Janasena-TDP: ఏపీ రాజకీయాలు ఇప్పుడు మూడు ముక్కలాటగా మారింది. ఒకటి తిరుగులేకుండా ఉన్న అధికార వైసీపీ.. కూలబడిపోయిన ప్రతిపక్ష టీడీపీ మరోవైపు.. మధ్యలో కింగ్ మేకర్ లా జనసేన.. వచ్చేసారి ఎన్నికల్లో ఏ పార్టీ గెలపునకు అయినా ‘జనసేన’ కీలకంగా మారింది. కింగ్ మేకర్ లా అవతరించే చాన్స్ కనిపిస్తోంది. దీంతో పవన్ కళ్యాణ్ ఏ పార్టీతో వెళితే ఆ పార్టీకే అవకాశాలు మెరుగ్గా ఉంటాయి. పవన్ కళ్యాణ్ ఏం చేస్తారన్నది నేటి ఆవిర్భావ సభతో తేలనుంది.
నవ్యాంధ్ర ప్రజలు ఒకసారి చంద్రబాబుకు, మరోసారి జగన్మోహన్ రెడ్డికి అవకాశం ఇచ్చారు. వైసీపీ అధికారంలోకి వచ్చి అప్పుడే మూడేళ్లు గడిచిపోయింది. గతంలో వైసీపీ అధికారంలోకి వచ్చేందుకు తోడ్పాటు అందించిన వర్గాలు క్రమంగా ఆపార్టీకి దూరంగా జరుగుతున్నాయి. మూడేళ్లలోనే వైసీపీపై పెద్దఎత్తున వ్యతిరేకత వస్తుండటాన్ని చూస్తుంటే ప్రజలు మార్పును కోరుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈక్రమంలోనే ప్రజలంతా తమ కోసం పోరాటం చేస్తున్న జనసేనకు అండగా నిలువాలని డిసైడ్ అయినట్లు కన్పిస్తోంది.
2014 సార్వత్రిక ఎన్నికల్లో జనసేనాని టీడీపీ, బీజేపీ కూటమికి మద్దతు ఇవ్వగా ఆ కూటమి అధికారంలోకి వచ్చింది. మొదట్లో టీడీపీ నేతలు జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు ప్రాధాన్యం ఇచ్చారు. అయితే కొద్దిరోజుల్లోనే టీడీపీ నేతలు అధికారం పొగరుతో జనసేన నేతను తక్కువ చేసి మాట్లాడాడంతో విభేదాలు మొదలయ్యాయి. చంద్రబాబు నాయుడు సైతం టీడీపీ నేతలకు అడ్డుకట్ట వేయకపోవడంతో జనసేనాని టీడీపీకి దూరంగా జరిగారు.
2019 ఎన్నికల్లో టీడీపీ, జనసేన పార్టీలు వేర్వేరుగా పోటీ చేశాయి. జనసేన తనతో కలిసి వచ్చిన వామపక్షాలు, బీఎస్పీతో ముందుకెళ్లారు. అయితే పవన్ కల్యాణ్ అనుకున్న ఫలితాలు మాత్రం రాలేదు. ఇక ఐదేళ్లు అధికారంలో ఉన్న టీడీపీ.. జనసేనను పొమ్మనలేక పొగ పెట్టడంతో గత ఎన్నికల్లో తగిన మూల్యం చెల్లించుకుంది. గతంలో ఎన్నడూలేని విధంగా టీడీపీ కేవలం 23 సీట్లకే పరిమితమై దారుణ ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. మరోవైపు టీడీపీ నేతలను వైసీపీ ఒక్కొక్కరిగా టార్గెట్ చేస్తుండటంతో ప్రస్తుతం ఆపార్టీలో ఎంత మంది ఉన్నారన్న సంఖ్య కూడా తెలియడం లేదు.
రాబోయే ఎన్నికలు జనసేన, టీడీపీలకు కీలకంగా మారాయి. జనసేన ఆవిర్భవించి తొమ్మిదేళ్లు అవుతోంది. ఈక్రమంలోనే పార్టీని ముందుకు తీసుకెళ్లాలన్నా, క్యాడర్ ను కాపాడుకోవాలన్నా జనసేన అధికారంలోకి రావడం తప్పనిసరిగా మారింది. మరోవైపు టీడీపీకి సైతం రాబోయే ఎన్నికలు కత్తి మీద సాములా మారాయి. గతంలో జనసేన-టీడీపీ కూటమికి ప్రజలు పట్టం కట్టడంతో వైసీపీని ఢీకొట్టాలంటే మరోసారి అదే ఫార్మూలాను వర్కౌట్ చేయాలని అటు టీడీపీ, ఇటూ జనసేన నుంచి డిమాండ్లు విన్పిస్తున్నాయి.
కిందటి స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ, జనసేన కూటమి అవసరమైన చోట్ల లోపాయికారిగా ఒప్పందాలు చేసుకొని మంచి ఫలితాలు సాధించాయి. దీంతో జనసేన టీడీపీతో వెళితే మంచి ఫలితాలు ఉంటాయని ఆపార్టీ నేతలు పవన్ కల్యాణ్ కు సూచిస్తున్నారు. ప్రస్తుతం ఏపీలో బీజేపీతో జనసేన పొత్తును కొనసాగిస్తోంది. బీజేపీతో కలిసి పలు కార్యక్రమాలకు పిలుపునిచ్చినా పెద్దగా ఫలితం రావడం లేదు. అదే జనసేన పిలుపునిస్తే మాత్రం ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోంది.
Also Read: ఏపీ ఆర్థికమంత్రిగా విజయసాయిరెడ్డి.. జగన్ సంచలనం?
ఈక్రమంలోనే ఆంధ్రప్రదేశ్ లో ఓటింగ్ శాతం, సీట్లు లేని బీజేపీతో కలిసి ముందుకెళ్లడం కంటే టీడీపీతో కలిసి సాగడం మంచిదని జనసైనికులు అధినేత దృష్టికి తీసుకెళ్లారు. క్షేత్రస్థాయిలో టీడీపీ బలానికి తమ బలం తోడయితే అధికారంలోకి రావచ్చని అంటున్నారు. అంతేకాకుండా జనసేన చెప్పుకొదగిన సీట్లు సాధించి రాబోయే రోజుల్లో బలమైనశక్తి ఎదిగే అవకాశం ఉంటుందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఏపీలో బలంగా ఉన్న వైసీపీని ఎదుర్కోవాలంటే మరో బలమైన టీడీపీతో చేతులు కలిపితే ప్రజలు కోరుకుంటున్న మార్పు సాధ్యమవుతుందని జనసైనికులు లెక్కలు వేస్తున్నారు. ఈక్రమంలోనే టీడీపీ-జనసేన పొత్తుపై సైతం పవన్ కల్యాణ్ నేటి సభలో క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. రాబోయే ఎన్నికలే టార్గెట్ గా ముందుకెళుతున్న జనసేనాని టీడీపీ విషయంలో తమ వైఖరిని ఈ వేదిక ద్వారా స్పష్టతనిచ్చే అవకాశం ఎక్కువగా కన్పిస్తోంది. దీంతో జనసేనాని టీడీపీతో పొత్తు విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే ఆసక్తిని జనసైనికులతోపాటు రాజకీయ విశ్లేషకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Also Read: పవన్ కళ్యాణ్ టార్గెట్ అదేనా? కీలక ప్రకటనకు రంగం సిద్ధం!