BJP: లోక్‌సభ ఎన్నికల ప్రక్రియలో భాగంగా నాలుగో విడత పోలింగ్ మరో 36 గంటల్లో జరుగనుంది. ఇప్పటి వరకు మూడు విడతల్లో 280 సీట్లకు పోలింగ్ జరిగింది. మొత్తం 543 స్థానాలకుగాను ఇప్పటి వరకు ఎన్నికలు జరిగిన స్థానాల్లో తమకు 200 వస్తాయని బీజేపీ చెబుతోంది. కేంద్ర హోం మంత్రి అమిత్‌షా స్వయంగా ఈమేరకు ప్రకటన చేశారు. మొత్తంగా ఎన్నికలు పూర్తయితే తమకు 320 నుంచి 350 వరకు సీట్లు వస్తాయని లెక్కలు వేసుకుంటోంది.
బీజేపీ లెక్కలు ఇవీ..
లోక్‌సభ ఎన్నికల్లో మూడోసారి కేంద్రంలో అధికారంలోకి వస్తామని బీజేపీ పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉంది. ఈ ఎన్నికల్లో సొంతంగా బీజేపీకే 350 సీట్లు ఖాయమని లెక్కలు వేసుకుంటోంది. ఎన్డీఏ కూటమిలో ఒక్క రాహుల్ గాంధీ మినహా పెద్దగా చరిష్మా ఉన్న నాయకులు లేకపోవడం తమకు లాభిస్తుందని కమలం నేతలు అంచనా వేస్తున్నారు.
ఇండియా కూటమిలో లుకలుకలు..
ఇక ఇండియా కూటమిలో ఇప్పటికీ సఖ్యత లేదనేది ఎవరూ కాదనలేని వాస్తవం ఇందులో ఎవరికి వారు తాము ప్రధాని కావాలన్న భావనలో ఉన్నారు. ఈమేరకు లెక్కలు వేసుకుంటున్నారు. తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతాబెనర్జీ, ఎన్‌సీపీ చీఫ్ శరద్‌పవార్ ప్రధాని పదవి రేసులో ఉన్నారు. ఇక కూటమిలో చాలా పార్టీలు అసంతృప్తితో ఉన్నట్లు బీజేపీ నాయకులు భావిస్తున్నారు. కేరళ, తమిళనాడులో కూటమి పార్టీలే పోటీ పడడంతో తమకు సీట్లు పెరుగుతాయని అంచనా వేస్తున్నారు.
మోదీ చరిష్మాపై నమ్మకం..
ఇక బీజేపీ పూర్తిగా మోదీ చరిష్మానే నమ్ముకుంది. పదేళ్ల పాలనలో దేశం సురక్షితంగా ఉండడం, ప్రపంచంలో భారత్‌ను మూడో ఆర్థిక శక్తిగా ఎదిగేలా చేయడం, పాకిస్థాన్‌ను తీవ్రంగా దెబ్బకొట్టడం వంటి ఘటనలు బీజేపీకి కలిసి వస్తాయని కమలం నేతలు ధీమాతో ఉన్నారు. మొత్తంగా ఎన్డీఏ కూటమి 380 నుంచి 400 సీట్లు సాధిస్తుందని భావిస్తున్నారు. మొత్తంగా దేశంలో ముచ్చటగా మూడోసారి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని, మోదీ మూడోసారి ప్రధాని అవుతారని కమలం నేతలు నమ్మకంతో ఉన్నారు. మరి బీజేపీ అంచనాలు ఏమేరకు నిజమవుతాయో చూడాలి.