాన్నిహిత్యంగా ఉంటోంది. ఇటు రాష్ట్రంలో జనసేనతో పొత్తులో ఉంది. టీడీపీని అస్సలు పట్టించుకోకుండా దూరం పెట్టింది. దీంతో బీజేపీ స్టాండ్ పైనే అందరిలోనూ ఆసక్తి ఉంది.

జగన్ తన చర్యలతో రోజురోజుకు జనాల్లో ప్రతిపక్షాల్లో వ్యతిరేకత కొని తెచ్చుకుంటున్నాడు. ఎన్ని డబ్బులు పంచినా.. సంక్షేమం కురిపించినా కూడా అభివృద్ధి లేదని.. రౌడీ రాజకీయాలంటూ వాదన వినిపిస్తోంది. ఈక్రమంలోనే జగన్ పై వ్యతిరేకతను సొమ్ము చేసుకోవాలంటే జనసేన, బీజేపీ, టీడీపీ కలిసి పోటీచేస్తే ఆ మూడింటికి లాభం. బలమైన జగన్ ను ఢీకొట్టే సత్తా ఈ మూడు పార్టీలకు ఉంది. ఈ మూడు పార్టీలు కలిస్తే వైసీపీ అడ్రస్ గల్లంతవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
కానీ పవన్ మాత్రం తన అస్తిత్వం కాపాడుకోవడానికి.. మూడో ప్రత్యామ్మాయంగా ఎదిగేందుకు యోచిస్తున్నారు. టీడీపీని తోసిరాజని ప్రధానప్రతిపక్షంగా.. వీలుంటే ఒంటరిగా ఏపీలో అధికారమే లక్ష్యంగా సాగుతున్నారు. మరి 2024 ఎన్నికల్లో ఈ మూడు పార్టీలు కలిసి పోటీచేస్తాయా? విడిగా చేస్తాయా? అన్న దానిపైనే జగన్ పార్టీ గెలుపోటములు ఆధారపడి ఉంటాయి.