YCP- Three Capitals Issue: అమరావతి రైతుల మహా పాదయాత్రను అడ్డుకోవాలని అధికార వైసీపీ చేయని ప్రయత్నమంటూ లేదు. కానీ అది రైతుల స్వచ్ఛంద ఉద్యమం కావడంతో ఎన్ని ఆటంకాలు సృష్టించినా సజావుగా సాగిపోతోంది. రోజురోజుకూ గమ్యానికి చేరువవుతోంది. వారిది న్యాయబద్ధమైన ఆందోళన కావడంతో ప్రజలు స్వచ్ఛందంగానే మద్దతు తెలుపుతున్నారు. స్వయంగా ఎదురెళ్లి స్వాగతం పలుకుతున్నారు. అయితే మూడు రాజధానులకు మద్దతుగా..మరీ ముఖ్యంగా విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ను చంద్రబాబు, పవన్ తో పాటు విపక్షాలు అడ్డుకుంటున్నాయని వైసీపీ ఉత్తరాంధ్ర నాయకులు పోరాట బాట పట్టారు. ప్రజల్లో భావోద్వేగాన్ని రగిల్చే ప్రయత్నం చేశారు. కానీ జనం మాత్రం లైట్ తీసుకున్నారు. అదో కృత్రిమ, రాజకీయ ఉద్యమమని మెజార్టీ ప్రజలకు తెలుసు. అందుకే వారు వైసీపీ నేతలతో చేయి కలపలేకపోతున్నారు. సహజంగానే ఇది ప్రభుత్వానికి, ప్రభుత్వ పెద్దలకు రుచించడం లేదు. అందుకే ఉత్తరాంధ్ర వైసీపీ నేతలపై ఒత్తిడి పెంచుతున్నారు. అయితే మేము ఎన్నిచేస్తున్నా ప్రజల నుంచి మద్దతు రానప్పుడు.. ఏంచేస్తామని నేతల నుంచి నిర్వేదం ఎదురవుతోంది.

కొందరు వైసీపీ నేతలు రాజీనామా అస్త్రాన్ని బయటకు తీస్తున్నారు. తమ పదవులకు రాజీనామా చేసి మూడు రాజధానులకు మద్దతుగా ప్రజల నుంచి మద్దతు కోరతామని భావిస్తున్నారు. అయితే ఇది ఎంతవరకు వర్కవుట్ అవుతుందన్న ప్రశ్న అయితే ఎదురవుతోంది. కొందరు ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించారు. మంత్రి ధర్మాన ప్రసాదరావు అయితే ఒక అడుగు ముందుకేశారు. సీఎం జగన్ పర్మిషన్ ఇస్తే మంత్రి పదవిని తృణప్రాయంగా విడిచిపెట్టి ఉత్తరాంధ్ర ప్రజల కోసం ఉద్యమించాలని ఉందని చెప్పారు. అయితే ధర్మాన మరీ ఉత్తరాంధ్ర కోసం ఇంతలా ఆలోచన చేస్తున్నారేంటబ్బ అన్న ఆలోచనలో ఉన్నప్పుడు.. రామోజీరావు విశాఖపై ధర్మాన ప్రేమ వెనుక ఉన్న భూ కథలను బయటకు చెప్పేశారు. ఇంకేముంది ధర్మాన మూడు రాజధానుల ఉద్యమంలో వెనుకబడిపోయారు. నేరుగా తనపై వచ్చిన భూ ఆరోపణలపై సెలవు ఇవ్వకుండా.. ఇదంతా మూడు రాజధానులను అడ్డుకోవడం కుట్రేనంటూ.. తనపై వచ్చిన ఆరోపణలను ప్రజలకు రుద్దే ప్రయత్నం చేశారు.
దాదాపు అవినీతి ఆరోపణలున్నా ఉత్తరాంధ్ర ఎమ్మెల్యేలు, మంత్రులే రాజీనామాకు సిద్ధపడుతున్నారు. అయితే వీరి టెక్నిక్ కు ప్రజలు నమ్ముతారా? అంటే అదీ లేదు. ఎందుకంటే ఉత్తరాంధ్ర ప్రజల్లో భావోద్వేగాలను నింపే ప్రయత్నంలో ఉండగా విపక్షాలు తమ పని పూర్తిచేశాయి. నేతల అవినీతిని ప్రజల ముందు ఉంచాయి. అటు టీడీపీ సేవ్ విశాఖ, ఇటు పవన్ కళ్యాణ్ వైసీపీ నేతల అవినీతిని టార్గెట్ చేయడంతో అసలుకే ఎసరు వచ్చింది. వైసీపీ నేతల కృత్రిమ ఉద్యమం వైపు ప్రజలు అనుమానపు చూపులు చూడడం ప్రారంభించారు. నాడు విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమం నాడు రాజీనామాలతో ఏం వస్తాయని అన్న వైసీపీ నేతలు..ఇప్పుడు ఏ ఉద్దేశ్యంతో రాజీనామా అస్త్రాలను సంధిస్తున్నారో గుర్తెరగని స్థితిలో ప్రజలు లేరు. అందుకే రాజీనామాలు వర్కవుట్ అయ్యే పరిస్థితులు లేవని సాక్షాత్ అధికార పార్టీకి చెందిన కొందరు నాయకులే బాహటంగా చెబుతున్నారు.

విశాఖ క్యాపిటల్ రాజధాని ప్రకటించడం సాగర నగర ప్రజలకే నమ్మబుద్ది కావడం లేదు. రాజధాని ప్రకటించారన్న ఆనందం లేదు. అలాగని వ్యతిరేకించడం లేదు. గుంభనంగా ఉంటూ వస్తున్నారు. ఉత్తరాంధ్ర ప్రజలు కూడా విశాఖలో ఉంటే ఎందుకు? మంగళగిరిలో ఉంటే మనకెందుకు? అన్న భావనలో ఉన్నారు. పోనీ విశాఖ ఎగ్జిక్యూటివ్ కు ఉత్తరాంధ్ర ప్రజలు సానుకూలంగా ఉన్నారనుకుందాం. ప్రజా ఉద్యమాన్ని నిర్మించి తరువాత వైసీపీ నేతలు ఎంటరైతే మంచిది. కానీ ఉద్యమాలు మేము చేస్తాం.. మీరు రండి అంటూ ప్రజలకు వైసీపీ నేతలు పిలుస్తుండడమే అసలు సమస్య. మేము రోడ్డుపైకి వచ్చి పోరాడితే మీరు రాజకీయ లబ్ధి పొందుతారా? అంటూ ప్రశ్నించడం మొదలు పెట్టారు. లక్షమందితో విశాఖలో గర్జిస్తామన్న వైసీపీ నేతలు పది, పదిహేను వేల మందితో గర్జనకు పరిమితమయ్యారంటే ముమ్మాటికీఅదే కారణం. ఇప్పటికైనా వైసీపీ నేతలు లేనిపోని ఆలోచనలను కట్టిపెట్టి ప్రజాభిప్రాయానికి అనుగుణంగా నడుచుకోవాల్సిన అవసరమైతే ఉంది. లేకుంటే ప్రజల్లో పలుచన కాక తప్పదు.