TDP Congress Alliance: రాజకీయాలు ఎలాగైనా మారుతాయి. ఎంతకైనా దిగజారుతాయి. మొన్నటిదాకా విమర్శలు చేసుకున్న నాయకులు చేయి చేయి వేసుకొని భాయీ భాయీ అంటారు.. ఒకరినొకరు తిట్టుకున్నచోటే కలిసిపోతారు. అందుకే స్మశానం ముందు ముగ్గు, రాజకీయ నాయకులకు సిగ్గు ఉండవంటారు. పొత్తులైనా, కూటములైనా అంతిమంగా ఆశించేది అధికారమే కాబట్టి.. దానికోసం రకరకాల ప్రణాళికలు రాజకీయ పార్టీలు రూపొందిస్తాయి.. ప్రస్తుతం పార్లమెంటు ఎన్నికలకు గడువు సమీపిస్తున్న నేపథ్యంలో కొత్త కొత్త పొత్తులు తెరపైకి వస్తున్నాయి. సరికొత్త భేటీలు కార్యరూపం దాల్చుతున్నాయి. అయితే వీటి అంతిమ ప్రయోజనం ఎలా ఉంటుంది అనేది పక్కన పెడితే.. ప్రస్తుతానికైతే పొలిటికల్ సర్కిల్లో రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి.
ఇటీవల ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ జాతీయస్థాయి నాయకులు భేటీ అయ్యారు. దక్షిణ భారతదేశంలో కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో అధికారంలో ఉండడం.. తమిళనాడు ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండడంతో సహజంగానే ఈ భేటీలో దక్షిణ భారతదేశానికి చెందిన నాయకులకు సముచిత ప్రాధాన్యం లభించింది. ఈ సందర్భంగా మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ వంటి వారు నాయకుల అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఈ క్రమంలో కొంతమంది కాంగ్రెస్ నాయకులు ఇండియా కూటమిలోకి టిడిపిని ఆహ్వానించాలని సూచించినట్టు ప్రచారం జరుగుతోంది. దీనిని టిడిపికి అత్యంత సన్నిహితంగా ఉండే ఏబీఎన్ ఛానల్ పదేపదే ప్రసారం చేస్తోంది. అంతేకాదు చంద్రబాబు ఇండియా కూటమిలోకి వస్తే ప్రయోజనం ఏమిటనే ప్రశ్నను రాహుల్ గాంధీ లేవనెత్తారని.. ఆయన గతంలో ఎన్డీఏ కూటమిలో ఉన్నప్పుడు సముచిత గౌరవం దక్కలేదని.. అందుకే ఆయన ఇండియా కూటమిలోకి వస్తే బాగుంటుందని కొంతమంది కాంగ్రెస్ నాయకులు అన్నట్టు వినికిడి. సహజంగానే టిడిపికి డప్పు కొట్టే ఏబీఎన్ ఈ విషయాన్ని పదే పదే ప్రస్తావించడం వెనుక అసలు ఉద్దేశం వేరే ఉంది. ప్రస్తుతం ఏపీలో ఎన్నికలకు నోటిఫికేషన్ వస్తుంది అని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో.. ఆ ఎన్నికల్లో టిడిపి జనసేన కలిసి పోటీ చేస్తాయని వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో.. షర్మిలకు కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు అప్పగిస్తారని ఊహగానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో.. జగన్ ను ఎదుర్కోవాలంటే కచ్చితంగా షర్మిల సహకారం తీసుకోవాలని.. అందుకు కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు ఆమెకు అప్పగిస్తే అది సాధ్యమవుతుందని.. టిడిపి అధినేత చంద్రబాబు భావిస్తున్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ భేటీలో ఈ విషయం ప్రస్తావనకు వచ్చింది.
ఇక ఇదే చంద్రబాబు గతంలో కాంగ్రెస్ తో కూటమిని ఏర్పాటు చేశారు. మోడీకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఉన్న పలు ప్రతిపక్ష పార్టీలకు ఫండింగ్ చేశారని ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలోనే సొంత రాష్ట్రంలో అధికారాన్ని కోల్పోయారు. అంతే కాదు 2019 ఎన్నికలకు ముంగిట ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై అడ్డగోలుగా ఆరోపణలు చేశారు.. అయితే చంద్రబాబు వ్యవహార శైలి తెలిసిన నరేంద్ర మోడీ ఆయనను దూరం పెట్టారు. అధికారాన్ని కోల్పోయిన తర్వాత చంద్రబాబు ఎన్ డి ఏ కూటమిలోకి వెళ్లడానికి రకరకాల ప్రయత్నాలు చేశారు. అయితే అవేవీ అంతగా ఫలించలేదు. ఏపీలో అధికారాన్ని దక్కించుకోవడం చంద్రబాబు నాయుడుకు అత్యంత ముఖ్యం కాబట్టి ఆయన రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీతో వచ్చే ఎన్నికల్లో పొత్తు ఉంటుందని టిడిపి శ్రేణులకు పరోక్షంగా సంకేతాలు ఇస్తున్నారు. ఈ పొత్తు టిడిపికి అధికారాన్ని కట్టబెడుతుందా, ఇండియా కూటమిని అధికారంలోకి తీసుకొస్తుందా? అనే ప్రశ్నలకు కాలమే సమాధానం చెబుతుంది.